శుక్రవారం లేక్‌వ్యూ అతిథి గృహంలో రాష్ట్ర విభజన అంశాలగురించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి తో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మూడు గంటలపాటు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో పలువురు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. 21 కమిటీలు రూపొందించిన 45 పేజీల నివేదికను ఈ సందర్భంగా అధికారులు కేసీఆర్ కు సమర్పించారు. మహంతి రాష్ట్ర విభజనకు సంబంధించి అనేక అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండే పదేళ్ళ కాలంలో అయ్యే ఖర్చును రెండు రాష్ట్రాలూ భరించాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయ్యే ఏ ఖర్చూ తెలంగాణ ప్రభుత్వం చెల్లించదని, ఒకే చోట రెండు రాష్ట్రాల కార్యాలయాలకు ఒప్పుకునేది లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ సీఎం కు కూడా సచివాలయంలో కాకుండా వేరేచోట కార్యాలయం చూడాలని, రెండు రాష్ట్రాల మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల నివాసాలు కూడా ఒకే చోట ఉండొద్దని, దీనివల్ల సమస్యలు వస్తాయని సూచించారు.
తెలంగాణలో నిబంధనలకు విరుద్ధంగా సర్వీస్, ఫ్యామిలీ పెన్షన్లు పొందుతున్నవారు 80,000మంది ఉన్నారని, వారందరి భారం తెలంగాణ ఖజానాపై పడుతుందని, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. నిబంధనల ప్రకారం మూసేసిన ఫైళ్ళను తిరిగి సమీక్షించేందుకు తనకు అందుబాటులో ఉంచాలని కేసీఆర్ చెప్పారు. నీటిపారుదల, పన్ను రాయితీల అంశం, విద్యుత్, ఉద్యోగుల వివరాలు తదితర అంశాల గురించి కేసీఆర్ అధికారులను ఆరా తీయగా వారు కొన్ని వివరాలు ఇవ్వలేకపోయారు. జూన్ 2 లేదా, మొదటివారంలో పూర్తి సమాచారాన్ని తనకు అందించాలని కేసీఆర్ కోరారు.
అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి, ఇతర అధికారులతో కలిసి కేసీఆర్ గవర్నర్ నరసింహన్ ను కలిశారు. రాష్ట్ర విభజన సందర్భంగా అధికారులు రూపొందించిన నివేదికలో చాలా లోటుపాట్లు ఉన్నాయని, వాటిని సవరించకపోతే భవిష్యత్తులో రెండు రాష్ట్రాలమధ్య సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉందని గవర్నర్ కు తెలిపారు. అదేవిధంగా రెండు రాష్ట్రాల ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట ఉంటే రెండు ప్రాంతాల ఉద్యోగుల మధ్య ఆహ్లాదపూరిత వాతావరణం ఉండదని, సచివాలయంలో ఒకే ప్రాంగణంలో ఇద్దరు ముఖ్యమంత్రులు కొనసాగడం సమంజసం కాదని కేసీఆర్ సూచించినట్లు సమాచారం.