రెండవరోజు శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభం కాగానే సభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం మొదలైంది. చర్చ ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ, అన్ని సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, సభ్యులు సహకరించి సభ సజావుగా నడిచేలా సహకరించాలని కోరారు. అయితే సభ ప్రారంభం కాగానే ప్రతిపక్షాలు వాయిదా తీర్మానాలపై చర్చకు పట్టుబట్టి ఆందోళనకు దిగాయి.
దీనిపై సీఎం స్పందిస్తూ సభ సజావుగా నడిచేందుకు విపక్షాలు సహకరించాలని, ఆంధ్రా నుండి తెలంగాణకు న్యాయంగా రావలసిన విద్యుత్ వాటా రావడంలేదని మూడు రోజులు కాదు, 30 రోజులైనా చర్చకు సిద్ధమన్నారు. అయినా ప్రతిపక్షాలు తమ ఆందోళనను కొనసాగించడంతో స్పీకర్ మధుసూదనాచారి సభను 10 నిమిషాలు వాయిదా వేశారు.
వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభమైన వెంటనే విద్యుత్ సమస్యపై చర్చించాలని విపక్షాలు ఆందోళనకు దిగాయి. టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం కేసీఆర్ సమాధానం చెప్తున్నారని స్పీకర్ చెప్పినా వినకుండా విపక్షాలు ఆందోళన చేస్తుండటంతో స్పీకర్ మళ్ళీ సభను 10 నిమిషాలపాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.