mt_logo

విద్యుత్ విషయంలో బరి తెగించిన ఆంధ్రా సర్కార్!!

ఆరు దశాబ్దాలుగా తెలంగాణ బొగ్గుతో ఆంధ్రా ప్రాంతపు అవసరాలు తీర్చుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీపీఏను రద్దు చేయాల్సిందిగా ఈఆర్సీకి లేఖ రాసి తన వికృత వైఖరిని మరోసారి చాటుకుంది. దీనితో చంద్రబాబు వైఖరి మరోసారి బట్టబయలైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటాన్ని జీర్ణించుకోలేని ఆంధ్రా సర్కార్ తెలంగాణకు కరెంటు లేకుండా చేసి కసి తీర్చుకునే దిశగా పావులుకదుపుతుంది. కేంద్రం వద్దన్నా, ఈఆర్సీ పీపీఏ రద్దు చెల్లదని స్పష్టం చేసినా, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లులో పీపీఏ అమలుకు సంబంధించి నిబంధనలు ఉన్నా బేఖాతరు చేస్తూ తెలంగాణకు కరెంటు కేటాయింపు అడ్డుకునేందుకు ముందుకు పోతుంది.

విద్యుత్తు మిగిలితే తెలంగాణకు ఇస్తామంటూ ఆంధ్రా సర్కార్ ప్రగల్భాలు పలుకుతుంది. ఇప్పటికే భారీగా లోటు ఉన్న రాష్ట్రంలో వచ్చే మూడేళ్ళదాకా విద్యుత్ మిగలదని తెలిసికూడా అసత్యం మాట్లాడుతుంది. అంతేకాకుండా రైతులకు రోజుకు 9గంటల విద్యుత్ ఇస్తామని వాగ్దానం చేసిన తరుణంలో తెలంగాణకు కరెంటు ఇస్తే సమస్యలు తప్పవన్న ఉద్దేశంతో ఈ డ్రామాలు ఆడటం బహిరంగ రహస్యం.

ఆంధ్రా సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఏపీ జెన్కో పెండింగ్ లో ఉన్న పీపీఏలను రద్దు చేయాల్సిందిగా ఈఆర్సీకి లేఖ వ్రాసింది. తెలంగాణ విద్యుత్ సంస్థలు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోకుండా మూడు రోజులముందే ఏపీ జెన్కో హైకోర్టులో కేవీయేట్ దాఖలు చేసింది. తెలంగాణకు వచ్చే విద్యుత్ కోటాలో కూడా బుధవారం అర్ధగంటపాటు అంతరాయం కలిగించింది. ఏపీ జెన్కో చర్యలను ఖండిస్తూ కేంద్రం ఫ్యాక్స్ ద్వారా ఆదేశాలు జారీ చేయడంతో తెలంగాణకు యధాతథంగా విద్యుత్ పంపిణీ కొనసాగించారు.

డిస్కంల విద్యుత్ వాటాలను యధాతథంగా కొనసాగించాలని కేంద్రం గురువారమే ఆదేశాలు జారీ చేసింది. పీపీఏల రద్దు సాధ్యంకాదని ఏపీఈఆర్సీ కూడా స్పష్టం చేసినా పట్టించుకోకుండా ఆంధ్రా బాబు (చంద్రబాబు) పవర్ గేమ్ మొదలుపెట్టారు. కేంద్రంలో తమ సర్కారే ఉన్నదనే ధీమా, ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే అహంకారంతో ఆంధ్రా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై అధికార పార్టీ టీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *