వందల ఏళ్ల తరబడి తెలంగాణ ప్రాంతంలో జరుగుగుతున్న బోనాల పండుగ, బతుకమ్మ పండుగలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగలుగా ప్రకటించింది. సీమాంధ్ర పాలకుల పాలనలో నిర్లక్ష్యానికి గురైన మన పండుగలు మన రాష్ట్రంలో ఇప్పటినుండి అధికారికంగా నిర్వహించుకోవచ్చు.
త్వరలో జరగబోయే బోనాలు, రంజాన్ పండుగలకు సంబంధించి సమీక్షా సమావేశం సోమవారం సచివాలయంలో దాదాపు నాలుగు గంటలపాటు జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షత వహించగా జంటనగరాలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, దేవాలయాల సిబ్బంది, డీజీపీ, నగర పోలీసు కమిషనర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. బోనాల జాతరకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించాలని ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావులకు సీఎం కేసీఆర్ సూచించారు.
తెలంగాణలో ఈనెల 29 న జరిగే గోల్కొండ బోనాలతో పండుగ ప్రారంభమవుతుంది. సికింద్రాబాద్ లో జూలై 13న బోనాలు, 14న రంగం కార్యక్రమం ఉంటుందని, జూలై 20న పాతబస్తీలోని లాల్ దర్వాజా మహంకాళి బోనాలు, 21న రంగం, యాత్ర ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక జరిగే మొదటి పండుగలు కావడంతో బోనాలు, రంజాన్ ఉపవాస దీక్షలను అత్యంత వైభవంగా జరపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిసింది. తెలంగాణ ప్రజలు ప్రకృతి దేవతలుగా కొలుచుకునే మైసమ్మ, మాంకాలమ్మ, మారెమ్మ, ఉప్పలమ్మ, నల్లపోచమ్మ తదితర ఇంటిదేవతల పండుగలకు కూడా ఇకపై రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు తీసుకురానుంది.
సమావేశం ముగిసిన తర్వాత రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి టీ పద్మారావు, సమాచారశాఖ కమిషనర్ చంద్రవదన్ మీడియాతో మాట్లాడారు. ఈనెల 13న ప్రారంభమయ్యే ఈ వేడుకలు ఏడువారాలపాటు నగరమంతా జరుగుతాయని, వేడుకలు జరిగే ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలకు సెలవులిస్తారని మంత్రి పద్మారావు అన్నారు. జిల్లా కలెక్టర్లు, అధికారులు దగ్గరుండి కార్యక్రమాలను పర్యవేక్షిస్తారని, దాదాపు 13 శాఖలు సమన్వయంతో పనిచేస్తాయని ఆయన చెప్పారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న పండుగ కావడంతో సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారికి ప్రభుత్వం పట్టువస్త్రాలు అందజేస్తుందని పద్మారావు తెలిపారు.