– ప్రజల ఆకాంక్షలను ప్రతిఫలించాలి
– ఐదేండ్లకు విధాన నిర్ణయం జరుగాలి
– జిల్లా స్థాయిలో కలెక్టర్లకు విస్తృత అధికారాలు
– పథకాలపై మూడు నెలలకోసారి సమీక్ష జరుపాలి
– బడ్జెట్‌పై సమీక్షలో అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం
తెలంగాణ రాష్ట్రంలో రూపొందిస్తున్న మొట్టమొదటి బడ్జెట్ ఆషామాషీగా కాకుండా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేదిగా ఉండాలని ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సూచించారు. కొత్త ప్రభుత్వం వచ్చిందని ప్రజలు ఆశలు పెంచుకున్నారని, అందుకు అనుగుణంగా బడ్జెట్ రూపకల్పన, ప్రణాళిక రచన జరగాలని స్పష్టం చేశారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ రూపకల్పన, బడ్జెట్ ప్రతిపాదనలకు సీఎం అనుమతి కోసం మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధికేంద్రంలో మంగళవారం ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో సీఎం మాట్లాడుతూ బడ్జెట్ ఆమోదానికి తొందర అవసరం లేదు. కొత్త రాష్ట్రం వచ్చింది.
కీలక శాఖల విధాన నిర్ణయం కోసం వెంటనే ప్రత్యేక కమిటీలు వేయండి. ఈ పాలసీ నిర్ణయం తర్వాతనే ఒక్కో శాఖ అవసరాల మేరకు బడ్జెట్ కేటాయింపులు జరగాలి. ఈ నెలాఖరులోగా ఈ ప్రక్రియ పూర్తి చేద్దాం. సెప్టెంబర్ 30లోగా బడ్జెట్ ఆమోదం తప్పనిసరి అయినప్పటికీ అవసరమైతే మరో నెలపాటు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను పొడిగించేందుకు గవర్నర్ నుంచి ఆమోదం పొందుదాం. అంతేకానీ ఆషామాషీగా కొత్త బడ్జెట్‌ను ప్రతిపాదించాల్సిన అవసరం లేదు అని సూచించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి, ప్రణాళికశాఖ ముఖ్య కార్యదర్శి సమావేశమై విద్య, వైద్య ఆరోగ్యం, వ్యవసాయం, నీటిపారుదల, సంక్షేమం వంటి కీలక శాఖలపై అనుభవజ్ఞులైన ఐఏఎస్ అధికారులతో, ప్రభుత్వ సలహదారులను కూడా సమన్వయపరిచి విధాన నిర్ణయాల కోసం ప్రత్యేక కమిటీలు వేయాలని సీఎస్ రాజీవ్‌శర్మను ఆదేశించారు. ఇప్పటికే శాఖల వారీగా వచ్చిన ప్రతిపాధనలతో ఆర్థిక మంత్రి, ఆ శాఖ అధికారులు బడ్జెట్‌కు అవసరమైన ప్రతిపాదనలతో వచ్చినప్పటికీ సీఎం వాటిని పరిశీలించకుండా సరికొత్త పంథాలో బడ్జెట్ ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉందని, ఆదిశగా కార్యోణ్ముకులు కావాలని సూచించారు. ఐదేండ్ల వరకు కీలక రంగాల్లో చేయాల్సింది ఏమిటీ? నిధులెంతవరకు అవసరం? వంటి అంశాలను పరిశీలించి పాలసీ డాక్యుమెంట్లను రూపొందించిన తర్వాతనే బడ్జెట్ ప్రతిపాదనలపై తుది నిర్ణయం తీసుకుందామని చెప్పారు.
ప్రభుత్వ ప్రాధాన్యతల మేరకే బడ్జెట్ కేటాయింపులుండాలి. కొన్ని నీటిపారుదల ప్రాజెక్ట్‌లకు రూ.100 కోట్లు కేటాయించినా పూర్తయ్యే అవకాశాలుంటాయి. వాటికి పూరి స్థాయి నిధులు కేటాయించవచ్చు. పారిశ్రామిక విధానం, అవినీతి రహిత పరిపాలన వంటి అంశాలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి. జిల్లా స్థాయిలో కలెక్టర్లకు స్వేచ్ఛ ఇవ్వటంతోపాటు జవాబుదారీతనం పెంచి నిర్దిష్ట మొత్తంలో నిధులను ఖర్చు చేసే విచక్షణాధికారం వారికే అప్పగించాలి. ప్రతీ విషయానికి జిల్లా కలెక్టర్లు ప్రభుత్వంపై ఆధారపడేలా బడ్జెట్ కేటాయింపులుండటంలో ఔచిత్యం లేదు. వారిని విశ్వాసంలోకి తీసుకుంటేనే ప్రభుత్వ కార్యక్రమాలు సమర్థంగా అమలవుతాయి అని సీఎం స్పష్టం చేశారు. అంకితభావంతో పనిచేసే అధికారులు జిల్లాలో అనేకమంది ఉన్నారని, వారిలో 20 మందిని వివిధ శాఖల నుంచి ఎంపిక చేసి, జిల్లా స్థాయి చేంజ్ ఏజెంట్లుగా పరిగణించి వారికి అవసరమైతే శిక్షణ ఇవ్వాలని సీఎం సూచించారు. గతంలో జరిగిన బడ్జెట్ ప్రతిపాదనలు, అసెంబ్లీకి వాటికి సమర్పిస్తున్న విధానం మొక్కుబడిగా సాగుతోందని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు.
మునుపటి బడ్జెట్‌కు పదిపదిహేను శాతం పెంచి వాటిని మంత్రివర్గ సమావేశం ముందు పెడతారని, ఆ ప్రతిపాదనలు ఏమిటో కూడా పరిశీలించకుండా క్యాబినెట్ ఆమోదిస్తుందని, అదేరోజు అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం చదవడం ఆనవాయితీగా వస్తున్నదన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో ఈ విధానాన్ని తిరగరాయాలని, ప్రతీ మూడు నెలలకోసారి ఒక్కో పథకం సాధించిన ప్రగతిని పరిశీలించాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలపై మీడియాలో వస్తున్న వార్తలను విశ్లేషించేందుకు ప్రత్యేక మానిటరింగ్ సెల్ అవసరమన్నారు. ఉద్యోగులు సమర్థంగా పనిచేయాలంటే భార్యాభర్తలు ఒకేచోట పనిచేసేలా చూడాలని పేర్కొన్నారు. భార్యాభర్తలకు వీలైనంత దగ్గరి ప్రాంతాల్లో పోస్టింగ్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎస్‌ను ఆదేశించారు. 35నుంచి 40వరకున్న శాఖలను 24కుదించాలని కూడా సూచించారు. కేంద్రం నుంచి వివిధ పథకాల కింద వచ్చే నిధులను సద్వినియోగం చేసుకునేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.
హైదరాబాద్‌లో హాబిటేట్ సెంటర్
– రూ.110కోట్లతో హైటెక్ సిటీ దగ్గరలో నిర్మాణం
– ప్రాజెక్టు రిపోర్టు సిద్ధం.. ముంబై ఆర్కిటెక్ట్‌తో డిజైన్
– సీఎం ఆమోదమే తరువాయి
చారిత్రక నేపథ్యం ఉన్న హైదరాబాద్‌కు అందుకు అనుగుణంగానే అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఈవెంట్లకు హబ్‌గా గుర్తింపు పొందింది. టూరిజం, హాస్పిటాలిటీ వంటి రంగాలను మరింతగా విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.110 కోట్లతో హాబిటేట్ సెంటర్‌ను నిర్మించతలపెట్టింది.
తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ(టీఐఐసీ), హెచ్‌ఎండీఏలు సంయుక్తగా ప్రాజెక్టును అమలు చేస్తున్నాయి. హైదరాబాద్‌లోని హైటెక్ సిటీకి దగ్గరలోనే 13 ఎకరాల్లో ఈ సెంటర్‌ను నిర్మించాలని ప్రతిపాదించింది. ఈ మేరకు ప్రాజెక్టు రిపోర్టును సిద్ధం చేశారు. హాంకాంగ్‌లోని ఈవెంట్ సిటీ మాదిరిగా తీర్చిదిద్దేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. హాబిటేట్ సెంటర్ డిజైన్ బాధ్యతలను ముంబైకి చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ హఫీజ్‌ఖాన్‌కు అప్పగించినట్లు టీఎస్‌ఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కే జయేష్‌రంజన్ బుధవారం టీ మీడియాకు చెప్పారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు డిజైన్ ప్రాజెక్టును త్వరలోనే సమర్పిస్తామన్నారు. ఆయన ఆమోదం లభించగానే పనులు వేగవంతం కానున్నాయి.
మూడు కేటగిరీలుగా నిర్మాణం
నగరంలో నిర్మించనున్న హాబిటేట్ సెంటర్ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఉంటుంది. 13 ఎకరాల్లో నిర్మించున్న కేంద్రానికి రూ.110 కోట్లు అంచనాగా రిపోర్టును సిద్ధం చేశారు. సెంటర్‌లో మూడు విభాగాలు ఉంటాయి. ఈవెంట్ల నిర్వహణకు (ఫంక్షన్లు, సమావేశాలు, సభలు) ప్రత్యేక బ్లాకు ఉంటుంది. సాహిత్యం, పర్యాటకం వంటి అంశాలకు మరో విభాగాన్ని ఏర్పాటు చేయనున్నారు.
పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే సంస్థలు, ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలు తదితర రంగాలకు చెందిన సంస్థల కార్యాలయాల నిర్వహణకు ప్రత్యేక బ్లాకు ఉండేలా డిజైన్ చేస్తున్నారు. ప్రభుత్వం నిర్మించబోయే హాబిటేట్ సెంటర్‌ను ఈవెంట్ సిటీ మార్చనున్నారు. దీని ద్వారా పర్యాటక రంగం అభివృద్ధి చెందడంతో పాటు ప్రభుత్వానికి రెవెన్యూ పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. హాబిటేట్ సెంటర్ నిర్మాణానికి స్థలం సిద్ధంగా ఉన్నందున ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం తెలిపిన వెంటనే పనులు మొదలు పెట్టే అవకాశాలు ఉన్నట్లు టీఐఐసీ అధికారులు చెబుతున్నారు.
నమస్తే తెలంగాణ సౌజన్యంతో..