mt_logo

బాపట్ల తొలి ఆంధ్ర మహాసభలోనే తెలంగాణ ప్రతినిధులకు అవమానం

 

-సవాల్‌ రెడ్డి

సరిగ్గా వందేళ్ల క్రితం..

మే 26 1913న ఆంధ్ర ప్రాంతపు నడిబొడ్డుపై తెలంగాణ వారికి చేదు అనుభవం ఎదురైంది. ఆంధ్రుల అభ్యున్నతి కోసం అంటూ ప్రకటించిన తొలి ఆంధ్ర మహాసభలకు తోటి తెలుగువారిగా పొరుగున ఉన్న నిజాం సంస్థాన ప్రతినిధులుగా ఎంతో ఉత్సాహంగా వెళ్లిన తెలంగాణ ప్రతినిధులు అక్కడ జరుగుతున్న తతంగం చూసి అవాక్కయ్యారు. సభ నిర్వాహకులు విషయ నిర్ధారణ కమిటీ సమావేశంలో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలంటూ తీర్మానం ముందుకు తెచ్చారు. ఒక కారణం చెప్పి పిలిపించి మరొక కార్యక్రమం చేపట్టడంపై తెలంగాణ ప్రతినిధులు నిరసన తెలిపారు. రాష్ట్ర ఏర్పాటు వంటి తీవ్ర విషయాలు చేపట్టే ఉద్దేశ్యమే ఉంటే ముందు తెలిపితే ఇటువేపు వచ్చే వారం కాదంటూ, ముందుగా ప్రకటించినట్టు ఈ సభను ప్రకటించిన కార్యక్రమానికి పరిమితం చేసుకోవాలని నిర్వాహకులకు విజ్ఞప్తి చేశారు.

ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు వంటి తీవ్ర అంశం చర్చించే వేదికలో పాలుపంచుకుంటే అక్కడ నిజాం సర్కారుకు తమపై తప్పుడు సంకేతాలు వెళతాయని, తాము నిజాంకు తిరిగి వెళ్లడం కూడా అసాధ్యమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తమ పరిస్థితిని అర్థంచేసుకోవాలని కమిటీ సభ్యులను వేడుకున్నారు. మరో వేదికపై రాష్ట్ర ఏర్పాటు అంశం చర్చించుకోవాలని కోరారు. అయితే నిజాం ప్రతినిధులను పట్టించుకున్నవారే కరువయ్యారు. కనీసం వారికి నచ్చచెప్పిన వారు కూడా లేరు. తమ వేదన అరణ్యరోదనగా మారడంతో భారమైన హృదయంతో సభ నుంచి బయటకు వచ్చిన తెలంగాణ ప్రతినిధులు ఆ వెంటనే నిజాంకు వచ్చేశారు. ఈ అనుభవం నేర్పిన గుణపాఠం వల్లనే ఆ తర్వాత జరిగిన ఏ ఆంధ్ర మహాసభలకు కనీసం అతిథిగా కూడా ఏ తెలంగాణ ప్రతినిధి పాల్గొనలేదు. తెలంగాణ వారి కోసం అటు ఆంధ్రులూ ఆరాటపడలేదు. స్వాతంత్య్రం తర్వాతే నిజాం తెలుగు ప్రాంతాలను కలిపేసుకోవాలనే కోరిక వారికి కలిగింది. అందులోంచే కొత్త దుకాణం విశాలాంధ్ర మహాసభ పుట్టింది. బాపట్ల సభలో తెలంగాణ ప్రతినిధులకు జరిగిన ఈ నిరాదరణ ఉదంతం వెళ్లిన ప్రతినిధులు పెద్ద స్థాయి నాయకులు కాకపోవడం, చెప్పుకుంటే నిజాం పాలకుల నుంచి సమస్యలు వస్తాయన్న భయం అందుకు కారణం కావొచ్చు. ఏమైనా చరిత్ర రికార్డు చేయని అనేక ఘటనల్లో ఇదీ నిలిచిపోయింది.

ఫొటో: తొలి ఆంధ్ర మహాసభలకు వేదిక బాపట్ల టౌన్ హాల్. కొంతమంది ఆంధ్ర చరిత్రకారులు ఈ మహాసభలకు 20,000 మంది ప్రతినిధులు వచ్చారని అతిశయోక్తులు రాశారు. ఈ భవంతి సైజు చూస్తే ఆంధ్ర చరిత్రకారులు రాసిన అబద్ధం అర్థమవుతుంది.  

నిజానికి బాపట్ల సభ విషయంలో కనిపించే ఎజెండాలు అనేకం ఉన్నాయి. స్థూలంగా చెప్పాలంటే 1911 సెప్టెంబర్ నెలలో గుంటూరు కోర్టులో జరిగిన ఒక సంఘటన ఒక పెద్ద ఉద్యమానికి ఊపిరిపోసింది. ఆ కోర్టులో తంజావూరు జిల్లా కుంభకోణం పట్టణానికి చెందిన పిళ్లై అనే తమిళ న్యాయమూర్తి ఉండేవాడు. ఈ సమయంలో సబ్ కోర్టులో బంట్రోతు పోస్టు ఖాళీ పడింది. దీనికోసం స్థానిక యువకులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రాంత అభిమానం తో ఆయన తన సొంత వూరు తంజావూరు జిల్లా కుంభకోణం పట్టణానికి చెందిన వ్యక్తిని ఆ పోస్టులో నియమించాడు. ఈ ఉదంతంబార్ అసోసియేషన్‌లో కలకలం పుట్టించింది. అదే కోర్టులో ఉన్న యువన్యాయవాది న్యాపతి నారాయణరావు ఆ రోజుల్లో గుంటూరులో ప్రముఖంగా ఉన్న యంగ్ మెన్ లిటరరీ అసోసియేషన్ (వైఎంఎల్‌ఏ) కార్యాలయం చేరుకుని జరిగిన విషయం వివరించాడు.

వైఎంఎల్‌ఏ సభ్యుల తీవ్ర కృషితో ఈ ఘటన కోస్తా జిల్లాల వ్యాప్తంగా బహుళ ప్రచారంలోకి వచ్చింది. అంతకుముందు పత్రికల్లో ఆంధ్రులకు అన్యాయాలు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు అంశంపై చర్చలు జరిగినా నిప్పు రగిలించింది మాత్రం గుంటూరు కోర్టు ఘటనే. తదనంతర కాలంలో ఈ ఘటనే ఆంధ్ర ఉద్యమానికి పునాది అయ్యింది. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా ప్రముఖుడు కొండా వెంకటప్పయ్య ఆంధ్రోద్యమ బాధ్యతలు చేపట్టాడు. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం విషయంలో పలువురు పెద్దలు విముఖంగా ఉండడంతో ఆంధ్రుల గత చరిత్ర ప్రచా రం చేస్తూ పునర్ వైభవానికి విద్యా తదిరత రంగాల్లో కృషి జరపాలంటూ ప్రచారం సాగించారు. ఈ పరంపరలో ఆంధ్రులంతా ఒక చోట కలిసి తమ పురోభివృద్ధిపై చర్చించేందుకంటూ గుంటూరు జిల్లా బాపట్లలో జరగనున్న కాంగ్రెస్ సభలతో పాటే ఆంధ్ర మహాసభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు అన్ని జిల్లాలతో పాటు రాష్ట్రేతర ప్రాంతాల్లో ఉన్న ఆంధ్రులకు కూడా ఆహ్వానాలు వెళ్లాయి. ఆహ్వాన సభ విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం ఈ సమావేశంలో చర్చనీయాంశాల్లో తెలుగు సాహిత్యాభివృద్ధి, ఆంధ్రులలో విద్యా పాటవం, ఆర్థిక అభివృద్ధి, నైతిక బలం పెంపు, సైన్యంలోకి ఆంధ్రుల నిషేధం ఎత్తివేత తదితరం ఉన్నాయి

ఈ నేపథ్యంలో చరిత్రలో మొదటిసారి ఏర్పాటైన ఆంధ్రుల సభ కాబట్టి రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు నాగపూర్ నిజాం సహా వివిధ ప్రాంతాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. ఆంధ్రుల సర్వతోముఖాభవృద్ధికి ఏ చర్చలు జరుగుతాయా అని ప్రతినిధులు ఆత్రంగా ఎదురుచూశారు. తొలిరోజు ప్రతినిధులతో కలిపి కార్యవర్గం సమావేశమైంది. సభలో చర్చించవలసిన అంశాల నిర్ణయం కోసం విషయ నిర్ణాయక సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు డిమాండును సభ ముందుంచేందుకు వీలు కల్పించే తీర్మానం ముందుకు తెచ్చారు. దీనిపై ప్రతినిధుల్లో విభేదాలు తలెత్తాయి. అంతకుముందే ప్రతినిధులకు ఆంధ్ర రాష్ట్రం పేరిట సాక్షాత్తూ కొండా రాసిన కరపత్రాలులు పంచడం, తీరా విషయ నిర్ణాయక సదస్సులో సభ నిర్వాహకులే ఈ అంశం లేవనెత్తడంతో తెలంగాణ నుంచి వచ్చిన ప్రతినిధులకు విషయం అర్థమైంది. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు డిమాండుతోనే ఈ ఆంధ్ర మహాసభ నిర్వహణ జరుగుతున్నదని తేటతెల్లమైంది. మిగిలిన అంశాలన్నీ కంటితుడుపులేనని సభకు వచ్చిన యువకుల తీరుతెన్నులతో స్పష్టపడింది. దీనితో వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

ఆంధ్ర ప్రాంతం వారికీ ఇతర బ్రిటిష్ పాలిన ప్రాంతాల నుంచి వచ్చిన వారికి దీనివల్ల ప్రమాదం లేకున్నా నిజాం నుంచి వచ్చిన వారికి మాత్రం సంకటమే. ఫ్యూడల్ ప్రభువు పాలన కింద ఉండడం, పైపెచ్చు ఆ రాజ్యంలో సింహభాగం తెలుగువారు ఉండడం వల్ల ఇక్కడ జరిగే ఆంధ్ర ఉద్యమ ప్రభావం అక్కడా పడుతుందనే అనుమానాలు సహజంగానే నిజాం పాలకులకు తలెత్తే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితిలో ఈ సమావేశానికి తన ప్రాంతం నుంచి కొందరు హాజరయ్యారన్న వార్త చేరితే తమ గతేమిటని ఆందోళన వారిలో ఏర్పడింది. ఈ విషయాన్నే అక్కడ సభికులకు వివరించి ముందుగా చెప్పకుండా ఇలాంటి తీర్మానం తేవడం సరికాదని వాదించారు. తెలుగువారి అభ్యున్నతి అన్న మాటకు కట్టుబడి తీర్మానాలను దానికి పరిమితం చేయాలని వాదించారు.

తప్పదనుకుంటే ఇవే సమావేశాల్లో మరో వేదిక ఏర్పాటు చేసి చర్చించాలని విజ్ఞప్తి చేశారు. అయితే వీరి వాదనలను అటు సభికులు ఇటు నిర్వాహకులు పట్టించుకోలేదు. నిర్వాహకులతో సహా ఎవరిని కోరినా ఉపసంహరణకు వారు ససేమిరా అంగీకరించలేదు. సాటి తెలుగువారి అభ్యున్నతిలో పాలుపంచుకోవడానికి ఎంతో ఉత్సాహంగా వెళ్లిన ఐదుగురు తెలంగాణ ప్రతినిధులు తమ రోదన అరణ్యవేదనే కావడంతో భంగపడి, అవమానపడి సభ నుంచి బయటకు వచ్చి గుట్టుచప్పుడు కాకుండా రైలెక్కి వెనక్కి వచ్చేశారు.
తెలంగాణ ప్రతినిధుల ప్రతిపాదనను పెడచెవిన పెట్టి తీర్మానాల లిస్టులో రాష్ట్ర అంశాన్ని చేర్చిన నిర్వాహకులకు చివరి రోజున ఆ అంశం చర్చకు వచ్చినప్పుడు సభకు హాజరైన పలువురు పెద్దల నుంచి వ్యతిరేకత ఎదురుకావడంతో దిమ్మతిరిగింది.

న్యాపతి సుబ్బారావు పంతులు వంటి ఉద్దండ పిండం ఆంధ్ర రాష్ట్ర తీర్మానాన్ని తూర్పారబట్టడంతో దిక్కుతోచలేదు. ఆయనకు మద్రాసు ఉద్యోగ ప్రముఖుడు ఆదినారాయణయ్య తదితరులు జత కావడంతోపాటు ఈ సభలో దత్తమండలాల వారేరి అని నిలదీయడంతో పాటు కేవలం కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల వారే తీర్మానం చేసేస్తే అది మొత్తం తెలుగువారి అభిప్రాయం అవుతుందా అని ప్రశ్నించడంతో నీళ్లు నమిలారు. చివరకు రాజీగా ఒక సంవత్సర కాలమంతా రాష్ట్ర ఏర్పాటుపై ప్రచా రం చేసి అన్ని ప్రాంతాల ఆమోదం వచ్చాకే తీర్మానం చేయాలని నిర్ణయించడంతో బతుకు జీవుడా అనుకున్నారు. ఇలా తెలంగాణ ప్రతినిధులను తృణీకరించిన నిర్వాహకులకు సభలో తగిన శాస్తే అయింది. నిజానికి బాపట్ల ఆంధ్ర మహాసభ పెద్దగా సాధించినదేదీ లేదు. అంతకుముందు నిడదవోలు సమావేశంలో ఆంధ్ర రాష్ట్ర తీర్మానానికి ఎదురైన అడ్డంకే ఇక్కడాఎదురైంది. అక్కడ వెల్లడైన అభిప్రాయమే ఇక్కడ ఎదురైంది. ఆంధ్రులందరినీ ఒక సమావేశానికి రప్పించిన తృప్తి మాత్రమే మిగిలింది.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *