శుక్రవారం నల్గొండ జిల్లా భువనగిరి ఏరియా ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన అనంతరం డిప్యూటీ సీఎం టీ రాజయ్య విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీబీనగర్ నిమ్స్ ఆస్పత్రి త్వరలో సీఎం కేసీఆర్ చేతులమీదుగా ప్రారంభమవుతుందని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వలస పాలకులు చూపిన వివక్ష కారణంగానే ఇన్నాళ్ళూ నిమ్స్ ప్రారంభం కాలేదని పేర్కొన్నారు. ఎన్నికల మానిఫెస్టోలో చెప్పినట్లుగా నియోజకవర్గ కేంద్రాల్లోని అన్ని దవాఖానలను సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులుగా మారుస్తామని, వైద్య ఆరోగ్య శాఖను ప్రక్షాళన చేసి ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు.
దవాఖానను పరిశీలించిన మంత్రి అసంతృప్తి వ్యక్తం చేస్తూ 48 గంటలలోగా పనివిధానంలో మార్పు రావాలని హెచ్చరించారు. ఆసుపత్రి వైద్యులు దేవుడితో సమానమని, సేవల్లో విఫలమైతే ప్రజలు దయ్యాలుగా చూస్తారనే విషయం మర్చిపోవద్దని, మన ఊరు-మన దవాఖానా అనే పట్టుదలతో సదుపాయాలు ఉండేలా చూస్తామని చెప్పారు.త్వరలో జరగనున్న మెడికల్ కౌన్సిలింగ్ కోసం నిబంధనలు రూపొందిస్తున్నామని, 40 శాతం మేనేజ్‌మెంట్ కోటా, 10 శాతం ఎన్ఆర్ఐ కోటా అంశాలను పరిశీలించి ఈనెల 25లోగా నిబంధనలు సిద్ధం చేస్తామని రాజయ్య అన్నారు.