mt_logo

అవే మాటలు.. అదే నాటకం

By: పరాంకుశం వేణుగోపాల స్వామి

తెలంగాణలో కుల పోరాటాలను రాజేసి, మీడియా ద్వారా నీతులు చెబుతూ, తీర్పరి పాత్ర వహిస్తూ, తెలంగాణను పరిపాలించాలనే ఆంధ్రా పాలకులకు నిరాశ తప్పదు. ఆంధ్రా కుల వైషమ్యాల సంస్కృతి ఇక్కడ లేదు. తెలంగాణ సమాజమంతా ఏకమై ఉన్నది. అభివృద్ధి బాటలో పయనిస్తున్నది.

మీడియా చేతిలో ఉంటే ఉన్నది లేదనిపించవచ్చు. లేనిది ఉన్నట్టు భ్రమింపజేయవచ్చు. ఒంటి నిండా బురద పూసుకున్న వాడిని పరిశుద్ధుడిగా చూపించవచ్చు. పరిశుభ్రంగా ఉన్నవారిపై బురద చల్లనూ వచ్చు. అంతా ఆంధ్రా మీడియా మాయాజాలం!

ఆంధ్రా వ్యాపార లాబీ చాలా బలమైనది. కొద్దిరోజుల కిందట సంప్రదాయవర్గానికి చెందిన, ఒకప్పుడు వైఎస్‌కు సన్నిహితంగా మెలిగిన ఒక ఆంధ్రా మేధావి-రాజకీయ నాయకుడు ఒక మాట అన్నడు. సోనియాగాంధీని మినహాయిస్తే కాంగ్రెస్‌లోని మిగతా ఉన్నత నాయకులంతా ఒక పత్రికాధిపతి ప్రలోభంలో ఉన్నారని. ఒక కాంగ్రెస్ మాత్రమే కాదు, బీజేపీ నాయకత్వం కూడా ఆ (టీడీపీ) లాబీ ప్రభావంలో ఉన్నదనేది వాస్తవం. ఏ పార్టీ వచ్చినా వారి ప్రలోభానికి లేదా ప్రభావానికి అతీతం కాదు. వారికంటూ ఒక పార్టీ ఉన్నది. మిగతా పార్టీలను కూడా ప్రభావితం చేస్తారు. ఇక బీజేపీ, టీడీపీ అనుబంధం గురించి బహిరంగంగా కనిపించేది తక్కువ. లోపాయికారి అనుబంధం బలమైనది. వాజపేయి కాలంలో టీడీపీ ఎన్డీయేలో భాగమే. గత లోక్‌సభ ఎన్నికల్లో కలిసే పోటీ చేశాయి. ఇటీవలి వరకు చంద్రబాబు మోదీతో అంటగాగినవారే. తీరా ఎన్నికలు సమీపించే సమయానికి మోదీని విలన్‌గా చూపించి, చంద్రబాబును బీజేపీ విరోధిగా స్థిరపరుచడం మీడియా సహకారం లేకపోతే సాధ్యం కాకపోయేది. చంద్రబాబు ఎన్డీయే లోపల ఉన్నారా, బయట ఉన్నారా అనేది అప్రధానం. పైన కనిపించే పోరాటమంతా ఉత్తుత్తిదే. ఏపీ, తెలంగాణ విషయానికి వచ్చేసరికి రెండింటి వైఖరి ఒక్కటే-అది ఆంధ్రా లాబీ వైఖరి. కానీ టీఆర్‌ఎస్ ఏనాడూ బీజేపీతో అంటకాగింది లేదు. కాంగ్రెస్, బీజేపీలు జాతీయ విధానంలో భాగంగా తెలంగాణకు మద్దతు ఇవ్వడం మినహాయిస్తే, ఆంధ్రా లాబీ అభీష్టాన్ని పణంగా పెట్టి తెలంగాణకు, టీఆర్‌ఎస్ కు ఒరగబెట్టింది ఏమీ లేదు.

పరాయి శక్తులు (తెలంగాణలో) మనలో మనకు విభేదాలు సృష్టించి పబ్బం గడుపుకుంటాయనేది ఆరు దశాబ్దాల చరిత్ర నేర్పిన పాఠం. అందుకే కేసీఆర్ మత సామరస్యం విషయంలో అనేకసార్లు జాగ్రత్తలు బోధిస్తుంటారు. గాంధీ ప్రశంసించిన తెలంగాణ తెహజీబ్‌ను గుర్తు చేస్తుంటారు. మజ్లిస్‌ను స్నేహపక్షంగా ప్రకటించారు. కులాల విషయంలో కూడా-అన్ని సామాజిక వర్గాలు అభివృద్ధిలో భాగస్వాములు కావాలని తపన పడుతుంటారు. ఇది కండ్లముందు కనబడుతున్న వాస్తవం. కానీ బీజేపీ, టీఆర్‌ఎస్ ఒకే కూటమిలో ఉన్నట్టు ఆంధ్రా మీడియా, తెలంగాణలోని వారి ఏజెంట్లు పదేపదే ప్రచారం చేస్తుంటారు. నిజమేనేమో అనిపించేస్థాయిలో ఈ ప్రచారం సాగుతుంది. వాస్తవాన్ని కనుమరుగేచేసే వంచన. ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంతో సత్సంబంధాలు కలిగి ఉంటారు. స్వభావరీత్యా ఆయన కబ్జాకోరు కాదు. పక్క రాష్ర్టాలతో కూడా సామరస్యంగా ఉండాలంటారు. విభేదాలను ఇరువురికి లాభదాయకంగా పరిష్కరించుకోవాలంటారు. తెలంగాణకు తన వాటా నీరు వాడుకున్నట్టే, ఏపీ కూడా తన వాటా ఉపయోగించుకోవాలని సూచనలు చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ తపన పడుతున్న తీరు ఒక ప్రధానినే కాదు, కేంద్రంలోని పెద్దలందరిని కదిలించిన మాట వాస్తవం. అయినప్పటికీ, కేసీఆర్ ఎంత మెప్పించినా, మోదీ ఆంధ్రాలాబీ ఒత్తిడిని అధిగమించి విభజనాంశాల విషయంలో తెలంగాణకు న్యాయం చేయలేదు. అయినా కేసీఆర్ మిగతా విషయాల్లోనైనా తెలంగాణను ఇబ్బంది పెట్టకుండా, అభివృద్ధి సజావుగా సాగేవిధంగా కేంద్ర మద్దతు సాధించగలిగారు. పార్టీలకతీతంగా కేంద్ర రాష్ర్టాల మధ్య ఆదర్శప్రాయ సంబంధాలు ఉండాల నే కేసీఆర్ ఆలోచన ఫలితమిది. ఇక రాజకీయాల విషయానికి వస్తే, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలది ఒక్క టే కుతికె. వారిని తెర వెనుక ఉండి నడిపించేది ఆంధ్రా లాబీ అనేది అనేకసార్లు స్పష్టమైంది. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, ఏ పార్టీ ప్రయోజనాలు ఆ పార్టీకి ఉన్నప్పటికీ, తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక అయిన టీఆర్‌ఎస్‌ను దెబ్బకొట్టాలనే విషయంలో ఈ మూడు పార్టీలది ఒకే వైఖరి. తెర వెనుక ఒక ఉమ్మడి వ్యూహం అమలవుతున్నది. తెరముందు పాత్రధారులు వేరుగా కనిపిస్తున్నా, సూత్రధారి ఆంధ్రా లాబీ!

ఇక ఓటుకు నోటు కేసులో నగ్నంగా దొరికిపో యిన టీడీపీ- కాంగ్రెస్ నాయకుడు రేవంత్‌రెడ్డి విషయానికి వద్దాం. ఆయన నివాసంలో ఆదాయపు పన్ను, ఈడీ అధికారుల సోదాలు జరిగాయి. సింగపూర్‌లో ఖాతాలకు ఎన్ని డిపాజిట్లు ఉంటాయో తెలిసిన నాయకుడికి ఈ శాఖలు కేంద్రం ఆధీనంలో ఉంటాయని, కేసీఆర్‌కు సంబంధం లేదని తెలువదా? తెలిసి కూడా, మోదీనీ లేదా బీజేపీని తెరవెనుక నియంత్రించే టీడీపీనీ తిట్టకుండా, కేసీఆర్‌పైనే ఎందుకు పరుష వ్యాఖ్యలు చేసినట్టు? ఆయన మాట్లాడిన తీరంతా ఒకసారి జాగ్రత్తగా వింటే చాలు, ఈ మొత్తం నాటకం వెనుక కుట్రను అర్థం చేసుకోవడం కష్టమేమీ కాదు. ఆయన రాజకీయంగా కేసీఆర్‌ను విమర్శించడానికే పరిమితం కాలేదు. తెలంగాణలోని ఒక సామాజికవర్గాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు. తన నివాసంలో సోదాలను కులపోరుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అంటే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఒక కులాన్ని రెచ్చగొట్టడానికి ఈ కుట్ర జరిగిందనేది స్పష్టం.

ఓటుకు నోటు కేసులో ఈ టీడీపీ (కాంగ్రెస్) నాయకుడు ఏం మాట్లాడాడో మళ్ళా ఒకసారి గుర్తుకొస్తున్నది. తెలంగాణలో ఒక సామాజికవర్గం తరఫు ప్రతినిధిని అన్నట్టుగా మాట్లాడాడు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం గడువు తీరే వరకు ఉండదని, మధ్యలో కూలిపోతుందని చంద్రబాబు బహిరంగంగా వ్యాఖ్యానించిన కొద్దిరోజులకే ఆయన అజెండాను అమలుచేస్తూ ఈ పెద్ద మనిషి అడ్డంగా దొరికిపోయాడు.ఆంధ్రా పాలకవర్గం తెలంగాణలో వర్గపోరాటం పేరిట కొంతకాలం అశాంతిని సృష్టించి వలసపాలనను సాగించింది. ఆ తర్వాత కాలం మారిందని, కుల పోరాటాలను రెచ్చగొట్టడం మొదలుపెట్టింది. తెలంగాణ గ్రామాల్లో ప్రజలను సమావేశపరిచి కుల సంఘాలు పెట్టుకోమని బోధించిన ఉదంతాలున్నా యి. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్నప్పుడు ఓయూ క్యాంపస్ మొదలుకొని అన్ని జిల్లాల్లో విద్యార్థులు, ఉద్యోగస్తుల చేత కులసంఘాలు నిర్మించడం వెనుక ఆంధ్రా లాబీ, ఆ లాబీ పెంచి పోషించే మేధావుల హస్తం ఉన్నదనేది బహిరంగ రహస్యం. కోస్తాలో మాదిరిగా కులాల మధ్య తెంపులు పెట్టి తమ పాలనను సుస్థిరం చేసుకోవాలనేది ఆంధ్రా పాలకవర్గం కుతంత్రం. దళితులంతా కాంగ్రెస్‌కు బలమైన మద్దతుగా ఉన్నప్పుడు, ఉప కులాల మధ్య తేడాను వైషమ్యంగా మార్చి పబ్బం గడుపుకొన్నదనే ఆరోపణ టీడీపీపై ఉన్నది. ఇటీవల తెలంగాణలోని రెండు గిరిజనవర్గాల మధ్య వైషమ్యాలను పెంచడం వెనుక టీడీపీ పరోక్ష హస్తం ఉన్నది.

ప్రజల మధ్య ఉండే వైరుధ్యాలను స్నేహపూర్వకంగా పరిష్కరించి అభివృద్ధి చేయడం పాలకుల లక్ష్యం కావాలె. కానీ వైషమ్యాలు పెంచి అసలు సమస్యలను, అభివృద్ధిని మరిపించడం దోపిడీదారుల లక్షణం. ఇటీవల బీసీ ఉపకులాల మధ్య చిచ్చుపెట్టే కుట్ర సాగుతున్నది. ఇదే రీతిలో తెలంగాణలోని రైతు సామాజిక వర్గాన్ని, వృత్తికులాలను – ఇట్లా ఒకరిపై మరొకరిని రెచ్చగొట్టే కుట్రలు సాగుతున్నాయి. కేసీఆర్ రైతుల, వృత్తికులాల అభ్యున్నతికి శాస్త్రీయమైన రీతిలో చిత్తశుద్ధితో కృషిచేయడాన్ని జీర్ణించుకోలేని ఆంధ్ర పాలకవర్గం తమ కుట్రలను మరింత తీవ్రతరం చేసింది. తమ ప్రలోభాలకు లొంగే అనేక కుల, వృత్తి, ఉద్యోగ సంఘాల నాయకులను తయారుచేసుకొని తెలంగాణ అంతటా ప్రజల్లో విద్వేషాలు నింపే కార్యక్రమం సాగుతున్నది. ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన నాయకుడికి అప్పగించిన పాత్ర కూడా ఈ వైషమ్యాన్ని రెచ్చగొట్టడమే అనేది ఆనాడే అతడి మాటల్లోనే స్పష్టమైంది. ఒక ఎమ్మెల్సీని ప్రలోభ పెట్టేందుకు డబ్బుతో దొరికిపోయిన వ్యక్తిని నిస్సిగ్గుగా కాంగ్రెస్ పార్టీ చేర్చుకొని పెద్దపీట వేసిందంటే, తెరవెనుక ఈ పార్టీలన్నీ ఒక్కటే అనీ, ఒకే లాబీ నడిపిస్తున్నదని స్పష్టమైపోతున్నది.

ఆ లాబీ అజెండాను అన్ని పార్టీలు అమలు చేస్తున్నాయనీ, ఆనాడు ఓటుకు నోటు వ్యవహారమైనా, ఇప్పుడు ఆదాయపు పన్ను దాడులు-కేసీఆర్‌పై విమర్శలయినా ఆ విస్తృత కుట్రలో భాగమేనని తెలిసిపోతున్నది. తాజా వ్యవహారం వెనుక మతలబు ఏమైనప్పటికీ, ఓటుకు నోటు కేసులో బహిరంగంగా పట్టుబడిన వ్యక్తి ఇంత ధైర్యంగా మాట్లాడుతుండటం, మీడియా ఆయనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం, ఆయన వెనుక ఆంధ్రా లాబీ లేకుంటే సాధ్యమయ్యేదా?

తెరవెనుక ఎన్ని కుట్రలు జరిపినా, తెలంగాణ సమాజం పోరాడి గెలిచింది. ఎన్ని తోక సంఘాలను ఎగదోసినా, ప్రజలు కేసీఆర్‌ను గెలిపించారు. రైతు వర్గం మొదలుకొని సబ్బండవర్ణాల వరకు, అన్ని సామాజిక వర్గాలూ ఏకతాటిపై నిలిచి ఉండటం ఆంధ్రా లాబీకి మింగుడు పడటం లేదు. తెలంగాణ ప్రజలు తన్నుకుంటూంటే, మన నీళ్ళను కొల్లగొట్టాలని, మనలను తమ తాబేదార్ల ద్వారా పరోక్షంగా పాలించి లబ్ధి పొందాలని పరాయిశక్తులు పన్నిన కుట్రలు విఫలమవుతున్నాయి. కేసీఆర్ నాయకత్వంలో అన్ని సామాజికవర్గాల ప్రజలు ఏకమైపోవడం పరాయిశక్తులకు గుబులు పుట్టిస్తున్నది. తెలంగాణ సమాజం గొప్పతనం వారికి అర్థం కావడం లేదు.

1857 సిపాయి తిరుగుబాటులో ముస్లింలు, హిందువులు కలిసిపోరాడటం బ్రిటిషర్లను ఆశ్చర్యపరిచింది. రాజు ముస్లిం కనుక హిందువులు తమకు మద్దతిస్తారని వారు భావించారు. ఇరాక్‌పై నాటో సైనికులు దాడి చేసినప్పుడు సద్దాం సున్నీ కనుక షియాలు మద్దతు ఇస్తారని యుద్ధం ఎక్కువ కాలం సాగదని భావించారట. మతయుద్ధాల కాలం నాటి మనస్తత్వంతో వారు వేసిన అంచనాలు అవి. తెలంగాణలో కుల పోరాటాలను రాజేసి, మీడియా ద్వారా నీతులు చెబుతూ, తీర్పరి పాత్ర వహిస్తూ, తెలంగాణను పరిపాలించాలనే ఆంధ్రా పాలకులకు నిరాశ తప్పదు. ఆంధ్రా కుల వైషమ్యాల సంస్కృతి ఇక్కడ లేదు. తెలంగాణ సమాజమంతా ఏకమై ఉన్నది. అభివృద్ధి బాటలో పయనిస్తున్నది.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *