పంద్రాగస్టు వేడుకలు గోల్కొండ కోటలోని రాణిమహల్ వద్ద నిర్వహించాలని, కోటకు సమీపంలో ఉన్న సైన్యానికి చెందిన మైదానంలో శకటాల ప్రదర్శన నిర్వహించాలని రాష్ట్రప్రభుత్వం భావించింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు అధికారులు గోల్కొండ కోటకు చేరుకొని అక్కడి ప్రాంతాన్ని పరిశీలించారు.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలపై సీఎం కేసీఆర్ బుధవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ, సిటీ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ ఎంకే మీనా తదితరులతో సమావేశం నిర్వహించారు. సమయం తక్కువగా ఉండటంతో అన్ని ఏర్పాట్లు చేయడం సాధ్యం కాకపోవడంతో కోటలోపలి ప్రాంతంలోనే ఆగస్ట్ 15 వేడుకలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు.