తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు సహా వ్యవసాయాభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నారని కేంద్ర వ్యవసాయ శాఖ ప్రశంసించింది. రాష్ట్రంలో అమలుచేస్తున్న రైతుబంధు, రైతు సమన్వయ సమితిలను కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి నరేంద్రసింగ్ తోమర్ అభినందించారు. గురువారం వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వ్యవసాయ శాఖ మంత్రులతో నరేంద్ర సింగ్ తోమర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రం కొత్తగా తీసుకొస్తున్న అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్టర్ ఫండ్ స్కీమ్ పై రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను కోరారు.
తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు, రైతు సమన్వయ సమితి అంశాలను సమావేశంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. దేశంలో వ్యవసాయ రంగానికి సంబంధించిన పలు అంశాలను వివరించిన కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ కార్యదర్శి సంజయ్ అగర్వాల్ తెలంగాణలో అమలవుతున్న పథకాలను కొనియాడారు. రైతు సమితులతో రైతులు సంఘటితమయ్యే అవకాశం కలిగిందని, వీటి ద్వారా కేంద్రం కొత్తగా తెస్తున్న పథకాన్ని సమర్ధవంతంగా అమలు చేయవచ్చని అగర్వాల్ అన్నారు.
సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కేంద్రానికి పలు సూచనలు చేశారు. వ్యవసాయ, మౌలిక సదుపాయాల పెట్టుబడి పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం స్వాగతిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో పంటల సాగు వివరాలను వివరించిన మంత్రి వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెట్టే వారికి వడ్డీ భారంగా మారకుండా చూడాలని సూచించారు. రైతులకు సరిపడా యూరియా త్వరగా సరఫరా చేయాలని, వ్యవసాయ మార్కెట్ల నిర్వహణలో సంస్కరణలకు సంబంధించి స్పష్టత ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరారు. ఈ సమావేశంలో రైతుబంధు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి బీ జనార్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.