ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు ఉదయం మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరుకు చేరుకొని ఆసరా పథకాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు నేరుగా డబ్బులు అందజేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, పించన్లపై కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని, అర్హతలేని వారికి పించన్లు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఎవరికైనా పించన్లు రాకుంటే వారు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలని, ఈ పథకం కోసం ఏటా రూ. 4 వేలకోట్లు ఖర్చు అవుతుందని, గత ప్రభుత్వాలు విచ్చలవిడిగా పించన్లు ఇచ్చాయని, టీడీపీ ప్రభుత్వం ఏడాదికి రూ. 65 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిందని చెప్పారు.
అర్హులైన పేదవారి రేషన్ కార్డులు ఒక్కటికూడా తీసెయ్యమని, అర్హులైన వారు ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోకపోతే ఎమ్మార్వో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రేషన్ బియ్యం ప్రతివ్యక్తికి ఆరుకిలోలు ఇవ్వాలని నిర్ణయించామని, గతంలో మాదిరిగా కుటుంబానికి ఇన్ని కిలోలు అన్న నిబంధనను తొలగించామని అన్నారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఆరుకిలోల చొప్పున బియ్యం ఇస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. పాలమూరు జిల్లా బాగా వెనుకబడ్డ ప్రాంతమని, ఈ జిల్లా ఎంపీగా ఇక్కడి ప్రజల కష్టాలు తెలుసని, జిల్లా అభివృద్ధిలో భాగంగా 5 వేల కి.మీ రోడ్ల నిర్మాణం చేపట్టబోతున్నామని చెప్పారు. త్వరలో పాలమూరు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.
దొంగమాటలు చెప్పడం నాకు రాదు..చెప్పిందే చేస్తానని సీఎం కేసీఆర్ అన్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణలో కొన్ని కష్టాలు ఉన్నాయి.. రాజకీయ పార్టీలు ప్రజలను గోల్ మాల్ చేస్తున్నాయన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పాం, చేశాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తున్నాం.. ఏపీలో చంద్రబాబు రైతులకు ఒక్క రూపాయి కూడా రుణమాఫీ చేయలేదని, కొంతమంది ప్రభుత్వంపై పనికట్టుకుని బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. త్వరలో ఇంటింటికి నల్లా ద్వారా మంచినీరు అందించకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడగమని, అక్కా చెల్లెళ్ళు బిందెలు పట్టుకుని బయటకు వెళ్లి కష్టపడాల్సిన అవసరం లేకుండా చేస్తామని, అతి త్వరలో వాటర్ గ్రిడ్ పనులు ప్రారంభం అవుతాయని సీఎం పేర్కొన్నారు.