ప్రజాసమస్యలపై చర్చించడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదని, చర్చ జరిగితే ఎక్కడ తమ బండారం బయటపడుతుందో అనే ఉద్దేశంతోనే చర్చను అడ్డుకుంటున్నారని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఈ రోజు ప్రారంభమైన శాసనసభ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల కార్యక్రమం మొదలవ్వగానే కాంగ్రెస్ సభ్యులు స్పీకర్ పోడియంలోకి వెళ్లి ఆందోళన చేస్తూ సభను అడ్డుకోవడంపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజకీయ దురుద్దేశంతోనే సభకు ఆటంకం కలిగిస్తున్నారని, ప్రజలపై వారికి ప్రేమ లేదని, సభా సమయాన్ని వృధా చేయడం సరికాదని హరీష్ అన్నారు. ప్రశ్నోత్తరాల సమయం నడవకుండా పించన్ పై చర్చ జరగాల్సిందేనని కాంగ్రెస్ సభ్యులు ఆందోళన కొనసాగించడంతో గందరగోళ పరిస్థితుల మధ్య స్పీకర్ సభను పదినిమిషాలపాటు వాయిదా వేశారు.