mt_logo

బీజేపీ మద్దతు తప్పకుండా ఉంటుంది-కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మరో నాలుగు రోజుల్లో జరిగి తీరుతుందని, ఈ అంశానికి సంబంధించి అన్ని పార్టీల మద్దతు అవసరమేనని టీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. శుక్రవారం తనను కలిసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రధాన ప్రతిపక్షపార్టీ బీజేపీతో సహా చిన్న చిన్న పార్టీల మద్దతు కూడా అవసరమేనని, ఎవరినీ ఘాటుగా విమర్శించరాదని అన్నారు. ప్రస్తుత సమయంలో సంయమనం పాటించడమే ఉత్తమమని, ఏదైనా తేడా వస్తే తప్పకుండా స్పందించడానికి సిద్ధంగా ఉండాలని వ్యాఖ్యానించారు. బిల్లుపై సోమ, మంగళవారాల్లో చర్చించనున్నారని, 19 వ తేదీలోపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తీరుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కంటే ముందే తెలంగాణ పట్ల నిర్ణయం తీసుకున్న బీజేపీ ఆఖరి దశలో వెనక్కు తగ్గదని, అలా చేస్తే జరిగే నష్టం గురించి జాతీయ నాయకత్వానికి తెలిసినందున ఎట్టిపరిస్థితుల్లో తెలంగాణ బిల్లుకు పూర్తి మద్దతు బీజేపీ పార్టీ ఇస్తుందని కేసీఆర్ భరోసా ఇచ్చారు. సీమాంధ్ర నేతలు పార్లమెంటులో చేసిన వెకిలి చేష్టలను జాతీయ మీడియా తీవ్రస్థాయిలో ఎండగడుతుంటే సీమాంధ్ర మీడియా మాత్రం లగడపాటి చర్యలను సమర్ధిస్తుందని విమర్శించారు. ఏది ఏమైనా నాలుగురోజుల్లో ఏర్పడే తెలంగాణ రాష్ట్రం కొరకు సంయమనంతో ఉండాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ సూచించారు. తనను కలిసిన తెలంగాణ గ్రూప్ వన్ అధికారులకు కూడా ఇదే విషయాన్ని కేసీఆర్ స్పష్టం చేశారు. సీమాంధ్ర నేతలు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితీరుతుందని, ఇది అందరి విజయమని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *