అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈనెల 28 వరకు జరగనున్నాయి. 12, 13, 20, 27 వ తేదీల్లో అసెంబ్లీకి సెలవులు ప్రకటించారు. మొత్తం 17 రోజులపాటు సమావేశాలు కొనసాగనున్నాయి. శాసనసభలో గంట పాటు ప్రశ్నోత్తరాలకు సమయం కేటాయించారు. ఈ సమయంలో 6 ప్రశ్నలకు మాత్రమే అనుమతి ఇచ్చారు. అరగంటపాటు జీరో అవర్ కొనసాగనుంది. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో చర్చించి ఈ నిర్ణయాలను తీసుకున్నారు. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్, ప్రతిపక్ష నేతలు అక్బరుద్ధీన్ ఓవైసీ, మల్లు భట్టి విక్రమార్క, అసెంబ్లీ సెక్రెటరీ నరసింహాచార్యులు, శాసనసభా వ్యవహారాల శాఖామంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయ రంగంలో విజయాలు, నియంత్రిత సాగు లక్ష్యాలు, భారీ వర్షాల వల్ల జరిగిన పంట నష్టం, తీసుకోవాల్సిన చర్యలు, కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్ బిల్లుల విధానంపై చర్చ, కరోనా వ్యాప్తి నివారణ, బాధితులకు అందుతున్న వైద్యం, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల రిజర్వేషన్లు, ఎస్సీ ఉపకులాల వర్గీకరణ, కొత్త రెవెన్యూ చట్టం, పరిపాలన సంస్కరణలు తదితర అంశాలపై ఉభయసభల్లో చర్చించనున్నారు.
ఇదిలాఉండగా బీఏసీ సమావేశంలో సీఎం కేసీఆర్ కు కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్కల మధ్య మాటల యుద్ధం జరిగింది. అసెంబ్లీ ఆవరణలో మీడియా పాయింట్ ఎత్తివేయడాన్ని భట్టి తప్పు పట్టగా సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోవిడ్ వ్యాప్తి దృష్ట్యానే మీడియా పాయింట్ ఎత్తేయాల్సి వచ్చిందని, సభ కంటే మీడియా పాయింట్ ఎక్కువైందా? అని ప్రశ్నించారు. సభ్యుల సంఖ్య ప్రకారం సభలో సమయం ఇస్తామని, దాని ప్రకారం సభ్యులు నడుచుకుని తమ సమస్యలు వినిపించాలని సీఎం సూచించారు. కాంగ్రెస్ నాయకులు అబద్దాలు మాట్లాడుతూ ప్రజలను గందరగోళ పరుస్తున్నారని, ఆ విషయాలను సభలో ప్రస్తావిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.