తెలంగాణ రాష్ట్రంలోని బాలింతలు, గర్భిణులు, చిన్న పిల్లలకు సంపూర్ణ పోషకాహారం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా దాదాపు 36 వేల అంగన్ వాడీల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలకు ఒకపూట సంపూర్ణ భోజనం అందనుంది. సోమవారం సాయంత్రం సచివాలయంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఈ పథకంపై ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉండాలని, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం అందించే పౌష్టికాహారాన్ని అందుకోవాలని పిలుపునిచ్చారు.
అంగన్ వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, పిల్లలకు జనవరి 1 నుండి అందిస్తున్నట్లు, ఈ పథకాన్ని రాష్ట్రంలోని 31,897 అంగన్ వాడీ కేంద్రాలు, 4076 మినీ అంగన్ వాడీ కేంద్రాల్లో అమలు చేస్తున్నట్లు సీఎం తెలిపారు. గతంలో గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించే కార్యక్రమం మొక్కుబడిగా సాగింది. ఏడు నెలల నుండి మూడేళ్ళ వయసున్న పిల్లలకు నెలకు 8 కోడిగుడ్లు అందించేవారు. దీనిని నెలకు 16 కోడిగుడ్లకు పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. 3 నుండి 6 సంవత్సరాల వయసున్న పిల్లలకు గతంలో నెలకు 16 గుడ్లు మాత్రమే అందించేవారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రోజుకు 1 కోడిగుడ్డును ఇవ్వాలని నిర్ణయించారు. గుడ్లతో పాటు ప్రతిరోజూ పిల్లలకు అన్నం, పప్పు, కాయగూరలు, స్నాక్స్ అందిస్తున్నారు. రాష్ట్రంలోని గర్భిణీలకు, పాలిచ్చే తల్లులకు ఐసీడీఎస్ ద్వారా అమలుచేస్తున్న ఒక్కపూట సంపూర్ణ మధ్యాహ్న భోజన పథకానికి ఆరోగ్యలక్ష్మి పేరును ఖరారు చేస్తూ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ పూనం మాలకొండయ్య సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.