జీఎస్టీ పరిహారంలో సెస్ మిగిలితే కేంద్రం కన్సాలిడేటెడ్ ఫండ్ రూపంలో జమచేసి వాడుకుంటోంది. సెస్ తగ్గినప్పుడు రాష్ట్రాలు అప్పులు తీసుకోవాలని సూచించడం సబబు కాదని, కేంద్రమే జీఎస్టీ పరిహారం చెల్లించాలని ఆర్ధిక శాఖామంత్రి హరీష్ రావు అన్నారు. కేంద్ర ఆర్ధిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో వర్చువల్ విధానంలో 41వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు బీఆర్కే భవన్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్రాలు జీఎస్టీలో చేరడం వల్ల 60 నుండి 70 శాతం వరకు ఆదాయాన్ని కోల్పోయాయి. కేంద్రం మాత్రం 31 శాతం మాత్రమే కోల్పోయింది. అందువల్ల కేంద్రం జీఎస్టీ పరిహారం చెల్లించాల్సిందేనని డిమాండ్ చేశారు.
రాష్ట్రాలు అప్పులు తీసుకుంటే రాష్ట్రానికో వడ్డీ రేటు ఉంటుంది. దీనివల్ల ఎంత కాల పరిమితితో తీసుకోవాలి? ఎన్ని సం.లు. చెల్లించాలి? ఎఫ్ఆర్బీఎం పరిమితులు వంటి సమస్యలతో పాటు చెల్లింపుల్లోనూ గందరగోళం తలెత్తుతుందన్నారు. కేంద్రమే అప్పు తీసుకుంటే వడ్డీ రేటు తగ్గుతుంది కాబట్టి గతంలో హామీ ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకొని రెండు నెలలకోసారి జీఎస్టీ పరిహారం చెల్లించాలని హరీష్ రావు కోరారు. 15 వ ఆర్ధికసంఘం కేటాయింపుల్లో కూడా తెలంగాణకు నష్టం జరిగినట్లు మంత్రి గుర్తుచేశారు. ఐజీఎస్టీకి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి రూ. 2700 కోట్లు రావాల్సి ఉందని, వెంటనే ఈ మొత్తాన్ని విడుదల చేయాలన్నారు. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రం రూ. 18 వేల 82 కోట్లు జీఎస్టీ సెస్ కింద కేంద్రానికి చెల్లించిందని, కానీ తీసుకున్నది మాత్రం రూ. 3 వేల 223 కోట్లు మాత్రమేనని పేర్కొన్నారు.
జీఎస్టీ కౌన్సిల్ రెండు ప్రతిపాదనలు అన్ని రాష్ట్రాల ముందు ఉంచింది. వాటిలో మొదటిది.. కేంద్ర ప్రభుత్వమే రుణం తీసుకుని రాష్ట్రాలకు ఇవ్వనుంది. కేవలం జీఎస్టీ అమలులో ఏర్పడిన రెవెన్యూ లోటు రూ. లక్షా 65 వేల కోట్లు రాష్ట్రాలకు ఇవ్వడం జరుగుతుంది. రెండవ ప్రతిపాదన.. జీఎస్టీ, కోవిడ్ కారణాల వల్ల ఏర్పడిన రెవెన్యూ లోటు రూ. 3 లక్షల కోట్లను రుణంగా తీసుకుని రాష్ట్రాలకు చెల్లించడం జరుగుతుంది. ఈ రుణం రాష్ట్రాల పేరుమీద జీఎస్టీ కౌన్సిల్ తీసుకుని వడ్డీతో సహా రుణాన్ని చెల్లించడం జరుగుతుంది. ఈ రెండు ప్రతిపాదనలపై రాష్ట్రాలు ఏడు పని దినాల్లో తమ అభిప్రాయాలను వెల్లడించాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సీఎస్ సోమేశ్ కుమార్, ఆర్ధిక, పన్నుల, వాణిజ్య శాఖల అధికారులు పాల్గొన్నారు.