బుధవారం శాసనసభలో ఆర్ధికమంత్రి ప్రవేశపెట్టిన తొలి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా ఉందని, బంగారు తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా సాగే ప్రస్థానంలో తొలి అడుగులు పడ్డాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆర్ధికమంత్రి శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం సీఎం తన చాంబర్ లో మంత్రులు, ఇతర అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆర్ధికమంత్రి ఈటెలను, ఆర్ధికశాఖ అధికారులను సీఎం ప్రత్యేకంగా అభినందించారు.
దేశంలో మరే రాష్ట్రం అమలుచేయని విధంగా కార్యక్రమాలు, కనీవినీ ఎరుగని రీతిలో ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మి పథకాలకు ఈ బడ్జెట్ లో ప్రాధాన్యం లభించిందని, డ్రింకింగ్ వాటర్ గ్రిడ్, దళితులకు భూపంపిణీ, చెరువుల పునరుద్ధరణ, రహదారుల నిర్మాణం-మరమ్మతులు తదితర అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం చూస్తే ప్రభుత్వ లక్ష్యాలు ఏమేరకు ఉన్నాయో తెలుస్తుందని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్ధానాలు, మానిఫెస్టోలో ఉన్న అంశాలన్నిటినీ దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ రూపకల్పన జరిగిందని, ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలు కేవలం నిధుల విడుదలతో విజయవంతం కాదని, ప్రజలందరి సంపూర్ణ భాగస్వామ్యంతోనే అవి ఆశించిన ఫలితాలు ఇస్తాయని సీఎం స్పష్టం చేశారు.