mt_logo

కేసీఆరే తెలంగాణ తొలి సీఎం కావాలి- టీఆర్ఎస్ నేతలు

ఎన్నో ఏళ్ల తరబడి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కోవాలన్నా, బంగారు తెలంగాణ సాధించుకోవాలన్నా, తెలంగాణ పునర్నిర్మాణం జరగాలన్నా సమర్ధతగల నేత ఇప్పుడు అత్యవసరమని, అందుకు కేసీఆర్ నాయకత్వమే కావాలని, నీతి, నిజాయితీ, ముక్కుసూటితనం ఉన్న కేసీఆర్ లోనే అలాంటి నాయకత్వ లక్షణాలు ఉన్నాయని టీఆర్ఎస్ పార్టీ నేతలంతా అంటున్నారు. గతంలో కేసీఆర్ ఇచ్చిన దళిత సీఎం హామీ పట్ల ప్రత్యర్థి పార్టీలు విమర్శిస్తున్న తరుణంలో టీఆర్ఎస్ పార్టీ దళిత నేతలే గట్టి సమాధానం ఇచ్చారు. దళితులకు ఎప్పుడైనా సీఎం పదవి దక్కుతుందని, తెలంగాణ పునర్నిర్మాణం జరగాలంటే కేసీఆర్ మాత్రమే తొలి సీఎం కావాలని, ప్రజలు కూడా కేసీఆర్ నాయకత్వాన్నే కోరుకుంటున్నారని పోలిట్ బ్యూరో సభ్యుడు కడియం శ్రీహరి అన్నారు.

దళిత సీఎం పై వెనక్కి తగ్గినట్లు కాదని, ప్రజల ఆకాంక్షలు తీరాలన్నా, వారేం కోరుకుంటున్నారో తెలియాలన్నా కేసీఆర్ సీఎం కావాలనే మా పార్టీలోని నేతలందరూ అభిప్రాయపడుతున్నారని మాజీ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. దళితుల జీవితాల్లో మార్పు తీసుకువచ్చే దార్శనికత కేసీఆర్ లో ఉందని, యావత్ తెలంగాణ సమాజం కేసీఆర్ నే సీఎంగా కోరుకుంటుందని, తెలంగాణ ఉద్యమంలో మొదటినుంచి కేసీఆర్ పదవులు వదులుకుని ముందు నిలబడ్డారని, కేంద్రమంత్రి పదవిని, ఎంపీ పదవిని సైతం వదులుకుని తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన ఆయనకు పదవులపై ఆశ లేదని పార్టీ నేతలు చెప్పారు.

ఆంక్షలతో కూడిన తెలంగాణను రక్షించుకోవాలన్నా, పోలవరం డిజైన్ మార్పించి ముంపుకు గురయ్యే ఏడు మండలాలను తెలంగాణలో కొనసాగించాలన్నా, 10 సంవత్సరాల ఉమ్మడి విద్యావిధానం పోవాలన్నా, మానిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలన్నా కేసీఆరే ముఖ్యమంత్రి కావాలని పార్టీ నేత కేఎస్ రత్నం వ్యాఖ్యానించారు. తెలంగాణలో దళితుల జీవితాలు బాగుండాలన్నా, తెలంగాణపై ఉన్న ఆంక్షలు తొలిగిపోవాలన్నా సమర్ధుడైన కేసీఆర్ సీఎం కావాలని మానకొండూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి రసమయి బాలకిషన్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *