జోగుళాంబ గద్వాలజిల్లా చింతలకుంట గ్రామ జడ్పీ పాఠశాలలో చదువుతున్న శ్రీజ గ్రామీణ నేపథ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ.. సృజనాత్మకంగా తను రూపొందించిన పర్యావరణహిత వేరుశెనగ పొట్టు కుండల (బయో పాట్) తయారీకి రాష్ట్రంలో సూక్ష్మ పరిశ్రమ (మైక్రో ఎంటర్ప్రైజ్) ఏర్పాటుకు కార్యాచరణ మొదలయింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ టీ-వర్క్స్ మరియు చైనా బహుళజాతి కంపెనీ హయర్‌కు చెందిన సంస్థ ‘జీఈ అప్లయన్సె్స’లు సంయుక్తంగా గద్వాలలో బయోపాట్ పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చాయి. హైదరాబాద్ హైటెక్ సిటీ కారిడార్‌లోని జీఈ అప్లయన్సెస్ సంస్థలో విద్యార్థిని శ్రీజ సమక్షంలో ‘బయోప్రెస్’ యంత్రం ద్వారా పర్యావరణహిత కుండలను శుక్రవారం ప్రయోగాత్మకంగా తయారు చేశారు.
కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా గద్వాలలో బయోపాట్ పరిశ్రమ ఏర్పాటుకు జీఈ అప్లయన్సెస్ నిధులను సమకూరుస్తోంది. వీటితో గద్వాలలో బయోపాట్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడంతో పాటు యంత్రాలను కొంటారు. మంత్రి కేటీఆర్ సలహాతో ఈ బయోపాట్స్ తయారీకి ఉపయోగించే ‘బయో ప్రెస్’ యంత్రాన్ని సెప్టెంబరులోనే టీ-వర్క్స్ ఆవిష్కరించింది.