కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలకు కేంద్రం నుండి పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చిన కేంద్రప్రభుత్వం బడ్జెట్ లో తెలంగాణకు ఒక్క హార్టీకల్చర్ యూనివర్సిటీ కేటాయించి చేతులు దులుపుకుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండూ కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలైనప్పటికీ ఏపీ ప్రభుత్వానికి 8 వరాలిచ్చి కేంద్రం తన పక్షపాత ధోరణి చాటింది. కేంద్రానికి అన్ని రాష్ట్రాలూ సమానమేనని, వివక్ష ఉండదని చెప్పిన మాటలు దీనినిబట్టి చూస్తే నిజం కాదని తెలుస్తుంది.
పునర్వ్యవస్థీకరణ చట్టంలో ప్రతిపాదించిన ప్యాకేజీల విషయంలోనూ తెలంగాణకు అన్యాయమే జరిగింది. ఒక్క ఉద్యానవన విశ్వవిద్యాలయానికి 200కోట్లు కేటాయించిన కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 500 కోట్లతో ఎయిమ్స్ ఏర్పాటు, ఐఐటీ, వ్యవసాయ విశ్వవిద్యాలయం, కాకినాడ పోర్టు సమీప ప్రాంతాలు ఆర్ధికాభివృద్ధి కేంద్రాలుగా గుర్తింపు, కాకినాడలో హార్డ్ వేర్ పరిశ్రమల ఏర్పాటు, హిందూపురంలో నేషనల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ అకాడమీ ఏర్పాటు, ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీగా కృష్ణపట్నం, విశాఖ-చెన్నైల మధ్య పారిశ్రామిక కారిడార్ అంశాలను బడ్జెట్ లో పొందుపరచారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ గత నెల ప్రధాని మోడీని కలిసి కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం పూర్తిస్థాయిలో సహకారం అందించాలని కోరుతూ, 14 అంశాలతో కూడిన ప్రతిపాదనలను మోడీకి అందజేశారు. విద్యుత్ కొరతతో అల్లాడుతున్న తెలంగాణ రాష్ట్రానికి విభజన చట్టంలో పేర్కొన్న విధంగా 4000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంపై బడ్జెట్ లో ఎలాంటి హామీ లభించలేదు. ఖమ్మం జిల్లా బయ్యారంలో ఇనుము-ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పడం, కాజీపేట కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటు చేయడంతో పాటు కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం లాంటి మొత్తం 14అంశాలలో ఏ ఒక్కటీ అమలుకు నోచుకోలేదు.
కేంద్ర బడ్జెట్ నిరాశ కలిగించిందని, కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర పునర్విభజన బిల్లులో సూచించిన హార్టీకల్చర్ యూనివర్సిటీ తప్ప మరేదీ కేటాయించకపోవడం పట్ల సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుండి సహకారం ఎంతగానో కోరామని, అయినా బడ్జెట్ లో తెలంగాణకు న్యాయం జరగలేదని కేసీఆర్ విమర్శించారు.