mt_logo

ముఖ్యమంత్రికి సంపూర్ణ అధికారాలు ఉంటాయి – రాజ్ నాథ్ సింగ్

రాష్ట్రాల అధికారాలు కాజేయాలనే కోరిక కేంద్రానికి లేదని, మిగతా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల మాదిరే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా సంపూర్ణ అధికారాలు ఉంటాయని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా ముఖ్యమంత్రి స్వేచ్ఛగా పరిపాలన సాగించుకోవచ్చని హోంమంత్రి చెప్పినట్లు మీడియా సమావేశంలో టీఆర్ఎస్ ఎంపీలు తెలిపారు. గురువారం హోంమంత్రి కార్యాలయంలో టీఆర్ఎస్ ఎంపీలు హోమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో సమావేశమై హైదరాబాద్ శాంతిభద్రతల అంశాన్ని గవర్నర్ కు అప్పగిస్తూ కేంద్రం పంపిన లేఖపై ప్రస్తావించారు.

సుమారు అర్ధగంటపాటు సాగిన సమావేశంలో పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 8లో పేర్కొన్న బాధ్యతలు, గవర్నర్ కు రాజ్యాంగపరంగా ఉండే అధికారాలు తదితర అంశాలపై చర్చ జరిగింది. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఎంపీలు మాట్లాడుతూ చర్చలు సంతృప్తికరంగా జరిగాయని పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యుడు కేకే మాట్లాడుతూ, సెక్షన్ 8లో పేర్కొన్న అంశాలపై తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని, అదనంగా గవర్నర్ కు మరికొన్ని అధికారాలను అప్పగించడాన్నే తాము వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు.

ఎంపీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ, సమావేశం విజయవంతమైందని, ఫెడరల్ వ్యవస్థను గౌరవిస్తామని, గవర్నర్ రాజ్యాంగం ప్రసాదించిన అధికారాల మేరకే వ్యవహరిస్తారని రాజ్ నాథ్ సింగ్ చెప్పారన్నారు. హైదరాబాద్ పంచబడిన రాజధాని కాదని, తెలంగాణకు రాజధాని అని, అందువల్ల శాంతిభద్రతల అధికారాలు మిగతా రాష్ట్రాల మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉండాలని హోమంత్రికి చెప్పామని వివరించారు. తమ వాదనలు విన్న తర్వాత గతంలో పంపిన ఉత్తర్వుల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని హామీ ఇచ్చారని కవిత పేర్కొన్నారు.

టీఆర్ఎస్ ఎంపీలతో జరిగిన సమావేశం అనంతరం హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ దేశ సమాఖ్య స్ఫూర్తికి భంగం కలిగించేలా ఎలాంటి చర్యలనూ కేంద్రం చేపట్టబోదని, శాంతి భద్రతలకు సంబంధించి ముఖ్యమంత్రి అధికారాలు హరించాలని కేంద్రం కోరుకోవడం లేదని, ఏపీ విభజన చట్టంలో చెప్పినదాని ప్రకారమే ముందుకు పోతామని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *