-మార్గదర్శకాలు జారీచేసిన సర్కార్
-బహిరంగ విచారణతోనే లబ్ధిదారుల ఎంపిక
-ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టంలోనూ లొసుగుల సవరణ
స్వాతంత్య్ర దినోత్సవం నాడు దళితులకు భూపంపిణీ పథకం ప్రారంభించేందుకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ రోజున దాదాపు మండలానికో గ్రామం చొప్పున ఎంపిక చేసిన 460 గ్రామాల్లో మూడెకరాల భూమిని దళిత గృహిణి పేరు మీద అందించనున్న విషయం తెలిసిందే. ఈ పథకానికి సంబంధించి అనేక సమీక్షా సమావేశాలు నిర్వహించిన అనంతరం ప్రభుత్వం లబ్ధిదారుల ఎంపిక, భూమి కొనుగోలు, వివిధ కమిటీల ఎంపికకు మార్గదర్శకాలు జారీ చేసింది. సీఎం కే చంద్రశేఖర్‌రావు ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఆయా గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపికకు జిల్లా కలెక్టర్లు కసరత్తు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కరీంనగర్ జిల్లాలో దళితులకు భూ పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టనున్నారు.
పారదర్శకతకి పెద్దపీట
గతంలో దళితులు పేదల కోసం ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన అనేక పథకాలు బోగస్ వ్యక్తుల పాలైన అనుభవాలతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించింది. పథకం అమలును పారదర్శకంగా చేస్తే అవినీతికి ఆస్కారం ఉండదన్న విశ్వాసంతో ఆ మేరకు మార్గదర్శకాలు రూపొందించింది. ఇందులో భాగంగా గ్రామ సభలను పోలిన రీతిలో దళిత సభలను నిర్వహించాలని ఆదేశించింది. భూ సేకరణకోసం నియమించబడిన సంబంధిత అధికారులు దళిత వాడలకు వెళ్లి అక్కడ బహిరంగంగా లబ్ధిదారుల ఎంపికను చేపడుతారు. వ్యవసాయం ప్రధాన వృత్తిగా జీవిస్తున్న భూమిలేని నిరుపేద కుటుంబాలకు తొలి ప్రాధాన్యతనిస్తారు.
భూమిలేని నిరుపేద ఎస్సీ కుటుంబాలను ఆయా దళిత కులాలకు చెందిన కుల పెద్దలు, ప్రజల సమక్షంలో ఎంపిక చేస్తారు. ఎటువంటి అభ్యంతరాలు లేకుండా అందరూ ఆమోదించిన వ్యక్తి పేరునే నమోదు చేస్తారు. లబ్ధిదారుల ఎంపిక అనంతరం వారికి సరిపోయే పరిమాణంలో భూమిని సేకరించడం మరో ప్రధానమైన అంశం. గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని లబ్ధిదారులకి పంచాల్సిన భూమిని అంచనావేసి ఆ గ్రామంలో భూలభ్యతపై దృష్టిసారిస్తారు. రెవిన్యూ తదితర అధికారుల సాయంతో ఆ గ్రామంలో పోరంబోకు, బంజరు తదితర ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయా? అవి సాగుకు అనుకూలంగా ఉన్నాయా? అనేది పరిశీలిస్తారు.
ప్రభుత్వ భూమి లభించని పక్షంలో ప్రయివేట్ వ్యక్తులు ఎవరైనా పట్టా భూములను స్వచ్ఛందంగా అమ్మడానికి సిద్ధంగా ఉన్నారా? ఉంటే వారు ఎకరానికి ఎంత మేరకు డిమాండు చేస్తున్నారు? అనే అంశాన్ని లబ్ధిదారుల సాయంతో ప్రభుత్వ అధికారులు పర్యవేక్షిస్తారు. భూ విక్రేతలను సమన్వయం చేసుకోవడం, ధరలు నిర్ణయించడం తదితర బాధ్యతలను అధికారుల సాయంతో లబ్ధిదారులే చేపట్టే స్వేచ్ఛనివ్వనున్నారు. ఎంత ఖర్చయినా వెనకాడకుండా, భూమిలేని అత్యంత నిరుపేదలైన దళితులకు మూడు ఎకరాలు చేరాలనేది ప్రభుత్వ లక్ష్యం అని సంక్షేమ శాఖకు చెందిన అధికారి ఒకరు టీ మీడియాకు తెలిపారు.
విక్రయదారునికి ఆన్‌లైన్‌లో చెక్
కాగా ప్రయివేట్ వ్యక్తుల వద్ద భూమి కొనుగోలు వ్యవహారంలో ప్రభుత్వం కలెక్టర్లకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఇందులో ముఖ్యమైనది భూవిక్రేతకు ప్రభుత్వం ఖరీదు చెల్లించే అంశం. భూమిని అమ్మేందుకు సిద్ధపడ్డ రైతుకు భరోసా కలిగించే విధంగా విక్రయ లావాదేవీలు పూర్తికాగానే సంబంధిత అధికారులు అందుకు సంబంధించిన వివరాలను ప్రభుత్వానికి అందజేస్తారు. దాని ప్రకారం విక్రయదారుని పేరుమీద బ్యాంకు ఖాతాలో ఖరీదు మొత్తాన్ని జమచేస్తారు.
తద్వారా విక్రేతకు భరోసా కలిగించే విధంగా వ్యవహరిస్తారు. ఇక ఈ పథకం అమలుకు గ్రామ సర్పంచి సహా గ్రామస్ధాయి, మండల స్ధాయి అధికారులతో పాటు ప్రభుత్వం ప్రత్యేక కమిటీలు వేస్తున్నారు. అలాగే భూమిని ప్రయివేటు వ్యక్తులనుంచి సేకరించేందుకు మండల, జిల్లాస్ధాయిల్లో కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మండలస్ధాయి కమిటీలో ఎంపీడీవో, ఎంఆర్వో, ఎస్సీ కార్పొరేషన్, గ్రామీణాభివృద్ధి, సెర్ప్ అధికారులు సభ్యులుగా ఉంటారు. జిల్లాస్ధాయి లాండ్ పర్చేజింగ్ కమిటీని జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తారు.
వ్యవసాయం భాధ్యత ప్రభుత్వానిదే..
మొదటి దశలో భూమిని పంపిణీ పూర్తి చేసిన అనంతరం ప్రభుత్వం రెండోదశలో సాగుపై దృష్టి సారిస్తుంది. వ్యవసాయానికి కావలసిన బోరు, విద్యుత్ కనెక్షన్, విత్తనాలు, ఎరువులు తదితర వనరులు ప్రభుత్వమే సమకూరుస్తుంది. మొదటి సంవత్సరానికి కావాల్సిన పెట్టుబడిని ప్రభుత్వమే భరిస్తుంది. ఇందుకోసం సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను వినియోగిస్తారు. ఆగస్టు 15 నుంచి భూమి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో ఈ లోగా ఎంపిక కాబడిన 464 గ్రామాల వివరాలను పేర్లతో సహా పంపాలని ప్రభుత్వం ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.
ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టంలోని లొసుగుల సవరణ
ఇదిలా ఉంటే ఎస్టీ, ఎస్సీ సబ్ ప్లాన్ చట్టం అమలులో అనేక లొసుగులు ఉన్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ జరిపిన సమీక్షల్లో గుర్తించారు. దీనితో చట్టంలో వాటిని వెంటనే సరిదిద్దాలని సీఎం ఆదేశించినట్లు సమాచారం.
ప్రధాన సవరణలు
-ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం అనే పేరును తెలంగాణ ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టంగా మార్చడం.
-నాన్ లాప్సబుల్ (సబ్ ప్లాన్ నిధులు మురిగిపోవు) అనే పదాన్ని చేర్చడం. తద్వారా సంబంధిత ఆర్థిక సంవత్సరంలో ఖర్చుచేయని నిధులను తదుపరి సంవత్సరంలో కూడా వినియోగించుకునేందుకు వీలుంటుంది.
-నాన్ ట్రాన్స్‌ఫరబుల్ (సబ్ ప్లాన్ నిధులను బదిలీ చేయడానికి వీల్లేదు). ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పేరుతో చట్టం చేసిన గత కాంగ్రెస్ ప్రభుత్వం ఒక రకంగా వారిని మోసగించింది. ఆ చట్టం ప్రకారం ప్రభుత్వం అమలు పరిచే ప్రతి పథకం అందుకు సంబంధించి ప్రభుత్వం చేసే మెత్తం ఖర్చులో ఎస్సీ, ఎస్టీల జనాభా దామాషా శాతాన్ని సబ్‌ప్లాన్ నిధులుగా పరిగణించేవారు. ఆ మేరకు ప్లాన్ నిధులు మినహాయించుకునే వారు. ప్రస్తుతం ఈ నిబంధనను సవరించి నిధుల మళ్లింపు నిలిపివేస్తారు.
-నాన్ జనరల్ (ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే లబ్దికలిగించే కార్యక్రమాలకు మాత్రమే ఖర్చు చేయడం) కామన్ యుటిలిటీలకు ప్రభుత్వం చేసే ఖర్చులో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులకు కోత పెట్టడం సరికాదని ప్రభుత్వం భావిస్తోంది. దాన్ని సవరించనున్నారు. దీనితో పాటు ఇంకా ఇటువంటి లొసుగులు ఏమైనా ఉన్నాయా? అనే అంశంపై సంక్షేమ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. మరో వారం రోజుల్లోగా సవరణలను రూపొందించి ప్రభుత్వానికి అందజేయనున్నట్లు సమాచారం. ఎస్సీ, ఎస్టీ అభివృద్ధికి సంబంధించిన పథకాల్లో ప్రభుత్వ అధికారుల నియామకం జిల్లా స్ధాయికి మాత్రమే పరిమితమైంది. దీనితో పథకాలు క్షేత్రస్థాయికి చేరక అనుకున్న ఫలితాలు రావడం లేదు. ఈ నేపథ్యంలో డివిజన్, మండల స్ధాయిలోకూడా అధికారులను నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది.
దళితుల్లో నైపుణ్యాభివృద్ధికి కొత్త పథకం
-త్వరలో ప్రకటించనున్న రాష్ట్ర ప్రభుత్వం
ఎస్సీ సబ్‌ప్లాన్ అమలుకు కేంద్రం అందించే నిధులనుంచి పదిశాతం నిధులను దళితుల్లో నైపుణ్యాభివృద్ధి ఖర్చుచేయాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయించింది. దీనికోసం ఒక ప్రత్యేక పథకాన్ని త్వరలో ప్రకటించనున్నారు. ఈ మేరకు కేంద్రం పంపిన మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రణాళిక అమలుకు రాష్ట్రం నడుం బిగించింది. ఎస్సీ సబ్‌ప్లాన్ అమలుకోసం తెలంగాణకు కేంద్రం నుంచి రూ.2872 కోట్లు రానున్నాయి. ఈ నిధుల్లోంచి కనీసం పదిశాతం అంటే 287 కోట్లను ఎస్సీల వృత్తి నైపుణ్యాన్ని పెంచడం కోసం ఖర్చు చేయాలని, తద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు రెండు వేల మందిని నిపుణులుగా మార్చాలని కేంద్రం సూచించింది.
అలాగే ఈ నిధుల్లో 15 శాతం దళిత మహిళల ఆర్ధికాభివృద్ధి కోసం, 5 శాతం దళిత వికలాంగుల కోసం, 10 శాతం నిధులను మౌలిక వనరుల కల్పన కార్యక్రమాలకు కేటాయించాలని మార్గదర్శకాల్లో కేంద్రం పేర్కొంది. శిక్షణ అందించిన వారిలో కనీసం 70 శాతం మందికి ఉపాధి లభించే విధంగా చర్యలు చేపట్టాలని కేంద్రం రాష్ట్రాన్ని కోరింది. దళితుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటికే పలు సంక్షేమ పథకాలను అమలుకు విధి విధానాలు ప్రకటించింది. దళిత గృహిణికి మూడెకరాల భూమిని అందించడంతోపాటు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌లో ఉన్న లొసుగులను తొలగించి పూర్తి పారదర్శకంగా సబ్ ప్లాన్ నిధులను ఖర్చు చేసేందుకు సవరణలు చేపట్టబోతున్నారు.
ఈ నేపథ్యంలో దళితుల వృత్తి నైపుణ్యాన్ని అభివృద్ధి పరిచే విషయంలో కేంద్రం సూచనలను పాటిస్తూనే, తెలంగాణలోని ప్రత్యేకమైన పరిస్థితులకు అనుగుణంగా ఇందుకోసం ఒక పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించనున్నదని సంక్షేమ శాఖ ముఖ్య అధికారి టీ మీడియాకు తెలిపారు.
నమస్తే తెలంగాణ సౌజన్యంతో..