mt_logo

చంద్రబాబుతో జర జాగ్రత్త!

By: అల్లం నారాయణ


మంథని నుంచి మహదేవ్‌పూర్ వెళ్లే రోడ్డులో కాటారం ఒక జంక్షన్ లాంటిది. కాటారం నుంచి భూపాల్‌పల్లి దాకా చూడ నిజంగానే చక్కని రోడ్డొకటి ఉంటుంది. ఆ రోడ్డులో ఉండేదా కాలనీ. ఆంధ్రా కాలనీ. అట్లాంటిదే మంథని దగ్గర వెగ్లాస్‌పూర్‌లోనూ ఒక కాలనీ ఉండేది. కారంచేడు నుంచి నేరుగా దిగుమతి అయివచ్చిన ఆంధ్రులు. సీతయ్య అని ఇంటర్‌లో నాకొక కారంచేడు నుంచొచ్చిన క్లాస్‌మేట్ కూడా ఉండేవాడు. ఆ కాలనీలు భిన్నంగా ఉండేవి. కాటారం దగ్గరి కాలనీ కానీ, మంథని దగ్గరి కాలనీ కానీ, ఆ మాటకొస్తే శ్రీరాంనగర్‌లూ, శాంతినగర్‌లూ నిజామాబాద్ నుంచి వరంగల్, నల్లగొండల దాకా ఎక్కడున్నా భిన్నంగానే ఉండేవి. వ్యవసాయదారులే అయినా ఆంధ్రావాళ్లు భిన్నంగా ఉండేవాళ్లు. స్థానికులు తునికాకు సుట్ట కాలిస్తే, వాళ్లు గుంటూరు పొగాకు చుట్టలు తాగేవాళ్లు. పొగాకు వాసనేసే వాళ్లు పొలాల మీద కూడా భిన్నంగా వ్యవహరించేవాళ్లు.

తెలంగాణలో పొగాకు పండే భూములు నల్లరేగళ్లు, గోదావరి పొంటి లభ్యమయిన నీళ్లు ఆంధ్రులను రప్పించాయి. అప్పటికే వ్యవసాయం బాగా అభివృద్ధి చెంది, రెండు ప్రాజెక్టులు, పారే కాల్వలతో కృష్ణా డెల్టా ప్రాంతం రైతాంగం,అడ్డపంచెలు కట్టుకున్న రైతాంగం, అక్కడ ఒక్క ఎకరం అమ్మి, ఇక్కడ అగ్గువ సగ్గువకు పది, ఇరవై ఎకరాలు కొనుక్కొని పొగాకు పండించేవారు. ఆంధ్రా కాలనీలు ఉన్నచోట వారి ఆజమాయిషీ పెరిగింది. పొగాకు బేరన్లు, బేళ్లు, వాటి క్యూరింగ్, కూలీలు, సంబంధాలు ఇట్లా తెలంగాణ కొత్త సంస్కృతిని చూసింది. ఈ సంస్కృతి భిన్నమైనది. గెరువు, బీడు, నీటి వనరులు లేని వ్యవసాయంలో, ఆంధ్రుల వ్యవసాయ సంస్కృతి ఆధిపత్యం కొనసాగింది. వాళ్లొక్కరే కష్టపడి పనిచేస్తారని, వాళ్లే మెరుగైన వ్యవసాయం చేస్తారని, ఇళ్లు శుభ్రంగా ఉంచుకుంటారని, పొద్దున్నే కాఫీలు తాగుతారని, సద్దన్నం తింటారని, దానితో పాటు మానవ సంబంధాల మీద కూడా ఆంధ్రా కాలనీల చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా మార్పులే వచ్చాయి. శ్రీరాంనగర్ అనే ఊళ్లో ఒక వ్యవసాయ కూలీని ఆంధ్రులు ఒక మానవ సంబంధం కారణంగా కొట్టి చంపిన ఘటన కూడా జరిగింది.

నిజాం ఫర్మానాలో నిజాంసాగర్ భూముల్లోకి వచ్చిన ఆంధ్రులైనా, పస్ర, గోవిందరావుపేట, ఖమ్మం, కరీంనగర్ గోదావరిలోయ, ఆదిలాబాద్ కడెం ప్రాజెక్టు, మహబూబ్‌నగర్ ఎగువ ప్రాంతాలకు వచ్చినా, హనుమంచిపల్లి దాటుకొని నల్లగొండలో అడ్డగోలుగా ప్రవేశించినా, అప్పటి వలసలన్నీ ఒక సామాజిక వర్గం ప్రధానంగా వచ్చి చేరినవే. ఇది డ్బ్భైయవ దశకం నాటికి కూడా వలసల పరిస్థితి. అయితే చిక్కేమిటంటే వలసలు వచ్చిన వారు, బతకడానికి రావడం వేరు. ఇక్కడి భూములు, ప్రాజెక్టులు, కాలువల మీద కన్నేసి రావడం వేరు. అందువల్ల తొలి వలసలయినా సారాంశంలో ఇక్కడ ఆధిపత్యానికే దారితీశాయి. సాంస్కృతిక సంలీనం కాకుండా, తెలంగాణ సంస్కృతిని, పని విధానాలను, బతుకుదెరువు పద్ధతులను, రాజకీయ, సామాజిక ప్రవర్తనలను చిన్నచూపు చూసి, హేళన చేసి, తమదైన తీరుతెన్నులను, ప్రవర్తనలను ఉన్నతంగా నిలబెట్టి తమ సంస్కృతిని రుద్దే ప్రయత్నం జరిగింది.

ఆధిపత్యం అనేది అందుకే. ఈ ప్రాంతాలన్నింటిలోనూ కనబడే ఒక విచిత్ర మిశ్రమ సంస్కృతే అందుకు నిదర్శనం. అడ్డ పంచెకట్టుకుని వచ్చిన ఆంధ్ర రైతు, ఇక్కడ స్థాపించిన సామాజిక, రాజకీయ, బతుకుదెరువు, భాషా సంస్కృతులు చివరికి వారికి రాజకీయ ఫలితాలనూ ఇచ్చాయి. రైతు వలసలు, భూమి వనరుగా వచ్చిన వలసలు ప్రధానం గా మిగులు వ్యవసాయం కారణంగా విస్తరణను వెదుక్కుంటూ వచ్చి స్థిరపడ్డవి. కానీ ఇప్పుడు ఆ కాలనీలు చాలా వరకు ఖాళీ అయ్యాయి.. ఇక్కడే ఉంది తిరకాసు. వ్యవసాయం ఇంకెంత మాత్రం లాభసాటి కాదని తేలిపోయింది. దశాబ్దాలుగా వున్న రైతు లు ఇక్కడే స్థిరపడినా ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చిన వలసలు తెలంగాణ సంస్కృతీ విధ్వంసంలో కీలకపాత్ర పోషించాయి.

అవే ఇప్పటి తెలంగాణను పూర్తిగా నాశనం చేసి పరాయీకరణ పొందించిన వలసలు. ఇవి పెట్టుబడి వలసలు. అప్పటిదాకా ఆంధ్రవూపదేశ్ రెడ్ల రాజ్యంగా నడిచింది. ప్రత్యేకించి తెలంగాణలో రెడ్లు, వెలమలది, కొంత బ్రాహ్మణులదే రాజకీయ ఆధిపత్యం. అగ్రవర్ణాలూ ఇవే. ఈ అగ్రవర్ణాలకు తోడయింది. ఎన్టీ రామారావు అధికారం భరోసాతో హైదరాబాద్‌లో చెలరేగిపోయింది. ఇప్పుడు పూర్తిగా అగ్రగణ్య వర్ణంగా తయారయ్యింది. కమ్మ సామాజిక వర్గం నలభైలలోనే మెరుగైన వ్యవసాయ పద్ధతులు నేర్చుకుని, భౌగోళిక, నీటి వనరుల లభ్యతలతో పాటు వ్యవసాయ అభివృద్ధిని సాధించిన ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాల సంపన్న రైతాంగం, ఎగువ మధ్యతరగతి రైతాంగం తొలినాళ్ల వలసల్లో వ్యవసాయ సంస్కృతీ ఆధిపత్యం చెలాయిస్తే, ఎన్టీఆర్ అనంతర వలసలు పూర్తిగా హైదరాబాద్‌ను ఆక్రమించుకున్నాయి.

హైదరాబాద్ తెహజీబ్‌ను, గతిని, సంస్కృతిని, భాషను, రాజకీయాలను, సామాజిక స్థితిగతులను శాసించే స్థితికి చేరుకున్నాయి. ఇట్లాంటి వాళ్ల నిఖార్సయిన ప్రతినిధే చంద్రబాబు. అడ్డపంచె కట్టుకుని వలస వచ్చిన రైతు కాదిప్పుడు వలసవాది అంతర్జాతీయ పెట్టు బడిదారుడు. వాళ్ల నిఖార్సయిన ప్రతినిధి చంద్రబాబు.
చంద్రబాబు పాదయాత్ర మొత్తంలోనూ ఆయన తెలంగాణలో ఒక పరాయివాడిగానే మాట్లాడుతున్నారు. తనను తాను వేరే ప్రాంతం నుంచి వచ్చి స్థిరపడి దాదాగిరీ చేస్తున్న వాడిలాగే ఆయన మాటలు ఉంటున్నాయి. పల్లెటూరు లాగా ఉన్న హైదరాబాద్‌ను మహానగరంగా అభివృద్ధి చేసింది నేనే అని ఆయన ప్రకటించుకున్నారు. నిజానికి హైదరాబాద్ ఎప్పుడూ పల్లెటూరులా లేదు. నిజాంలు హైదరాబాద్‌ను ఒక నగరంగానే, అదీ స్వయం సమృద్ధిగల నగరంగానే తీర్చిదిద్దారు.

చిచ్లెం పల్లెటూరు ఇవ్వాల్టి హైదరాబాద్ అయిన క్రమమంతా నాలుగు వందలపైబడిన సుదీర్ఘ చరిత్ర. విద్య, వైద్యం, నీటి సౌకర్యం,రవాణా, మురుగునీటి పారిశుద్ధ్యం, భవనాలు, సౌకర్యాల, ప్రజోపయోగ వసతులు అన్నీ కూడా ఈ దక్కన్ పీఠభూమి తలమాణికంగా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసింది నిజాములే. ఆర్ట్స్ కాలేజీ లాంటి, మక్కా మసీదు లాంటి, చార్మినార్ లాంటి కట్టడాలు ఇక్కడ నెలకొల్పిన వసతులు, పర్షియన్ లేదా యూరప్ లాంటి ఆర్కిటెక్చర్‌లో నిర్మించిన మహాసౌధాలు ఇట్లా చూసినప్పుడు నిజాం ఆనాటికి ఆధునికుడే. యూరప్ తరహాలో అతను పరిక్షిశమలను అభివృద్ధి చేశాడు. కానీ నిజాం దోపిడీ పీడనల స్వభావం వల్ల, ఏ రాజరికమైనా గోళ్లూడగొట్టి తెలంగాణ ప్రజల రక్తమాంసాల మీద నిర్మించిన నగరమిది.

దేశంలో అలనాడూ, ఇప్పుడు హైదరాబాద్ నగరం స్టేటస్ ఒక్కటే. అయిదో స్థానం. అయినా చంద్రబాబు ఈ నగరానికి చెందినవాడు కాడు. పోనీ ఇక్కడి సామాజిక వర్గానికి చెందినవాడూ కాదు. ఇక్కడి సంస్కృతి తెలిసినవాడూ కాదు. గానా బజనాలు, నవాబ్‌గిరీ, జీవితా న్ని ఉన్నదున్నట్టుగా ఆస్వాదించే కొంచెం శ్రమ, కొంచెం ఆరామ్ తెలిసిన వాడూ కాదు. నైట్ లైఫ్ తెలిసిన వాడసలే కాడు. కనుక పొద్దెక్కి లేస్తే కూడా తప్పుపట్టగల కరడుకట్టిన జీవన వ్యాపారి చంద్రబాబు. అందువల్ల ఆయన హైదరాబాద్‌ను అభివృద్ధి చేశానంటాడు. ఒక పరాయివాడి లాగా.

పందొమ్మిది వందలా ఎనభైయవ దశకం తెలంగాణకు సంబంధించిన దురదృష్టకరమైన దశకం. విప్లవాలు నడుస్తుండగానే, ఇక్కడ సామాజిక ఉద్యమాలకూ కత్తులు నూరుకుంటున్న చప్పుళ్లు వినిపిస్తుండగానే, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం, మద్రాసులో నాలుగు డ్యాన్సులాడి, అయిదు కిరీటాలు ధరించి వేషాలు వేసుకున్న ఎన్టీర్ ముఖ్యమంత్రి కూడా అయ్యాడు. అడ్డపంచె కట్టుకున్న రైతు తెలంగాణ గ్రామాల్లో ఆంధ్రా కాలనీలు సృష్టిస్తే… ఎనభైవ దశకంలో ఎన్టీఆర్ భరోసాతో, రాజకీయ బలం అధికారం, బలగం అండతో, విలీనం సమయంలోనే ఇంగ్లిషు చదువులతో సెక్రె తిష్టవేసిన కోస్తా ఉద్యోగివర్గం భరోసాతో ప్రత్యేకంగా కమ్మ సామాజిక వర్గం హైదరాబాద్ మీద గద్దలా వాలింది.

అప్పుడు భూమి వనరు ప్రధానంగా సాగిన వలసలు, ఇప్పుడు హైదరాబాద్ భూమి వనరు ప్రధానంగానే కొనసాగాయి. కానీ ఇది రియల్ ఎస్టేట్. ప్లాట్లు, ప్లాట్లుగా విస్తరించిన వ్యాపార సామ్రాజ్యాలు. నిజాం వద్ద పేరుకుపోయిన సర్ఫెకాజ్ భూములు, షావూసీల, కాందిశీకుల భూములు, పేద రైతాంగం భూములు. అస్సల్ హైదరాబాదీ యాదవుల భూములు ఇట్లా అతిపెద్ద భూవనరు హైదరాబాద్‌కు విపరీతంగా వలసలను పెంచింది. ఆ వలసల ప్రతినిధి చంద్రబాబు. నిజానికి ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత అందుకే తెలుగుజాతి ఆత్మగౌరవం ప్రధాన నినాదం అయ్యింది. తెలంగాణ జాతి అంతరించిపోయింది. డెబ్బయవ దశకంలోనే ఉధృతమైన సినిమా మాధ్యమాల దాడి, అనంతర కాలంలో పత్రికల రూపంలో ఇటీవల కాలంలో ఛానళ్ల జోరులో ప్రస్ఫుటంగా తెలంగాణ సామాజిక, రాజకీయ, భాషా సంస్కృతుల మీద తీవ్రమైన దాడి జరిగింది.

హైదరాబాద్‌కు నాలుగు వందల ఏళ్లకు పైబడిన చరిత్ర ఉన్నది. సంస్కృతి ఉన్నది. విశిష్టత ఉన్నది. సమభావన సంస్కృతికి చిహ్నంగా, జీవితాన్ని ఆస్వాదించడమే ప్రధానంగా లాభాపేక్షలేని, లాభనష్టాల వ్యవహార విజయాల కన్నా, జీవితాన్ని సంపూర్ణంగా జీవించి, ఇతర భాషస్థులను, మతస్థులకు, ఇతర ప్రాంతాల వారిని ఇముడ్చుకున్న గంగా జమునా తహజీబ్ ఉన్నది. కానీ ఈ సంస్కృతిని విధ్వంసం చెయ్యడమే పనిగా పెట్టుకున్నదే తెలుగుదేశం పాలన. తెలుగుదేశం పార్టీ కమ్మ అగ్రగణ్య వర్ణ పార్టీ వాణిజ్య వ్యాపారాల కోసం, ఉద్యోగాల కోసం, మిగులు పెట్టుబడులను వృద్ధి చేసుకోవడం కోసం, ఉన్నత చదువు కోసం ఒక రాజధానీ నగరంగా జీవనాన్ని వెదుక్కుంటూ వచ్చిన ఈ కమ్మ సామాజిక వర్గం అప్పటికే బతక నేర్చిన వర్గం.

అగ్రకులాలన్నింటిలో మద్రాసు రెసిడెన్సీ సాంగత్యం, బ్రిటన్‌లు తెచ్చిన యూరప్ నమూనా సంస్కరణల, ఆధునిక పోకడలు, ఇంగ్లిషు చదువులు, కొత్త సంపన్న వర్గం గా ఈ సామాజిక వర్గం అవతరించింది. కృష్ణా డెల్టా నుంచి వచ్చిన రైతాంగం గ్రామీ ణ ప్రాంతాల్లో పదిహేనేళ్లలో సాధించలేని విషయాలను ఎనభైల తర్వాత వచ్చిన ఎన్టీఆర్ నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ సాధించింది. తెలంగాణలో సాంప్రదాయ ఆధిపత్య కులాలైన రెడ్లకు, వెలమలకు, బ్రాహ్మణులకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ బీసీలను కూడగట్టింది. ఈ ఆధిపత్యం ఇంకా చెల్లదని, అట్లాగే తెలుగు జాతి అని ఒక ఉద్వేగాలను సృష్టించగలిగింది. కొత్త రాజకీయ సంస్కృతికి, ఢిల్లీకి సంబంధంలేని కొత్త రాజకీయ భావజాలానికి తెలంగాణలో కూడా బ్రహ్మరథం పట్టారు. ఇక మొదలైంది విధ్వంసం.

ఈ విధ్వంసానికి మూలకారకుడు ఎన్టీఆర్ అయితే, దాన్ని కొనసాగించి, ఇప్పటికీ హైదరాబాద్ విధ్వంసాన్ని అభివృద్ధిగా చూపి, అదే నా ఘనత అని ప్రచారం చేసుకుంటున్నవాడు చంద్రబాబు. అందుకే చంద్రబాబుకు ఆ దురహంకారం.

హైదరాబాద్ భాషా సంస్కృతులు వేరు. బతుకుదెరువు ప్రవర్తనా రీతులు వేరు. చివరకు నిర్మాణాలు, ఆర్కిటెక్చర్ లాంటి ఉపరితల ఆవర్తనాలన్నీ వేరువేరు. కట్టు, బొట్టు వ్యవహారాలన్నీ వేరు. ఏళ్ల తరబడి ముస్లిం రాజుల పరిపాలన వల్ల హైదరాబాద్ రాజ్య రాజభాష ఉర్దూ. నిజాం పోయిన అనంతరం, భారత దేశంలో భాగమైనాక కూడా, తెలుగు వాడకం పెరిగినప్పటికీ హైదరాబాద్‌లో కానీ, నైజాం ప్రిన్స్ స్టేట్‌లో భాగమైన తెలంగాణ ప్రాంతాల్లో కానీ ఉర్దూ మిశ్రీతమయిన తెలుగు వాడకంలో ఉండేది. ఒక్క తెలంగాణయే కాదు. ఆంధ్ర ప్రాంతంలో వాడే తెలుగులో కూడా ‘రైతు’ లాంటి ఉర్దూ పదాలు కోకొల్లలు. భాషలు నదీ ప్రవాహాల వంటివి. ఇతర భాషల సంలీనం ప్రపంచ భాషలన్నింటిలోనూ ఒక సంస్కారంగా వస్తున్నది.

కానీ ఆంధ్రుల వలసపెత్తనం ఉర్దూ భాషను, అట్లానే తెలుగులో కలిసిపోయిన ఉర్దూ ను ఎద్దేవాచూస్తూ, అవహేళన చేస్తూ ప్రారంభమై, అది చివరికి రెండున్నర జిల్లాల, ఒకటిన్నర కులాల భాషే అసలైన తెలుగుగా స్థిరపడే కుట్ర చేసి, తెలంగాణ మొత్తాన్ని నిమ్నతలోకి నెట్టారు. భాష మీద దాడి జరిగింది. అది చివరికి అతి అనాగరిక రూపాలకు దారి తీసింది. ఇక్కడి ప్రతీకల మీద దాడి జరిగింది. చార్మినార్‌కు పోటీగా హైటెక్‌సిటీ నిలిచింది. భాగ్యలక్ష్మీ దేవాలయం, చార్మినార్ గురించి మనం కొట్లాడుకుంటున్నాం. కానీ.. చంద్రబాబు నమూనా హైటెక్‌సిటీ, ట్యాంక్‌బండ్‌లో విగ్రహాలు మన ల్ని ఎన్నడో పరాయిలను చేశాయి. అదీ చంద్రబాబు వారసత్వం. భూములు ఆక్రమించి కూకట్‌పల్లిలో కూకేటిపాములై, దిల్‌సుఖ్‌నగర్‌లై, సంజీవడ్డి నగర్‌లై, శివా ర్లు, రింగురోడ్లు, జూబ్లీహిల్స్‌లు, బంజారాహిల్స్‌లు కబ్జాలు పెట్టి, విగ్రహాలు కట్టి, కార్ఖానాలు, కంపెనీలు, కార్పొరేట్లు మొలిపించి, అస్సల్ హైదరాబాద్‌ను ధ్వంసం చేసింది చంద్రబాబు.

నిజానికి ఆయన అసలైన ఎన్టీఆర్ వారసుడు కూడా కాడు. ఎన్టీఆర్ నటుడు. కళాకారుడు. కానీ పిల్లనిచ్చి పాపానికి ఆయననే వెన్నుపోటు పొడిచి హైదరాబాద్ మీద విధ్వంస ఆధిపత్య పతాక ఎగరేసి, ఇటేటు రమ్మంటే ఇల్లంత నాదంటున్న చంద్రబాబు తెలంగాణకు అసలు శత్రువు. అగ్రవర్ణాలని ఇవ్వాళ మనం నిర్వచించుకుంటున్న వాళ్లలో అగ్రగణ్య వర్ణం ఆయన సామాజిక వర్గం. ఆ వర్గం తెలంగాణను వ్యతిరేకిస్తున్నది. ఆ వర్గం తెలంగాణను ఆక్రమించుకున్నది. కారంచేడులో మనుషులను ఖండఖండాలుగా నరికిన భూస్వామ్యం, పెట్టుబడుల షోకు పిల్లి అయి ఇప్పుడు నరకడం అవసరం లేకుండానే పెంపుడు రామచిలుకలను తయారు చేసుకుంటున్నది.అయితే ఆ రామచిలుకలు స్వేచ్ఛగా ఉండలేనివి. అగ్రగ ణ్య వర్గం అసలు స్వభావం చూడలేనివి. పెంపుడు చిలుకలు అంతిమంగా పంజరంలో మాత్ర మే స్వేచ్ఛను చూడగలిగేవి. ఇదొక కొత్త రూపం. నరకదు. పంజరంలో బంధించి పాటలు పాడిస్తుంది. జాగ్రత్త. మిత్రులారా చంద్రబాబుతో జర జాగ్రత్త.

[నమస్తే తెలంగాణ సౌజన్యంతో]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *