mt_logo

తెలంగాణ రైతు రక్షణ బతుకమ్మ..

విజన్ తెలంగాణా అసోసియేషన్- వాషింగ్టన్ డి. సి.- 04, అక్టోబరు, 2015

విజన్ తెలంగాణ అసోసియేషన్, తెలంగాణా అమెరికా తెలుగు సంఘం మరియు తెలంగాణ జాగృతి సంయుక్తంగా సమర్పించిన “తెలంగాణ రైతు రక్షణ బతుకమ్మ” వేడుకలు వాషింగ్టన్ డి. సి. లో అక్టోబర్ 4వ తేదీన ఘనంగా జరిగాయి. నిజామాబాద్ జిల్లా లోక్‌సభ సభ్యురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఉదయం పూట పవన్ గిర్ల ఇంట్లో విజన్ తెలంగాణ నిర్వహించిన బతుకమ్మ కూర్పు కార్యక్రమంలో, పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలంగాణ మరియు ఇతర ప్రాంతాల ఆడపడుచులు, మిత్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రంగు రంగుల పూలతో అందంగా కూర్చిన బతుకమ్మలు మధ్యలో పెట్టి వాటి చుట్టూ లయబద్ధంగా, గుండ్రంగా తిరుగుతూ, పాటలు పాడుతూ బతుకమ్మ పండుగను ఉత్సాహంగా నిర్వహించినారు. జిల్లాకో బతుకమ్మ చొప్పున పిల్లలు తయారుచేసిన పది జిల్లాల బతుకమ్మలు చూపరులను ఆకర్షించినాయి. విజన్ తెలంగాణ కుటుంబసభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తరువాత విష్ణు ఇంట్లో ఒక వ్యక్తిగత బతుకమ్మ కూర్పు కార్యక్రమంలో శ్రీమతి కవిత గారు అరగంట పాటు పాల్గొన్నారు.

మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ముఖ్య బతుకమ్మ వేడుకలు విజన్ తెలంగాణ ఆధ్వర్యంలో, తెలంగాణా అమెరికన్ తెలుగు అసోసియేషన్ మరియు తెలంగాణ జాగృతి సహకారంతో జరిగినాయి. విజన్ తెలంగాణా ఉపాధ్యక్షులు రమణ కంచెట్టి, సాంస్కృతిక కార్యదర్శి పవన్ గిర్ల ఈ కార్యక్రమానికి సమన్వయకర్తలుగా వ్యవహరించారు. కార్యక్రమంలో వివిధ నగరాలలో నివసిస్తున్న తెలంగాణ మిత్రులందరూ పాల్గొన్నారు. రెండువేల మందికి పైగా పాల్గొన్న ఈ బతుకమ్మ ఉత్సవం విజయవంతమైంది. కళాకారులు భిక్షూ నాయక్, ఆల్ రౌండర్ కిరణ్, మానస ఆచార్య, జనార్ధన్ తమ కళా ప్రావీణ్యంతో శ్రోతలను అలరించారు. పిల్లలను అలరించే ఫ్యాషన్ షోలు, ఆటలు నిర్వహింఛి, విజేతలకు ట్రోఫీలు ప్రదానం చేసినారు.

ఎంపీ కవిత ఈ సందర్భంగా మాట్లాడుతూ, విజన్ తెలంగాణ ఉద్దేశాలు మంచివని, తెలంగాణ జాగృతి ఈ పనుల్లో పాలుపంచుకుంటుందన్నారు. బతుకమ్మ తెలంగాణ ఆడపడుచుల ప్రీతిపాత్రమైన పండుగ అన్నారు. విదేశాల్లో కూడా బతుకమ్మ ఘనంగా జరగడంపై ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుత రైతు ఆత్మహత్యల అత్యవసర సమస్యపై స్పందిస్తూ విదేశాల్లో ఉన్న ప్రవాస భారతీయులు తెలంగాణ బాధిత రైతుల కుటుంబాల సహాయార్థం నెలకు కొంచెం వీలయినన్ని కుటుంబాలకు సహాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో పాల్గొన్న వారి సలహాలు, సూచనలు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తానని అన్నారు.

