mt_logo

బాలింతకు భరోసా

– కేసీఆర్ కిట్ల పథకంతో సత్ఫలితాలు
– ప్రభుత్వ దవాఖానల్లో పెరుగుతున్న ప్రసవాలు
– 3,06,977 మందికి లబ్ధి
– పథకం కోసం రూ.400.87 కోట్లు వెచ్చించిన ప్రభుత్వం
– 7,35,541 మంది గర్భిణులు ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న కేసీఆర్ కిట్ల పథకంతో ప్రసవాల కోసం సర్కారు దవాఖానల్లోకి వచ్చేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. రాష్ట్రంలో మాతాశిశు మరణాలను నియంత్రించడంలో భాగంగా ప్రభుత్వం కేసీఆర్ కిట్లు-అమ్మఒడి కార్యక్రమాన్ని అమలుచేస్తున్నది. గతేడాది జూన్ మూడున పథకం ప్రారంభమైన నాటినుంచి ఆదివారం వరకు ప్రభుత్వ దవాఖానల్లో 3,06,977 ప్రసవాలు జరిగాయి. ప్రభుత్వం ఈ పథకం కింద ఇప్పటివరకు రూ.400.87 కోట్లు ఖర్చుచేసింది. ఇందులో గర్భిణులు, బాలింతల పోషకాహారం కోసం రూ.335.19 కోట్లు, కేసీఆర్ కిట్లు అందజేసేందుకు రూ.65.68 కోట్లు వెచ్చించింది. కేసీఆర్ కిట్ల పథకం అమల్లోకి వచ్చాక ప్రభుత్వ దవాఖానల్లో 25 శాతం ఉన్న ప్రసవాలు 50 శాతానికి పెరిగాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 7,35,541 మంది గర్భిణులు ఈ పథకం కింద ఆన్‌లైన్‌లో తమపేర్లు నమోదు చేసుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానల్లో 3,34,468 ప్రసవాలు జరుగగా.. కేసీఆర్ కిట్ల పథకం కింద 3,06,977 మందికి లబ్ధిచేకూరింది.

కరీంనగర్‌లో ఒకేరోజు 54 ప్రసవాలు
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో గత శుక్రవారం ఒకే రోజు 54 ప్రసవాలు జరుగడం విశేషం. అదే కేంద్రంలో 21 రోజుల్లోనే 617 ప్రసవాలు జరిగాయి. కేసీఆర్ కిట్ల పథకం అమలు వల్లే ప్రభుత్వ దవాఖానలకు వచ్చే గర్భిణుల సంఖ్య పెరుగుతున్నదని, ఈ కారణంగానే ఒకేరోజు 54 ప్రసవాలు చేయగలిగామని కరీంనగర్ మాతాశిశు సంరక్షణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు.

నవజాత శిశు సంరక్షణపై దృష్టి
మాతాశిశు సంరక్షణకోసం ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్ తరహాలో, అధునాతన సౌకర్యాలతో వైద్యాన్ని అందిస్తున్నారు. అన్ని జిల్లా దవాఖానల్లో నవజాత శిశువుల సంరక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక యూనిట్లను ఏర్పాటుచేసింది. అందులో భాగంగానే నీలోఫర్ దవాఖానలో ఏర్పాటు చేసిన ఇంటెన్సివ్ కేర్ బ్లాక్‌లో దేశంలో అందుబాటులో ఉన్న అన్ని అత్యాధునిక వసతులను కల్పించింది. చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వైద్య, ఆరోగ్యశాఖ రెండున్నరేండ్లలో రాష్ట్రవ్యాప్తంగా 28 ఎస్‌ఎన్‌సీయూలు (సిక్ న్యూబర్న్ కేర్ యూనిట్లు), 61 ఎన్‌బీఎస్‌యూ, 562 ఎన్‌బీసీసీలను ఏర్పాటుచేసింది. ఎస్‌ఎన్‌సీయూల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఎఫ్‌బీఎన్‌సీ శిక్షణ అం దించి అంతర్జాతీయ ప్రమాణాలతో చిన్నారులకు వైద్యం అందించేలా తీర్చిదిద్దింది.

16 రకాల వస్తువులతో కేసీఆర్ కిట్
దేశంలో మరెక్కడా లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం బాలింతల కోసం కేసీఆర్ కిట్ల పథకాన్ని అమలుచేస్తున్నది. ఇందులో రూ.2 వేల విలువైన 16 వివిధ రకాల వస్తువులను అందజేస్తున్నది. కిట్‌లో నవజాత శిశువు కోసం దోమతెర, బేబీ ఆయిల్, బేబీ సోప్, బేబీ క్రీమ్, బేబీ షాంపూ, రెండు టవళ్లు, బేబీ న్యాప్కిన్స్, 2 జతల దుస్తులు, సోప్‌బాక్స్, ఆటవస్తువులు తల్లికోసం రెండుచీరలు, రెండు సబ్బులు, కిట్‌బ్యాగ్, ప్లాస్టిక్ బకెట్ ఉంటాయి. దీంతోపాటు ఆడబిడ్డ పుడితే రూ.13 వేలు, మగబిడ్డ పుడితే రూ.12 వేలు ఆర్థిక సాయం అందజేస్తున్నారు. కేసీఆర్ కిట్ల పథకం అమలుతీరును దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల ప్రతినిధులు వచ్చి పరిశీలించారు.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *