ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు అర్హులకే అందేలా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని, ప్రజలనుండి వస్తున్న దరఖాస్తులను పరిశీలించి లోపాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం మంజూరు చేయాలనుకుంటున్న ఆహార భద్రతా కార్డులు, పెన్షన్లు, ఇతర సంక్షేమ పథకాలకు దరఖాస్తుల స్వీకరణపై మంత్రి ఈటెల సోమవారం సచివాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ, ప్రజలు దరఖాస్తులను తెల్ల కాగితంపైనే ఇవ్వాలన్న దానిపై అవగాహన పెంపొందించాలని, కొత్తగా ఇచ్చే పెన్షన్లు, ఆహార భద్రతా కార్డు వల్ల అసలైన లబ్ధిదారులకు ఎలాంటి నష్టం జరగదని ప్రజలకు వివరించాలని కలెక్టర్లను కోరారు. ప్రజలు తెల్ల కాగితాలపై ఇచ్చే దరఖాస్తులో వారి పూర్తి వివరాలు, కుటుంబ సభ్యుల పేర్లు, ఇంటి నంబరు, గ్రామం, పట్టణం, జిల్లా పేరు, ఫోన్ నంబర్ నమోదు చేయించాలని అధికారులకు మంత్రి సూచించారు.
వేల సంఖ్యలో ప్రజలనుండి దరఖాస్తులు వస్తున్న నేపథ్యంలో ఈనెల 15 లోపు దరఖాస్తుల స్వీకరణ పూర్తి కాదని కొంతమంది జిల్లా కలెక్టర్లు తెలుపగా, గడువు తేదీని ప్రభుత్వం పెంచే యోచనలో ఉందని, దీనిపై ఈనెల 15వ తేదీన చర్చించి నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ చెప్పారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి వీ నాగిరెడ్డి, పంచాయితీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి మీనా తదితరులు పాల్గొన్నారు.