టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంగారెడ్డి కలెక్టరేట్ లో మెదక్ ఎంపీ స్థానానికి నామినేషన్ వేశారు. నామినేషన్ వేయడానికి ముందు ఆయన కోనాయిపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎంపీ స్థానానికి నామినేషన్ వేసిన తర్వాత అక్కడినుండి బయలుదేరి వెళ్లి మెదక్ జిల్లా గజ్వేల్ అసెంబ్లీ స్థానానికి కూడా నామినేషన్ వేశారు. సిద్దిపేటలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం కేసీఆర్ విలేకరులతో మాట్లాడుతూ, మేనిఫెస్టోలో పొందుపరిచిన అన్ని హామీలను నెరవేరుస్తానని, వేలకోట్లు ఖర్చుపెట్టి తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తానని, రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పారు. ఆంధ్రాశక్తుల పీడ ఇంకా పోలేదని, తెలంగాణలో అడ్డం తిరగాలని సమైక్య శక్తులు కుట్ర పన్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
సిద్దిపేటతో అనుబంధం మరువలేనిదని, తనను ఈ స్థాయికి తెచ్చింది సిద్దిపేట గడ్డ అని కేసీఆర్ గుర్తుచేశారు. కోనాయిపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతానని, సిద్దిపేటకు నూటికి నూరుశాతం తాగునీరు, సాగునీరు అందిస్తామని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్, టీడీపీలకు హామీలను నెరవేర్చే చిత్తశుద్ధి లేదని, బీజేపీ నాయకులు, కార్యకర్తలు వద్దంటున్నా బలవంతంగా చంద్రబాబు పొత్తు పెట్టుకున్నాడని విమర్శించారు. తెలంగాణలో ఆంధ్రా పార్టీలను ఓడించాలని ప్రజలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే తెలంగాణ పునర్నిర్మాణం సాధ్యమని, రాజకీయ అవినీతి అంతమైతేనే తెలంగాణ బాగుపడ్తుందని అన్నారు. వంద శాతం టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, దేశంలో తెలంగాణ నంబర్ వన్ స్టేట్ గా ఎదుగుతుందని, తెలంగాణ తెచ్చిన కీర్తి ముందు ఏ పదవి గొప్పదికాదని కేసీఆర్ పేర్కొన్నారు.