తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జూన్ 2 న కాకుండా మే 16న ప్రకటించాలని టీఆర్ఎస్ పార్టీ మంగళవారం హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. కోర్టు సూచన మేరకు డిల్లీలోని కేంద్ర హోంమంత్రికి ఈ విషయమై వినతిపత్రం ఇవ్వడానికి టీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు టీఆర్ఎస్ సెక్రెటరీ జనరల్ కే కేశవరావు నేతృత్వంలో వెళ్ళగా ఆయన అందుబాటులో లేకపోవడంతో కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనిల్ గోస్వామికి వినతిపత్రం అందజేశారు. ఏప్రిల్ 28 నాడే అసెంబ్లీ రద్దుచేయడంతో ఈనెల 16న ఎన్నికల ఫలితాలు విడుదలైనా ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి లేదని, జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉండడం వల్ల రాజకీయ అనిశ్చితి ఉంటుందని, ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రమాణ స్వీకారం చేయకుండా ఉంటే ప్రజాస్వామిక హక్కులను హరించినట్లు కూడా అవుతుందని కేశవరావు మీడియాతో అన్నారు.
గతంలో కేంద్రప్రభుత్వం జూన్ 2ను అపాయింటెడ్ డే గా ప్రకటించినప్పుడు ఉన్న పరిస్థితులు వేరని, ఇప్పుడున్న పరిస్థితులు వేరని అందుకే అవతరణ దినోత్సవాన్ని ప్రీ ఫోన్ చేయమని కేంద్రాన్ని కోరామని ఆయన వివరించారు. మరోవైపు రాజకీయ బేరసారాలకు కూడా అవకాశం కల్పించినట్లు అవుతుందని, మే 16న ఫలితాలు వస్తే జూన్ 2వరకూ ప్రమాణస్వీకారం చేయకుండా ఉంటే ఎన్నికైన ప్రజాప్రతినిధులను ఇతర పార్టీలు ప్రలోభపెట్టే అవకాశాలు ఉన్నాయని, ఇది రాజకీయ పార్టీలకు ఆందోళన కలిగించే విషయమని, కేంద్ర హోం శాఖ దృష్టిలో పెట్టుకుని మే 16నే అపాయింటెడ్ డే గా ప్రకటించాలని కోరినట్లు కేశవరావు తెలిపారు.