mt_logo

బీజేపీ పూర్తి మద్దతు తెలంగాణకే

తెలంగాణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు తమ పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు తెలిపి ఆమోదం పొందేలా చేస్తుందని బీజేపీ జాతీయాధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. గురువారం టీఆర్ఎస్ అధినేత కే.చంద్రశేఖర్‌రావు రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు. సమావేశం అనంతరం కేసీఆర్ విలేకరులతో మాట్లాడుతూ, బీజేపీ తెలంగాణ బిల్లుకు మద్దతు ఇస్తుందని తనకు పూర్తి విశ్వాసముందని, గతంలో పార్టీ కార్యవర్గంలో తెలంగాణపై చేసిన ప్రకటన ప్రకారం తెలంగాణకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని రాజ్‌నాథ్ సింగ్‌ను కోరామని చెప్పారు. బిల్లు పూర్తి రాజ్యాంగబద్ధమైనది కాబట్టి సభలో ఎవరైనా అడ్డుకుంటే వారిని సస్పెండ్ చేసే అధికారం స్పీకర్‌కు ఉందని, విపక్షాలు కూడా సరైన చర్యలు చేపట్టీ బిల్లు ఆమోదం పొందేలా కృషి చేయాలి కానీ, సభ సక్రమంగా లేదని సాకు చూపించడం మంచిదికాదని వ్యాఖ్యానించారు. ఇంతదాకా వచ్చాక వెనక్కు తగ్గితే ప్రజలకు భారత పార్లమెంటరీ వ్యవస్థ మీదే నమ్మకం పోతుందని, బిల్లుకు ఎలాంటి అడ్డంకులు లేకుండా సహకరించాలని రాజ్‌నాథ్ సింగ్‌ను కోరినట్లు కేసీఆర్ చెప్పారు. తన మాటలు విన్న తర్వాత తెలంగాణ బిల్లుకు తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని చెప్పారని, ఇప్పటిదాకా ఉన్న సందేహాలు తొలగిపోయాయని కేసీఆర్ అన్నారు. బీజేపీ వెనుకడుగు వేస్తుందని వార్తలు వస్తున్న విషయాన్ని విలేకరులు ప్రస్తావించగా, నేను పూర్తి ఆశావాదిని, చివరి నిమిషం వరకు నా ప్రయత్నాన్ని కొనసాగిస్తాను. ఎటువంటి ఢోకా ఉండదని రాజ్‌నాథ్ సింగ్ హామీ ఇచ్చారు. బీజేపీ మద్దతు ఇస్తామని గతంలోనూ చెప్పిందని, ఇప్పుడుకూడా స్పష్టత ఇవ్వడం శుభపరిణామమని కేసీఆర్ వివరించారు. రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసినవారిలో పలువురు టీఆర్ఎస్ నేతలు, తెలంగాణ జేఏసీ నేతలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *