గురుకుల్ ట్రస్టు భూముల్లో అక్రమకట్టడాలపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదేశాలు జారీ చేయడంతో జీహెచ్ఎంసీ అధికారులు, మున్సిపల్ సిబ్బంది అక్రమ కట్టడాలను కూల్చివేసే పనిలో పడ్డారు. గురుకుల్ భూముల్లో అక్రమంగా నిర్మించిన కట్టడాలను తొలగించకపోతే ఊరుకునేది లేదని ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడే కేసీఆర్ సీమాంధ్ర పాలకులను హెచ్చరించారు. అక్రమ భూ కబ్జాలు చేసి మొత్తం 627 ఎకరాల గురుకుల్ ట్రస్ట్ భూములను బడాబాబులు స్వాహా చేశారు.
భూముల స్వాహాలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిది ప్రధాన పాత్ర. 300 ఎకరాల భూమిని తన ఇష్టం వచ్చినవారికి కట్టబెట్టారు. స్వయానా చంద్రబాబే 5 ఎకరాలు కొని విక్రయించగా, ఆయన భార్య భువనేశ్వరి పేరిట ఒక ఎకరం కొనుగోలు చేశారు. మిగతా 327 ఎకరాలను మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు, వైఎస్ బంధుగణం, సీమాంధ్ర బడానేతలు ఈ భూములను అక్రమంగా కబ్జా చేసినవారిలో వున్నారు.
అక్రమ కట్టడాలపై కన్నెర్ర జేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ భవనాల కూల్చివేతపై జీహెచ్ఎంసీ అధికారులకు ఆదేశాలు జారీ చేయగానే మాదాపూర్ గురుకుల్ భూముల్లో వెలసిన అక్రమ కట్టడాల కూల్చివేత మంగళవారం ఉదయమే ప్రారంభించారు. పోలీసుల భారీ భద్రత నడుమ మున్సిపల్ అధికారులు, సిబ్బంది 16 అక్రమ కట్టడాలను కూల్చేశారు. బుధవారం కూడా ఈ కూల్చివేత కొనసాగనుంది. ఇదిలా ఉండగా అక్రమ నిర్మాణాలను కూల్చివేయొద్దని, ఆపకపోతే తమ పార్టీ ఎమ్మెల్యేలను రంగంలోకి దింపి తమ తడాఖా చూపిస్తామని స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఆందోళనకు దిగగా పోలీసులు ఆయనను, కార్పొరేటర్లను అరెస్టు చేశారు.