హైకోర్టు విభజన రాజకీయంగా ముడిపడి ఉందని, హైకోర్టు విభజన జరగకుండా ఏపీ సీఎం చంద్రబాబు అడ్డుపడుతున్నారని నిజామాబాద్ ఎంపీ కవిత లోక్ సభలో అన్నారు. తమ పాలనకు చంద్రబాబు ఎప్పుడూ అడ్డమే అని చెప్పారు. హైకోర్టు విభజనకు కేంద్రం సహకరించడం లేదని, కేంద్రం తక్షణమే జోక్యం చేసుకుని తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని ఎంపీ కవిత డిమాండ్ చేశారు.
అంతకుముందు తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేసిన నేపథ్యంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ లోక్ సభలో హైకోర్టు ఏర్పాటుపై ప్రకటన చేశారు. ప్రస్తుతం ఉన్న హైకోర్టు తెలంగాణకే చెందుతుందని, పునర్విభజన చట్టం ప్రకారం ఏపీలో హైకోర్టు నెలకొల్పడానికి ఆ ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించాలని అన్నారు. హైకోర్టు ఏ స్థలంలో ఏర్పాటు చేసుకోవాలో ఏపీ సర్కారే నిర్ణయించుకోవాలని సూచించారు. అయితే దీనిపై ఎంపీ జితేందర్ రెడ్డి మాట్లాడుతూ న్యాయశాఖ మంత్రి ప్రకటనలో కొత్తదనమేమీ లేదని, గతంలో చెప్పిన విషయాలను మరోసారి చెప్పారని, హైకోర్టును ఏర్పాటు చేయాలనుకుంటే రాత్రికిరాత్రే ఏర్పాటు చేయొచ్చని, ఎందుకు జాప్యం జరుగుతుందని ప్రశ్నించారు.