శాసనసభలో భూకబ్జాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, లక్షా 90 వేల ఎకరాల భూములు కబ్జాకు గురి అయ్యాయని, అసైన్డ్ భూములు ఆక్రమిస్తే కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సర్కారు ఆజ్ఞ మేరకే పొన్నాలకు భూములు కేటాయించారని, పొన్నాల చట్టాన్ని ఉల్లంఘించినట్లు స్పష్టంగా కనిపిస్తుందని సీఎం అన్నారు. ఒక వ్యక్తిని టార్గెట్ చేసే ఉద్దేశం లేదని, పొన్నాలకు కేటాయించిన భూమిని రద్దు చేయాలని గతంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పిందని గుర్తు చేశారు.
దళితులకు ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా దళితుల బతుకు ఉందని కేసీఆర్ చెప్పారు. సభ్యులంతా చెప్పినట్లు సభాసంఘాన్ని వేసి కబ్జాకు గురైన భూముల వివరాలను సేకరిద్దామని, సభాసంఘం వేసేందుకు ప్రభుత్వానికి అభ్యంతరం లేదని సీఎం స్పష్టం చేశారు. పొన్నాల లక్ష్మయ్య దళితుల భూమి ఆక్రమించింది నిజమేనని, ఈ విషయంలో ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు ఇస్తామని టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు.