ప్రీమియర్ ఎనర్జీ సంస్థ తన కార్యకలాపాలను రాష్ట్రంలో మరింతగా విస్తరించనున్నది. అమెరికాకు చెందిన అజ్యూర్ పవర్ గ్లోబల్ లిమిటెడ్‌తో జత కట్టిన ప్రీమియర్ ఎనర్జీ గ్రూప్ హైదరాబాద్‌లోని తన ప్లాంట్ ను మరింతగా విస్తరించేందుకు నిర్ణయం తీసుకుంది. తన విస్తరణ కార్యకలాపాల ద్వారా సుమారు రూ. 4 వేల కోట్ల సోలార్ సేల్స్, సోలార్ మాడ్యుల్‌ను రానున్న నాలుగు సంవత్సరాలలో సరఫరా చేసేందుకు ఈ మేరకు ఒక అవగాహన ఒప్పందం చేసుకుంది. ప్రీమియర్ ఎనర్జి, అజ్యూర్ పవర్ గ్లోబల్ సంస్థ రూ.700 కోట్లతో 1.25 గిగా వాట్లా చొప్పున సోలార్ సెల్, సోలార్ మాడ్యూల్ ప్లాంట్లను రెండింటిని ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లోని ఇసిటిలో నూతన ప్లాంట్ల ఏర్పాటుకు అవసరమైన పత్రాలను రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కంపెనీ ప్రతినిధులకు అందజేశారు. ఈ 700 కోట్ల పెట్టుబడితో సుమారు మూడు వేల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు లభించనున్నాయి. కంపెనీ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశానంతరం, అనుమతి పత్రాలను మంత్రి కేటీఆర్ అందించారు. ఈ సందర్భంగా కంపెనీ పెట్టుబడులను మనస్పూర్తిగా ఆహ్వానిస్తున్నట్లుగా పేర్కొన్నారు. రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రీమియర్ ఎనర్జీ వంటి కంపెనీలు తిరిగి మరిన్ని పెట్టుబడులు పెట్టడం అంటే తెలంగాణలో ఉన్న స్నేహపూర్వక పారిశ్రామిక విధానాలకు అద్దం పడుతోందని కెటిఆర్ వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ప్రీమియర్ ఎనర్జీ, అజ్యూర్ పవర్ గ్లోబల్ మరింతగా విస్తరించాలని ఆయన ఆకాంక్షించారు. కంపెనీకి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుజు సిద్ధంగా ఉంటుందని తెలిపారు.

