mt_logo

బ్రాండ్ హైదరాబాద్ తెలంగాణ

-సింగపూర్ స్ఫూర్తిగా సత్వర అభివృద్ధి
-పెట్టుబడికి తొలి ఎంపికగా తెలంగాణ
-5 లక్షల ఎకరాల ల్యాండ్‌బ్యాంక్ .. జీరో కరప్షన్ మా ప్రభుత్వ నినాదం
-ఒక్క సమావేశంతో అన్ని అనుమతులు.. జీనోమ్ వ్యాలీగా హైదరాబాద్
-వ్యవసాయానికీ సముచిత ప్రాధాన్యం
-ప్రభుత్వ ఆశయాలు, విధానాలు వివరించిన సీఎం కేసీఆర్
-సింగపూర్ ఐఐఎం పూర్వవిద్యార్థుల సమ్మేళనానికి హాజరు
-ప్రపంచ ప్రతినిధులను ఆకట్టుకున్న 45 నిమిషాల ప్రసంగం

ఐఐఎంలో చదువుకున్న మీరంతా ఏదో ఓ కంపెనీలో కొంతకాలం పనిచేశారు. ఆ తర్వాత మీరే కంపెనీలను స్థాపించి ఉండొచ్చు. లేదా సొంతంగా కంపెనీని స్థాపించాలన్న లక్ష్యంతో ఉండొచ్చు. తెలంగాణ కూడా అదే విధంగా ఉంది. భారత్‌లో ఉన్నతమైన రాష్ట్రంగా ఎదగాలన్న పట్టుదలతో ఉంది. ఆ స్థాయికి తెలంగాణ చేరే వరకూ విశ్రమించబోం – కేసీఆర్

అతి తక్కువకాలంలోనే ఎనలేని అభివృద్ధిని సాధించిన సింగపూర్ ఆదర్శంగా తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. బ్రాండ్ హైదరాబాద్, బ్రాండ్ తెలంగాణగా గుర్తింపు సాధించేందుకు అహర్నిశలు ఒక తపనతో పనిచేస్తున్నామని చెప్పారు. ప్రపంచం మొత్తం తెలంగాణవైపు చూసే పారిశ్రామిక విధానం రూపొందించాలన్న పట్టుదలతోనే ఇంత కసరత్తు చేస్తున్నామని చెప్పారు. ఆరు లక్షల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ తెలంగాణకు ప్రధాన ఆకర్షణ కాబోతున్నదని తెలిపారు. అవినీతిరహిత రాష్ట్రంగా తీర్చి దిద్దుతామని ప్రకటించారు. భారత్‌లో ఉన్నతమైన రాష్ట్రంగా తెలంగాణ ఎదిగేవరకూ విశ్రమించబోనని స్పష్టం చేశారు. శుక్రవారం సింగపూర్‌లో జరిగిన ఐఐఎం పూర్వ విద్యార్థుల సమ్మేళనం (ఐఐఎం-ప్యాక్ట్)లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని 45 నిమిషాలసేపు ప్రసంగించారు.

సింగపూర్‌నుంచి స్ఫూర్తి
60 ఏండ్ల కిత్రం సింగపూర్‌కు ఇప్పటికీ ఎంతో మార్పు వచ్చింది. బలమైన నాయకత్వం, స్ఫురదృష్టి కలిగిన విధానాలు, సంయుక్త భాగస్వామ్యంతో అభివృద్ధిని సాధించారు. ప్రజల భాగస్వామ్యం ఎంతో స్ఫూర్తినిస్తున్నది. సింగపూర్‌ను ఆదర్శంగా తీసుకుంటాం. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ర్టాన్ని కూడా ఇలాగే ప్రగతిపథాన నడిపించాలన్న ఆశయంతో ఉన్నాం అని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దశాబ్దాలుగా శాంతియుతంగా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలమేరకు పాలన అందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని చెప్పారు.

తెలంగాణ మహోద్యమ స్ఫూర్తితోనే రాష్ర్టాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ప్రభుత్వం విధి విధానాలను రూపొందిస్తున్నదని తెలిపారు. ఐఐఎంలో చదువుకున్న మీరంతా ఏదో ఓ కంపెనీలో కొంతకాలం పనిచేశారు. ఆ తర్వాత మీరే కంపెనీలను స్థాపించి ఉండొచ్చు. లేదా సొంతంగా కంపెనీని స్థాపించాలన్న లక్ష్యంతో ఉండొచ్చు. తెలంగాణ కూడా అదే విధంగా ఉంది. భారత్‌లో ఉన్నతమైన రాష్ట్రంగా ఎదగాలన్న పట్టుదలతో ఉంది. ఆ స్థాయికి తెలంగాణ చేరే వరకూ విశ్రమించబోం అని ఆయన ప్రకటించారు. ఇంతటి అపూర్వ కార్యక్రమానికి తనను ముఖ్యఅతిథిగా ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపారు. సీఎం తన ప్రసంగంలో తెలంగాణ బ్రాండ్‌ను ప్రపంచ దేశాల నుంచి హాజరైన ప్రతినిధులకు వివరించారు.

పెట్టుబడికి మొదటి ఆప్షన్ తెలంగాణ
జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామికవర్గాలు పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచంలోనే మొదటి ఆప్షన్ తెలంగాణగాను తీర్చి దిద్దుతామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఆ లక్ష్యంతోనే అత్యంత ఆకర్షణీయమైన, ఆచరణీయమైన పారిశ్రామిక విధానానికి రూపకల్పన చేస్తున్నామని అన్నారు. జీరో కరప్షన్ తమ ప్రథమ ప్రాధాన్యమని వెల్లడించారు.

నూటికి నూరుశాతం దాన్ని ఆచరణలోకి తెస్తామని హామీ ఇచ్చారు. భారత్‌లో ఇటీవల భూ సేకరణ చట్టం కఠినతరంగా మారింది. చాలా రాష్ర్టాలు ఇబ్బందుల్లో పడ్డాయి. కొన్నిచోట్ల పెద్ద కంపెనీలు పరిశ్రమలను నెలకొల్పేందుకు ముందుకొచ్చినా స్థల సమస్యతో వెనుదిరుగుతున్నాయి అని పేర్కొన్నారు. కానీ తెలంగాణలో లక్షల ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి.

కనీసపక్షం 5 లక్షల ఎకరాలతో ల్యాండ్ బ్యాంకును ఏర్పాటు చేస్తున్నాం. తెలంగాణ పారిశ్రామికరంగాభివృద్ధికి అదే బీజాలు వేస్తుంది అని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే 3 లక్షల ఎకరాలను గుర్తించామని చెప్పిన సీఎం వాటిలో మౌలిక సదుపాయాలను కల్పించి ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. ప్రతి పార్కుకు పక్కా రవాణా వ్యవస్థ ఉంటుందని, హైదరాబాద్‌కు 100 కి.మీ. లోపే వీటిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. సింగపూర్‌కు సీ పోర్టు సొబగుగా మారింది. అదే విధంగా తెలంగాణకు ల్యాండ్ బ్యాంకే అభివృద్ధికి అదనపు హంగుగా మారనుంది అని అభిప్రాయపడ్డారు.

పరిశ్రమలకు ఉపయోగపడని భూముల్లో సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేసే అవకాశాలపై అధ్యయనం చేస్తున్నామన్నారు. చాలా భారతీయ రాష్ర్టాలు పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు అనుమతులకోసం కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటున్నాయి. ఆ సమస్యలపై నాకు అవగాహన ఉన్నది. అందుకే సింగిల్‌విండో విధానాన్ని అమలు చేయబోతున్నాం. ఒక్క సమావేశంతోనే 28 రకాల అనుమతులు మంజూరు చేసి పత్రాలను చేతుల్లో పెట్టే పాలసీకి రూపకల్పన చేస్తున్నాం అని వివరించారు. పెట్టుబడివర్గాలను ఆహ్వానించేందుకు సీఎం కార్యాలయంలోనే స్పెషల్ చేజింగ్ సెల్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

పరిశ్రమలకు నీరు, విద్యుత్తు
తమ ప్రభుత్వం పరిశ్రమలకు అవసరమైన నీరు, విద్యుత్తు కేటాయింపుల్లోనూ ప్రత్యేకతను చాటుకుంటుందని, ప్రాజెక్టు డిజైన్‌లోనే ఆ మేరకు కేటాయింపులు ఉండేటట్లు చర్యలు తీసుకుంటున్నామని సీఎం ప్రకటించారు. రానున్న మూడేళ్లల్లో మిగులు విద్యుత్తు కలిగిన రాష్ట్రంగా మారుతుందని భరోసా ఇచ్చారు.

రాయితీలు, ప్రోత్సాహకాలు పుష్కలం
తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు రాయితీలను, ప్రోత్సాహకాలను ఇతర రాష్ర్టాలకంటే భారీగా అందిస్తామని కేసీఆర్ ప్రకటించారు. బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, ఐటీ, హార్డ్‌వేర్, మెడికల్ డివైసెస్, ఏరోస్పేస్, ఆటోమొబైల్స్, కెమికల్స్, ప్లాస్టిక్స్, టెక్స్‌టైల్స్, గ్రీన్ టెక్నాలజీ, మినరల్ ఆధారిత పరిశ్రమలు, రవాణా, లాజిస్టిక్స్ హబ్ వంటి రంగాలకు అనేక రాయితీలను అందిస్తామని చెప్పారు. వీటినే ప్రాధాన్య రంగాలుగా తెలంగాణ గుర్తించిందన్నారు.

జీనోమ్ వ్యాలీగా హైదరాబాద్
హైదరాబాద్ ప్రపంచంలోనే గుర్తింపు పొందిన నగరం. టాప్‌మోస్ట్ మెట్రోపాలిటన్ నగరాల్లో ఒకటి. ఐటీ, బయోటెక్నాలజీ, ఫార్మారంగాల్లో విరాజిల్లుతున్నది. జీనోమ్ వ్యాలీగా తీర్చిదిద్దేందుకు డీపీఆర్‌ను సిద్ధం చేసుకుంటున్నాం. 500 ఫార్మా, వ్యాక్సిన్ కంపెనీలు హైదరాబాద్ చుట్టూ ఉన్నాయి. ప్రపంచంలోనే 20% వ్యాక్సిన్ హైదరాబాద్ పరిసరాల్లో ఉత్పత్తి అవుతున్నది. భారత్‌లో మూడో వంతు ఫార్మా ఉత్పత్తులు ఇక్కడివే. ఏరోస్పేస్‌లోనూ రాణిస్తున్నాం. విమానాల విడిభాగాల తయారీకి కేంద్రంగా మారబోతున్నది. అనేక ప్రాధాన్య రంగాలకు రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కేంద్రంగా తెలంగాణ ఏర్పడనుంది అని అని ముఖ్యమంత్రి వివరించారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు గురించి ప్రస్తావిస్తూ హైదరాబాద్‌ను త్వరలోనే డిజిటల్ సిటీగా మార్చాలన్న లక్ష్యంతో ఉన్నట్లు చెప్పారు. బ్రాండ్ హైదరాబాద్, బ్రాండ్ తెలంగాణగా గుర్తించాలన్న తపనతో పని చేస్తామన్నారు.

వ్యవసాయంలోనూ ముందుకెళ్తాం
మొక్కజొన్న, వరి, చింతపండు పంటలకు తెలంగాణ ప్రసిద్ధి. ఇక్కడి ఉత్పత్తులను ఆఫ్రికన్, ఆసియా దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. తెలంగాణ మట్టి భాగ్యవంతమైనది. అన్ని రకాల పంటలకు అనుకూలమైనది. అందుకే ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ స్టేషన్ ఫోర్త్ సెమీ-ఆరిడ్ ట్రోపిక్స్(ఇక్రిశాట్)ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారని కేసీఆర్ గుర్తు చేశారు. పండ్లు, కూరగాయలు, గ్రీన్‌హౌజ్ ఆపిల్ వంటి ఉత్పత్తులకు ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నామన్నారు. సింగపూర్‌లో అడవి మానవాళి సృష్టించిందైతే తెలంగాణలో సహజ సిద్ధంగానే ఏర్పడిందన్నారు. ఇంకా అటవీ అభివృద్ధికి 4 వేల నర్సరీలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. విత్తనోత్పత్తి కేంద్రంగా తెలంగాణ మారుతుందన్నారు.

తెలంగాణ కళల కాణాచి
తెలంగాణకు సుదీర్ఘ చరిత్ర ఉంది. వారసత్వ సాంస్కృతిక సంపద అపారంగా ఉంది. గోల్కొండ కోట, చార్మినార్‌వంటి చారిత్రక కట్టడాలతో హైదరాబాద్ పర్యాటక రంగంగా వెల్లివిరుస్తున్నది. వరంగల్‌లో వెయ్యి స్తంభాల గుడి, రామప్ప ఆలయం, నిర్మల్ పెయింటింగ్స్ వంటివి అనేకం ఉన్నాయి అన్నారు.

ఆకట్టుకున్న సీఎం ప్రసంగం
సింగపూర్‌లో జరిగిన ఐఐఎం పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి హాజరైన ఏకైక ప్రజాప్రతినిధి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఒక్కరే. ప్రపంచంలోని ఏ దేశంలో నుంచి కూడా ఇతర ప్రజాప్రతినిధులెవర్నీ పిలువలేదు. వివిధ దేశాలకు చెందిన వెయ్యి మంది పారిశ్రామికవేత్తలు, నిపుణులు పాల్గొన్న కార్యక్రమంలో 45 నిమిషాల కేసీఆర్ ప్రసంగం ఆద్యంతం ఆకట్టుకుంది.

తనదైన శైలిలో అన్ని దేశాల ప్రతినిధులకు అర్థమయ్యేలా స్పష్టమైన ఇంగ్లీషులో ఆయన ప్రసంగించారని టిఫ్ అధ్యక్షుడు కే సుధీర్‌రెడ్డి టీ మీడియాకు చెప్పారు. ప్రపంచ ప్రతినిధులు పాల్గొన్న సమ్మేళనంతో బ్రాండ్ తెలంగాణ ప్రాచుర్యంలోకి వచ్చిందన్నారు. సదస్సుకు వచ్చిన వివిధ దేశాల ప్రతినిధుల నోట తెలంగాణ.. తెలంగాణ అన్న ప్రస్తావన వింటూ ఉంటే ఆ సంతోషమే వేరుగా ఉందని చెప్పారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కే ప్రదీప్‌చంద్ర, సీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్‌రావు, పరిశ్రమల శాఖ కమిషనర్ జయేష్‌రంజన్, ఐటీ కార్యదర్శి హర్‌ప్రీత్‌సింగ్, సీఎంవో అదనపు కార్యదర్శి స్మితాసబర్వాల్, ఎం గోపాలరావు, ఫ్యాప్సీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వీ అనిల్‌రెడ్డి, ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

[నమస్తే తెలంగాణ సౌజన్యంతో]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *