పూలజాతరకు యూనైటెడ్ కింగ్‌డమ్ పరవశించింది. అక్కడ ఉంటున్న తెలంగాణవాసులు మాత్రమే బతుకమ్మ ఆడుతుండే వారు. దీనికి భిన్నంగా ఈ సారి తెలంగాణ జాగృతి యూకె శాఖ పెద్ద ఎత్తున పండుగ వాతావరణంలో బతుకమ్మ ను నిర్వహిస్తుండటంతో మన దేశంలోని ఇతర రాష్ట్రాల వారు కూడా బతుకమ్మ పండుగలో పాలుపంచుకుంటున్నారు. తొమ్మిది రోజుల పాటు జరిగే బతుకమ్మ పండగలో భాగంగా రెండవ రోజు అయిన శనివారం లండన్‌లో ఘనంగా బతుకమ్మను నిర్వహించింది. ఈ సంబురాలకు తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపి శ్రీమతి కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని ఆల్ ఉమ్ క్వయిన్‌లో జరిగిన ఎంగిలిపూల బతుకమ్మకు హాజరయిన ఆమె ఇవాళ ఉదయం యూకెలోని హీత్రూ విమానాశ్రయం చేరుకున్నారు. ఈ సందర్భంగా కవితను యూకె జాగృతి శాఖ ప్రతినిధులు సాదరం స్వాగతం పలికారు.
తెలంగాణ జాగృతి యూకె అధ్యక్షుడు సంపత్ దన్నమనేని నివాసంలో కల్వకుంట్ల కవిత బతుకమ్మలను తయారు చేశారు. ఈ కార్యక్రమంలో జాగృతి మహిళా విభాగం సభ్యులు పాల్గొన్నారు.
అక్కడ దొరికే రంగురంగుల పూలతో తొమ్మిది వరుసుల్లో బతుకమ్మను గోపురంగా పేర్చారు కవిత. బాలికలకు బతుమ్మను తయారు చేయడం ఎలాగో చెప్తూ…వారి చేత చిన్న బతుకమ్మలను పెర్పించారు. అనంతరం పసుపుతో గౌరమ్మను తయారు చేసి కుంకుమ పెట్టారు. శుభ్రం చేసిన దేవుడి గది ముందు బతుకమ్మలను పీటలపై పెట్టి అగరువత్తులను వెలిగించి గౌరీ దేవికి మొక్కారు కవిత.
బతుకమ్మలను తయారు చేస్తున్నంత సేపూ కవిత బతుకమ్మ పాటలను పాడారు. చాలా ఏళ్ల నుంచి లండన్‌లో ఉంటుండటం చేత బతుకమ్మ పాటలను వారు మర్చిపోయారు. దీంతో వారికి పాత పాటలతో పాటు కొత్త పాటలను కూడా పాడుతూ వారితో కూడా పాడించారు. కవిత ఉత్సాహాన్ని చూసిన చుట్టుపక్కల నివసించే ఇతర రాష్ట్రాల వారు సైతం ఉత్సాహంగా ఉయ్యాలో…అంటూ గొంతు కలపడం విశేషం.
ఈస్ట్ హోంలో సంబురాలు
లండన్ ఈస్ట్ హోంలో బతుకమ్మ ఆటా-పాటకు వేదికయింది. బతుకమ్మ ఆట-ఉయ్యాల పాటలతో వైట్ హౌజ్ ప్రాంగణం కొత్త శోభను సంతరించుకుంది. బతుకమ్మ వేడుకలకు న్యూహాం, వెస్ట్ హాం, వెస్ట్ లండన్ పార్లమెంటు సభ్యులు స్టీఫెన్ టిమ్స్, లిన్ బ్రౌన్, రూత్ కాడ్‌బరీ, లార్డ్ దొలకియా, లామ్‌బాత్ మేయర్ సలేహా జాఫర్, ఇండియన్ హై కమిషన్ కార్యదర్శి విజయ్ వసంత్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి యూకె శాఖ అధ్యక్షుడు సంపత్ దన్నమనేని, ప్రధాన కార్యదర్శి శ్రవణ్ రెడ్డి, ఉపాధ్యక్షుడు సుమన్ బల్మూరి, సుష్మ జువ్వాడి, సంతోష్ కుమార్, పావని గణేశ్, ప్రశాంత్ పూస, రఘు జక్కుల, కిశోర్ కుమార్, కత్తి పావని, వంశీ, సలామ్ యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు.