mt_logo

తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా తొలి బడ్జెట్..

బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగానే ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తొలి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో విద్యారంగానికి అధికంగా రూ. 10,956 కోట్ల నిధులు కేటాయించింది. మండల స్థాయి మోడల్ స్కూళ్ళకు రూ. 980.73 కోట్లు, రాష్ట్ర మాధ్యమిక శిక్ష అభియాన్ కు రూ. 906.40 కోట్లు, సాంకేతిక విద్య కోసం రూ. 212.86 కోట్లు, బాసర ట్రిపుల్ ఐటీకి రూ.119.63 కోట్లు, ఉచిత నిర్బంధ విద్యకు మరో రూ. 25 కోట్లను కేటాయించింది.

బడ్జెట్ అంటే లాభనష్టాల పట్టిక కాదని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా బడ్జెట్ రూపొందించామని ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. సంక్షేమమే మా తొలి ప్రాదాన్యతని, వ్యవసాయరంగానికి రూ. 7,099 కోట్లు కేటాయించామని, 10 జిల్లాల్లో వ్యవసాయానికి ఇంత భారీ బడ్జెట్ కేటాయించడం ఇదే మొదటిసారని ఆయన పేర్కొన్నారు. జిల్లా ఆస్పత్రులను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులుగా మార్చుతామని, విద్య, వైద్యం అందించడం ప్రభుత్వ కనీస బాధ్యతని, కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని తెలిపారు.

ఏ వస్తువు మీద పన్నులు విధించలేదని, మేము ప్రవేశపెట్టింది పన్ను రహిత బడ్జెట్ అని, గతంలో బడ్జెట్ కేటాయింపులు చేసినా చాలా రంగాల్లో ఖర్చు కాలేదని, కానీ తమ ప్రభుత్వం తెలంగాణ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని ఈటెల స్పష్టం చేశారు. రైతులకు బ్యాంకుల్లో ఉన్న రుణమాఫీకి సంబంధించి తొలివిడతగా రూ. 4,250 కోట్లు కేటాయించామని, వచ్చే మూడేళ్ళలో ఇదేవిధంగా చెల్లిస్తామని చెప్పారు. గత పాలకుల హయాంలో ఇవ్వని ఎర్రజొన్న బకాయిలు రూ. 11.50 కోట్లను రైతులకు చెల్లించామని, 2009-10 సం.లో ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు రూ. 480.43 కోట్లు రైతులకు అందజేశామని మంత్రి గుర్తుచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *