mt_logo

లండన్ తెలంగాణ ఎన్నారై ఫోరం(TeNF) ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు

లండన్: తెలంగాణ ఎన్నారై ఫోరం(TeNF) ఆధ్వర్యంలో లండన్‌లో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాలకు యూకే నలుమూలల నుండి సుమారు 700లకు పైగా తెలంగాణ కుటుంబసభ్యులు హాజరయ్యారు. ఈ వేడుకలకు తెలంగాణ రాష్ట్రం నుండి తెలంగాణ మండలి ఛైర్మన్ శ్రీ స్వామిగౌడ్ గారు ముఖ్య అతిధిగా హాజరవడం విశేషం. స్వదేశంలో జరుపుకున్నట్టు సంప్రదాయ బద్దంగా పూజలు నిర్వహించి, లండన్ వీధుల్లో తొట్టెల ఊరేగింపు ప్రవాస తెలంగాణ బిడ్డలనే కాకుండా స్థానికులని కూడా మంత్రముగ్ధులను చేసింది.

ఈ సంవత్సరం జరుపుకొనే పండుగకు ప్రత్యేకత ఉందని, తెలంగాణ రాష్ట్ర పండుగగా కొత్త ఉత్సాహాన్ని, స్ఫూర్తిని ఇచ్చాయని, తెలంగాణ మండలి ఛైర్మన్ శ్రీ స్వామిగౌడ్ గారు మా ఆహ్వానాన్ని మన్నించి లండన్ విచ్చేసి మా ఆడబిడ్డలతో పాటు బోనం ఎత్తుకోవడం మాకెంతో స్ఫూర్తినిచ్చిందని కమిటీ సభ్యులు, హాజరైన ప్రవాస తెలంగాణ బిడ్డలు తెలిపారు. తెలంగాణ ఎన్నారై ఫోరం మూడు సంవత్సరాలలో చేసిన ముఖ్య కార్యక్రమాల వీడియోని ప్రదర్శించి, అతిథులకు వివరించారు. ఇది చూసి హాజరైన ప్రతి ఒక్కరు ఉద్వేగానికి లోనయ్యారు.

బోనాల ఊరేగింపు తరువాత ఏర్పాటు చేసిన వేడుకల సభలో తెలంగాణ మండలి ఛైర్మన్ శ్రీ స్వామిగౌడ్ గారు మాట్లాడుతూ.. ఉద్యమంలో ఎన్నారైల పాత్ర గొప్పదని అన్నారు. ముఖ్యంగా ఉద్యమ సమయంలో తెలంగాణ ఎన్నారై ఫోరమ్ లండన్ వీదుల్లో “జై తెలంగాణ” అంటూ చేసిన పోరాటం మాకు ఎంతో స్పూర్తినిచ్చిందని తెలిపారు. ఈ బోనాల వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్టుగా అనిపించిందని, తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్తున్న తీరుని ఆయన ప్రశంసించారు. ఒక పక్క వ్యక్తిగతంగా ఇక్కడున్న బిడ్డలు బిజీగా ఉన్నపట్టికీ, బాధ్యత గల తెలంగాణ బిడ్డలుగా ఆనాడు ఉద్యమంలో, నేడు పునర్నిర్మాణంలో పోషిస్తున్న పాత్ర నాకు ఎంతో స్ఫూర్తినిస్తుందని తెలిపారు.

ఖండాంతరాల్లో ఉంటూ తెలంగాణా పేద బిడ్డలను, అనాధలను, వికలాంగుల బిడ్డలకు చేస్తున్న ఆర్థిక సహాయం వెలకట్టలేనిదని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు, మనం కలలు కన్న బంగారు తెలంగాణ కోసం అహర్నిశలు కష్టపడ్తున్నారని, ఎటువంటి సందేహాలు అవసరం లేదని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మిషన్ కాకతీయ పథకాల గురించి ఆయన వివరించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరిని కలుపుకొని అందరి సూచనలని తీసుకొని ముందుకు వెళుతుంది కాబట్టి మీరు కూడా ఎటువంటి సలహాలు అయినా లేదా సందేహాలు ఉన్నా వ్యక్తిగతంగా నన్నుకానీ, సోషల్ మీడియా ద్వారా కానీ ప్రభుత్వాన్ని సంప్రదించవచ్చు అని తెలిపారు. ప్రతి తెలంగాణ బిడ్డ మిషన్ కాకతీయలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

తరువాత తెలంగాణ రాష్ట్ర సాధనలో మరియు నేడు పునర్నిర్మాణంలో వారి మాతృభూమికి చేస్తున్న సేవలకు, తెలంగాణ ఎన్నారై ఫోరమ్ ప్రతినిధులు స్వామి గౌడ్ గారిని ఘనంగా సన్మానించి, జ్ఞాపికను అందచేశారు.

తెలంగాణ ఎన్నారై ఫోరం అధ్యక్షులు సిక్కా చందు గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో స్వామి గౌడ్ గారి పాత్రను, మలి దశ ఉద్యమంలోనే కాకుండా 1969లో నూనూగు మీసాల వయస్సు నుండి నేడు తెలంగాణ రాష్ట్ర సాధన వరకు చేసిన పోరాటాల గురించి సభకు వివరించారు, పిలవగానే వచ్చిి ఈ బోనాల వేడుకల్లో మాతో పాటు భాగస్వాములైనందుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తెలంగాణ ఎన్నారై ఫోరమ్ తెలంగాణ ప్రజల కోసం, ప్రపంచంలో ఉన్న తెలంగాణ బిడ్డలకోసం చేస్తున్న కార్యక్రమాల గురించి వివరించి, అందరూ ఇందులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ చిన్నారులు, కమిటీ మహిళా విభాగం సభ్యులు చేసిన సాంస్కృతిక కార్యక్రమం అందరినీ అలరించింది. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా పేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీకై నిర్వహించిన రాఫెల్ లో అందరూ పాల్గొని విజేతలు బంగారం బహుమతులు గెల్చుకున్నారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని సంస్థ జ్ఞాపికలతో ప్రసాదించారు. సంప్రదాయ తెలంగాణ వంటకాలతో పండగ భోజనం సొంత ఇంటిని తల్పించిందని పలువురు అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఎన్నారై ఫోరం ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి గంగాసాని మరియు మంద సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బోనాల జాతర ఇంతటి విజయం సాధించడం సంతోషంగా ఉందని కమిటీ సభ్యులు తెలిపారు.

తెలంగాణ ఎన్నారై ఫోరం అధ్యక్షులు సిక్కా చంద్రశేఖర్ గౌడ్, తెలంగాణ ఎన్నారై ఫోరం వ్యవస్థాపక సభ్యులు అనిల్ కూర్మాచలంతో పాటు ఉపాధ్యక్షులు పవిత్ర రెడ్డి కంది, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి, అడ్వైజరి బోర్డు ఛైర్మన్ ఉదయ నాగరాజు, సంయుక్త కార్యదర్శి సుధాకర్ గౌడ్, ఈవెంట్స్ ఇంచార్జ్ నగేష్ రెడ్డి, ఈవెంట్స్ సెక్రటరీ శ్వేతా రెడ్డి, అడ్వైజరి బోర్డు సభ్యులు ప్రమోద్ అంతటి, మహిళా విభాగం సభ్యులు అర్చన జువ్వాడి, మీనాక్షి, సుమ, స్వాతి, వాణి, నిర్మల, సుషుమ్న, దీప్తి ఇతర కమిటీ సభ్యులు శ్రీధర్, రోహిత్ రేపాక, అశోక్ గౌడ్, నవీన్ రెడ్డి, రత్నాకర్, హరిగౌడ్ నవపేట్, మల్లారెడ్డి, విక్రం రెడ్డి, నరేష్, రంగు వెంకట్, శివాజీ షిండే, శ్రీకాంత్ జెల్ల, అక్రం, శ్రీనివాస్ రుద్ర, చిట్టి వంశీ, సందీప్ గౌడ్, శ్రీధర్ రావు, స్వదేశం నుండి వచ్చిన కరీంనగర్ టీ.ఆర్.యస్ నాయకులు తిరుపతి రెడ్డి కాసర్ల గారు తదితరులు పాల్గొన్నవారిలో ఉన్నారు.

Videos:




Leave a Reply

Your email address will not be published. Required fields are marked *