దేశవ్యాప్త అన్నదాతలు పోరాటానికి కేంద్రం తలొగ్గింది. మూడు కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం ఉదయం జాతిని ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని మోదీ వ్యవసాయ చట్టాల రద్దుపై కీలక ప్రకటన చేశారు. కాగా ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాల్లో దేన్నీ మార్చుకొని కేంద్ర ప్రభుత్వం.. రైతులు చేసిన భారీ పోరాటానికి వ్యవసాయ చట్టాలపై వెనకడుగు వేసింది. అయితే ఇది అంత ఆషామాషీగా జరగలేదు. కేంద్రం చేసిన మూడు నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా కిసాన్ ఉద్యమాలు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దేశాన్న హోరెత్తించాయి. ఒక దశలో ప్రపంచం అంతా ఈ రైతు ఉద్యమానికి జై కొట్టింది. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ సర్కార్ కూడా రైతు చట్టాలకు వ్యతిరేకంగా భారీ ఉద్యమం చేపట్టిన విషయం తెలిసిందే.
అన్ని ఉద్యమాలు ఫలించి చివరకు ప్రధాని మోదీ వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో రైతు చట్టాల రద్దుపై తీర్మానం చేయనున్నట్లు వెల్లడించారు. 100 మంది రైతుల్లో.. 80 మంది రైతుల వద్ద రెండు ఎకరాల లోపే భూమి ఉండగా.. ఆ భూమే వారికి జీవనాధారం అని, కొత్త సాగు చట్టాలు వీరికి అనుకూలంగా లేవని.. అందుకే మూడు నూతన సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నామని అన్నారు. నెల రోజుల్లో ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో ఈ ప్రక్రియ పూర్తి అవుతుందని ప్రధాని తెలిపారు. ధర్నాలు చేస్తున్న రైతులంతా తమ ఇండ్లకు వెళ్లిపోవాలని కోరుతూ.. రైతులను ఎంతగానో ఇబ్బంది పెట్టినందున దేశంలోని రైతులందరికీ క్షమాపణలు చెబుతున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఇకనుండి రైతు బాగు కోసం మరింత కఠినంగా పనిచేస్తానని, రైతుల స్వప్నాలను, దేశ కలలు నిజం చేసేందుకు కృషి చేస్తానని ప్రధాని మోదీ పేర్కొన్నారు.