mt_logo

నాగార్జునసాగర్ డ్యాంపై ఆంధ్రప్రదేశ్ జులుం!

నాగార్జునసాగర్ కుడికాలువ నీటి విడుదల కోసం ఏపీ సర్కారు మరోసారి అరాచకానికి ఒడిగట్టింది. నీటివిడుదల చేయాలని ఉత్తర్వులు జారీచేయడమే కాకుండా ఎంతకైనా తెగించి వాటిని అమలయ్యేలా చూడాలని అధికారులను, పోలీసు యంత్రాంగాన్ని పంపింది. సాగర్ వద్దకు చేరుకున్న ఏపీ అధికారులు, పోలీసులు హెడ్ రెగ్యులేటరీ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా తెలంగాణ పోలీసులు వారిని అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు రాష్ట్రాల పోలీసులు మధ్య తోపులాట జరిగి పరస్పరం లాఠీఛార్జి చేసుకున్నారు. రెండు రాష్ట్రాలు చర్చలు చేసుకుని సమస్యలు పరిష్కరించుకోవాలని, బలవంతంగా నీటి విడుదలకు ప్రయత్నించడం మంచిది కాదని తెలంగాణ అధికారులు చెప్పినా వినకుండా ఏపీ అధికారులు ఒప్పుకోకుండా రాత్రి పొద్దుపోయే వరకు అక్కడే బైఠాయించి తర్వాత వెళ్ళిపోయారు.

రాష్ట్ర విభజన జరిగిన నాటికి తెలంగాణ ప్రాంతానికి చెందిన నీటిపారుదల శాఖ సూపరింటెండెంట్ ఇంజినీరు దానిని పర్యవేక్షిస్తున్నారు. ఈ కారణంగానే డ్యాం నిర్వహణ బాధ్యత సహజంగానే తెలంగాణకు ఉంటుందని గవర్నర్ నరసింహన్ ఆదేశాల ప్రకారం గెజిట్ లో కూడా ప్రచురించారు. సాగర్ డ్యాం నిర్వహణ మొత్తం తెలంగాణ పర్యవేక్షణలోనే ఉన్నందున ఏపీ తనకు నీళ్ళు కావాలంటే కుడికాల్వ దగ్గరే ఆగాలి కానీ గేట్లు ఎత్తాల్సిన అవసరం లేదని, వారి చర్యలు చూస్తుంటే మొత్తం డ్యాంను స్వాధీనం చేసుకునేలా కనిపిస్తుందని నల్గొండ ఇంజినీర్లు చెప్పారు. ఇదంతా చూస్తుంటే రాజకీయ దురుద్దేశంతోనే వారు ఆ చర్యకు పాల్పడినట్లు తెలుస్తుందని, ఏపీ అవసరాలకు నీరు కావాలనుకుంటే పులిచింతల ప్రాజెక్టులో సమృద్ధిగా నీరు ఉందని, ఉన్న నీటిని వాడుకోకుండా సాగర్ పై అజమాయిషీ చెలాయించడానికే ఏపీ సర్కారు ప్రయత్నిస్తున్నదని వారు పేర్కొంటున్నారు.

ఇదిలాఉండగా సాగర్ నీటివిడుదల విషయమై చర్చించడానికి ఇరు రాష్ట్రాల సీఎం లు శనివారం గవర్నర్ నరసింహన్ తో భేటీ కానున్నారు. సాగర్ వద్ద నెలకొన్న ఉద్రిక్త పరిస్థితి అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఫోన్ చేసి నీటి విడుదల చేయాలని కోరారు. దీనిపై స్పందించిన కేసీఆర్ సాగర్ లో నీటి నిల్వలు బాగా తక్కువగా ఉన్నాయని, తొందరపడటం మంచిదికాదని అన్నట్లు తెలిసింది. అంతేకాకుండా సాగర్ వద్ద ఉద్రిక్త పరిస్థితి ఉండటం మంచిదికాదని, నీటి విడుదలపై గవర్నర్ సమక్షంలో కూర్చొని మాట్లాడదామని చంద్రబాబుకు సూచించారు. సీఎం కేసీఆర్ గవర్నర్ నరసింహన్ తో కూడా ఫోన్ లో మాట్లాడి పరిస్థితులన్నీ వివరించి రాజ్ భవన్ లో చర్చించుకుందామని ప్రతిపాదనను తీసుకురాగా దానికి గవర్నర్ అంగీకరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *