By: విశ్వరూప్
చంద్రబాబు తెలంగాణకు వ్యతిరేకం కాదట! తెలంగాణలో పాదయాత్ర జేసుకోవడం కోసం పాపం రోజుకొకసారి మొత్తుకుంటుండు నేను తెలంగాణకు వ్యతిరేకం గాదని. మంచిది చంద్రబాబూ, నువ్వు మరి తెలంగాణకు అనుకూలమా? గది జెప్పరాదు జెర? మాటిమటికి నేనెప్పుడో ప్రణభ్ కమిటీకి లెటరిచ్చిన, దాన్ని ఇంతవరకు వెనక్కి తీసుకోలేదు అంటవు. ఒక్కసారన్న అదే లెటరు సారాంశానికి ఇంకా కట్టుబడి ఉన్న అని జెప్పినవ?
నువ్వేమొ, తెలంగాణను నేనెన్నడు అడ్డుకోలేదంటవు, కని డిసెంబరు 2009న నీతోనే ఉన్న నీ అప్పటి పార్టీ నేతలు ప్రవీణ్ కుమార్ రెడ్డి, నాగం జనార్ధన్ రెడ్డి ఏమొ నువ్వే సమైక్యాంధ్ర ఉద్యమానికి సూత్రధారివి, అంత ఎన్‌టీఆర్ భవన్ నుంచి నీ డైరెక్షన్లనే నడీచింది అని జెప్పుతరు. సరే, వాల్లు నీ పార్టీ విడిచిపెట్టినందుకు తొండి జేస్తున్నరనుకుందాం, మరి రాజీనామ లేఖలు కాంగ్రేస్, తెదేపా ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరివి ఒక్కటే ఫార్మాట్లో ఎట్ల ఉన్నవి?
నీ నోట్లె పురుగులు పడ, ఆనాడు అఖిల పక్షంల “మీకు దమ్ముంటె బిల్లు బెట్టుండ్రి, మేము మద్దతియ్యకుంటె అడుగుండ్రి” అన్న నోటితోటే వారం కుడ గడవకుండ “ఎవర్నడిగి అర్ధరాత్రి నిర్ణయం తీసుకున్నరు?” అంటివి, ఇప్పుడు నేను వ్యతిరేకం గాదన్నంతమాత్రాన గవన్ని ఎట్ల మరిశిపొమ్మంటవ్? నీలాంటి పూటకోమాట మాట్లాడేటోని మాటలు ఎట్ల నమ్మమంటవ్?
చంద్రబాబూ, తెలంగాణకు నేను వ్యతిరేకం గాదంటున్నవ్ గని, తెలంగాణకు జరిగిన అన్యాయాలమీద ఏనాడన్న కొట్లాడినవా, కనీసం మట్లాడినవ? తెలంగాణను ముంచేసే పోలవరం ప్రాజెక్టుకని నీ కోస్తాంధ్ర తమ్ముల్లకోసం దీక్షకు గూసుంటువి, మరి ఏనాడన్న తెలంగాణకు పనికొచ్చే శ్రీశైలం ఎడమ కాలువ గురించన్న, ఏఎమ్మార్ ప్రాజెక్టు, ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టు గురించన్న కనీసం మాట్లాడినవా, నువ్వధికారంల ఉన్నప్పుడూ వాటికోసం ఏమన్న జేసినవా? ఆరొందల పదిజీవొ గురించి ఏనాడన్న మాట్లాడినవా, నల్లగొండ ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి ఏమన్న జేసినవా?
నిన్నగాక మొన్న సాగర్ల నీళ్ళు లేకపోయినా సాగర్ నీళ్ళను ప్రకాశం బ్యారేజీకి విడుదల జెయ్యాలని పార్టీ తరఫున ఆందోళన జేపిస్తివి, మరి ఇక్కడ తెలంగాణోల్ల గోస నీకు కనపడలేదా? మాకు మెడికల్ కాలేజీల సీట్లపెంపులో అన్యాయం జేసినప్పుడన్న గొంతు విప్పినవా? గివన్నిటిమీద ఎన్నడూ మాట్లాడనోడివి ఖర్మగాలి రేపు తెలంగాణ ఏర్పడ్డంక గుడ తెలంగాణల నీ పార్టీనే అధికారంలోకి వచ్చిందనుకో తెలంగాణ కడుపున మల్లీ మట్టిగొట్టవని నమ్మకమేంది? నీ రెండుకండ్ల సిద్ధాంతంల రెండు కండ్లు సీమాంధ్ర దిక్కేనని మాకు తెల్వదా?
గవన్నెందుకు గని నీదొక సీమాంధ్ర పార్టీ. మేము కొట్లాడేదే సీమాంధ్ర పెత్తనం వద్దని. ఇంక నీ పార్టీని మా దగ్గర ఎట్ల ఉండనిస్తం? రేపు నీ తర్వాత నీ పార్టీ నాయకత్వం ఏ బాలయ్యకో, లోకేశ్‌బాబుకో వస్తది గని తెలంగాణ నాయకుడికి దక్కుద్దా? గందుకే నీది ఆంధ్రపార్టీ!
తెలంగాణ మీద స్పష్టమైన వైఖరి జెప్పమని మేమడిగేది నువ్వేదో తెలంగాణకు అనుకూలంగ వైఖరి జెప్పితె వోటేస్తమని గాదు. నువ్వు మాకు వ్యతిరేకం గాదని ఎంత బొంకినా మేము నీకూ, నీ పార్టీకి వ్యతిరేకమే. ఒకసారి వోట్లేసి ముప్పై అయిదు సీట్లిచ్చినందుకు, నీకు వోట్లేసిన అధికారంతోనే ఇప్పుడు మాటదప్పినందుకు నిలదీస్తున్నం. నువ్వు మల్లీ మాటమార్చినా నీకు వోట్లు పడేది మాత్రం కల్ల.