విజన్ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ విజయకృష్ణ చాట్ల ఈ ఏటి బతుకమ్మను తెలంగాణ రైతు రక్షణ బతుకమ్మగా ప్రకటించారు! రైతు ఆత్మహత్యల నిరోధానికి, వారి కుంటుంబాలకు ఆర్థికంగా వీలైనంత సహాయం చేయడానికి విజన్ తెలంగాణ ఎప్పుడూ ముందు ఉంటుందని దానికి అందరి సహకారం తీసుకుని కృషి చేస్తామని అన్నారు. తమ సంస్థ తెలంగాణ పేద పిల్లల సహాయం కోసం పని చేస్తుందని, గ్రామీణ పేదల జీవితాల్లో మార్పుకు కృషి చేస్తుందని, దాతల, సభ్యుల ఆర్ధికసహాయంతో వివిధ వృత్తి విద్యల శిక్షణకు, ఉద్యోగార్థం వివిధ అంశాల్లో శిక్షణకు కార్యక్రమాలు చేపడతామన్నారు. బతుకమ్మ లాంటి పండుగలు దానికి సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలు కొత్త తరాలకు సంస్కృతిని, అన్ని తరాలకు మనోరంజనంతోబాటు ఒక అనుబంధాన్ని పెంచుతాయని అది తిరిగి తెలంగాణ సమాజానికి ఉపయోగ పడుతుందని చెప్పారు.

తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘం ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి అనుగు మాట్లాడుతూ తమ సంస్థ చేపట్టిన, చేబడుతున్న రైతు కుటుంబ ఆర్ధిక సహాయ కార్యక్రమాల గురించి వివరించారు. తెలంగాణ జాగృతి అమెరికా అధ్యక్షుడు శ్రీధర్ బండారు మాట్లాడుతూ బంగారు బతుకమ్మ ఉత్సవాలు విజన్ తెలంగాణ ఆద్వర్యంలో, టాటా వారి సహకారంతో జరిపామని అందరి సహకారంతో మున్ముందు కార్యక్రమాలు చేపడతామనీ చెప్పారు. తెలంగాణ జాగృతి అమెరికా కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమం మొత్తాన్ని సమన్వయము చేసిన తెలంగాణ జాగృతి సుమంత్ గరకరాజుల, కార్యక్రమం విజయవంతం అయిందన్నారు.

విజన్ తెలంగాణ సంఘం ఉపాధ్యక్షుడు రమణ కంచెట్టి మాట్లాడుతూ బతుకమ్మ సందర్భంగా తాము చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. సంస్థ కోశాధికారి శ్రీనివాస్ విప్ప, సాంస్కృతిక కార్యదర్శి శ్రీ పవన్ గిర్ల, కార్యక్రమాల ఉపాధ్యక్షుడు శ్రీధర్ గుడాల, ధర్మకర్త రామ్ రెడ్డి జక్క, విజన్ తెలంగాణ వాషింగ్టన్ డి.సి. విభాగ అధ్యక్షుడు అశోక్ వాసం ఇంకా ఇతర కార్యవర్గ సభ్యులు హరి రెడ్డి కంచర్ల, సంతోష్ వేముల, గోపాల్ రెడ్డి పిన్నం, ఉదయ్ రెడ్డి, సుధీర్ రెడ్డి దామిడి, సుధీర్ కోడెం, రాజ్ బొప్పూరి, మధు బెల్లం, ప్రదీప్ నూగూరు, ప్రవీణ్ శ్యామల, లక్ష్మీనాథ్ గోపిశెట్టి, శ్రీధర్ రావు మరియు ఇతర మిత్రులు పాల్గొన్నారు.

విరామం లేకుండా, వరుస బెట్టి జరుగుతున్నతెలంగాణ రైతుల ఆత్మహత్యలపై బతుకమ్మ నిర్వాహకులు విచారం వ్యక్తం చెసినారు. రైతు ఆత్మహత్యలు వెంటనే ఆగిపోవాలని, ప్రభుత్వం రుణ బాధిత రైతులకోసం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులందరికీ, కార్యక్రమనిర్వహణకు సహాయం చేసిన దాతలకు, శ్రేయోభిలాషులకు విజన్ తెలంగాణ కార్యవర్గం కృతఙ్ఞతలు తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *