బుధవారం మెదక్ జిల్లాలో జరిగిన పలు కార్యక్రమాల్లో భారీ నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. మెదక్ జిల్లా సంగారెడ్డి కలెక్టరేట్ లో మంజీరా పైపులైన్ ప్రారంభోత్సవం, కంది ఐఐటీ భూ నిర్వాసితులకు ఇళ్ళ పట్టాలు, నష్టపరిహారానికి సంబంధించిన చెక్కుల పంపిణీ, జోగిపేటలో సీసీఐ పత్తికొనుగోలు కేంద్రం ప్రారంభం, నారాయణ్ ఖేడ్ లో మోడల్ డిగ్రీ కళాశాల ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతే దేశానికి వెన్నెముకని నమ్మే టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిక్షణం రైతు సంక్షేమం కోసమే ఆలోచిస్తున్నదని, రైతులకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని, ఆత్మస్థైర్యం కోల్పోయి ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.
కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక నిధి ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నారని, బడ్జెట్ లో ఈ నిధికి కొంతమొత్తాన్ని కేటాయించే అవకాశం ఉందని, రైతులను ఆదుకోవడానికి ఈ నిధి ఉపయోగపడనున్నదని, హరీష్ తెలిపారు. మొక్కజొన్న, వడ్లను కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన రైతులకు 72 గంటల్లో ఆన్ లైన్ లో డబ్బులు చెల్లిస్తున్నామని, పాడిరైతులను ప్రోత్సహించే దిశగా పాలధరను ఒకేసారి రూ. 4 కు పెంచామని చెప్పారు. ప్రతి కార్యక్రమం రైతు సంక్షేమం కోసమే ప్రభుత్వం చేస్తున్నా రైతుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు.
వర్షాభావం వల్ల బోరుబావులు ఎండి రైతులు బలవన్మరణాలకు పాల్పడుతుండటం కలిచివేస్తుందని, ఆత్మహత్యలకు కరెంట్ సమస్య కాదని, వర్షాలు లేకపోవడంతో కరువు ఏర్పడిందని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. బోరుబావుల్లో నీరెండిపోయిందని, కరెంటున్నా పంట ఎండిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయని, ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్నదాతల్లో ఆత్మస్థైర్యాన్ని నింపాల్సిన బాధ్యత అందరిమీదా ఉందన్నారు. అన్నదాత లేనిదే బువ్వలేదని, అలాంటి రైతులను ఆదుకోవడానికి మానవతావాదులు, మేధావులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థి, యువజన, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని హరీష్ రావు సూచించారు.