రాష్ట్ర విభజన సందర్భంగా సీమాంధ్ర ఉద్యోగులు చేస్తున్న కుట్రలకు అంతులేకుండా పోతుంది. ఇప్పుడు తాజాగా బల్దియాలోని ఇద్దరు సీమాంధ్ర డాక్టర్లు ప్రభుత్వానికి తెలంగాణలో జన్మించినట్లు నకిలీ బర్త్ సర్టిఫికెట్లు సమర్పించారని తెలిసింది. మూసేసిన స్కూళ్ళనుండి బోనఫైడ్ సర్టిఫికెట్లను సృష్టించి వాటి ఆధారంగా నకిలీ బర్త్ సర్టిఫికెట్లు పొందారని సమాచారం. జీహెచ్ఎంసీ కి చెందిన సర్కిల్-9 సహాయ వైద్యాధికారి డా. మనోహర్ కృష్ణాజిల్లా వాసి అయినప్పటికీ తాను నల్లగొండ జిల్లా, నకిరేకల్ లో జన్మించినట్లు, సర్కిల్-17లో ఏఎంఓహెచ్ గా పనిచేస్తున్న డా. మైత్రేయి తూర్పు గోదావరి జిల్లాకు చెందినప్పటికీ, తాను కాప్రా సర్కిల్ లో జన్మించినట్లు ఫేక్ సర్టిఫికెట్ అందజేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
జనన, మరణ ధృవపత్రాల జారీలో భారీగా అవినీతి జరిగే అవకాశం ఉండటంతో సీమాంధ్రులు తెలంగాణలో తిష్టవేయడానికి కుట్రలు చేస్తున్నారని, వీరిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఉద్యోగులు మండిపడుతున్నారు. జీహెచ్ఎంసీలో 18మంది సహాయ వైద్యాధికారులుగా పనిచేస్తుండగా వారిలో 11మంది సీమాంధ్రకు చెందినవారే. హెల్త్ అసిస్టెంట్లలో 34మంది ఔట్ సోర్సింగ్ కింద నియమితులవగా, వారందరూ సీమాంధ్రులే కావడం విశేషం. బోగస్ సర్టిఫికెట్లు సృష్టించే సీమాంధ్ర ఉద్యోగులను జైలుకు పంపిస్తామని టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్ హుస్సేనీ బుధవారం నాంపల్లిలో జరిగిన టీఎన్జీవో జిల్లా సమావేశంలో హెచ్చరించారు.
మరోవైపు సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలోని తెలంగాణ వైద్యుల సంఘం అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ, సీమాంధ్ర ఉద్యోగులు సమర్పించే సర్టిఫికెట్లను క్షుణ్ణంగా పరిశీలించాలని, దొంగవని తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. గాంధీ ఆస్పత్రిలో మొత్తం 284 మంది వైద్యులు ఉండగా అందులో 144 మంది సీమాంధ్రులని, 40 మంది వైద్యులు నిజమైన సర్టిఫికెట్లు సమర్పించగా, 100మంది బోగస్ సర్టిఫికెట్లు సమర్పించారని పేర్కొన్నారు.