బీజేపీ నాయకులు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని పద్మశ్రీ అవార్డు గ్రహీత కిన్నెరమెట్ల మొగులయ్య కన్నీటి పర్యంతం అయ్యారు. బీజేపీ నాయకులు రాజకీయంగా తనను వాడుకోవడంపై మొగులయ్య మండిపడ్డారు. తన కలను గుర్తించి తనకు జీవితాన్ని ఇచ్చిన సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజులను అవమానపరిచేలా బీజేపీ నాయకులు వ్యవహరించడం బాధాకరమన్నారు. తన నోట్లో మన్నుపోసేలా బీజేపీ నేతలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడం బాధ కలిగించిందన్నారు. పద్మశ్రీ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా తీసుకున్నా.. బీజేపీ ఇచ్చిందని ఆ పార్టీ నాయకులు ప్రచారం చేసుకోవడం బాధ కలిగిస్తోందన్నారు. బీజేపీ నేతలు ఇలా తప్పుడు ప్రచారం చేస్తే పద్మశ్రీ అవార్డును కూడా వెనక్కి ఇచ్చేస్తానని మొగిలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతల వైఖరికి ఆవేదన చెందిన మొగిలయ్య భావోద్వేగానికి లోనయ్యారు.