తెలంగాణపై కాంగ్రెస్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హస్తినలో నిరాహారదీక్షకు దిగిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు చేదు అనుభవం ఎదురైంది. దీక్ష చేసేందుకు అనుమతి లేదని, వెంటనే ఏపీభవన్ ను ఖాళీ చేయాలంటూ రెసిడెంట్ కమిషనర్ నోటీసు ఇచ్చారు. విలేకరుల సమావేశం ఏర్పాటు చేసుకునేందుకు మాత్రమే అనుమతి ఇచ్చామని, నిరాహార దీక్ష చేసుకునేందుకు మాత్రం కాదంటూ నోటీస్ లో పేర్కొన్నట్లు టీడీపీ అధికార ప్రతినిధి కోడెల శివప్రసాద్ రావు చెప్పారు. ఐతే ఢిల్లీలో ఎన్నికల కోడ్ అమలులో వున్నందున దీక్షకు అనుమతి లేదని ఏపీ భవన్ అధికారులు మీడియాకు వివరించారు.
మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనైతికంగా, అధర్మంగా జరిగిందని చంద్రబాబు మరోసారి ఆరోపించారు. ‘తెలుగు జాతిని కాపాడండి ‘ అంటూ ఏపీ భవన్ లో చంద్రబాబు చేపట్టిన దీక్ష మంగళవారం రెండో రోజుకు చేరింది.
సాయంత్రం విలేఖరుల సమావేశం నిర్వహించాలని మొదట అనుకున్నారు. ఈ మేరకు మీడియాకు సమాచారం కూడా ఇచ్చారు. కానీ తర్వాత నిర్ణయాన్ని మార్చుకుని దాన్ని బహిరంగ సభగా మార్చారు. ఈ సభలో, రాష్ట్ర విభజన ద్వారా తెలుగు జాతికి అన్యాయం జరిగిందని అన్నారు. ఇరు ప్రాంతాల జేఏసీలను పిలిపించి మాట్లాడాలని కోరారు. సమస్యను పరిష్కరించకుండా టీడీపీపై ఎదురుదాడికి దిగుతున్నారని దిగ్విజయ్ సింగ్ పై మండిపడ్డారు. లేఖలు బయటపెట్టి బురద చల్లుతున్నారని విమర్శించారు. తన ప్రాణంపోయినా సరే తెలుగు ప్రజలు న్యాయం జరిగేవరకు పోరాడుతానని ప్రతిజ్ఞ చేసారు.
రెండు రోజులుగా దీక్షకు కూర్చున్న చంద్రబాబుకు ఏపీ భవన్ అధికారులు సకల మర్యాదలు చేస్తున్నారు. షామియానాలు, ఏసీలు, ఫ్యాన్లు నడిచేందుకు విద్యుత్ సౌకర్యాన్ని ఏపీ భవన్ నుంచే అందజేసారు. ముందు జాగ్రత్తగా జనరేటర్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తల వాహనాలతో ఏపీ భవన్ కిక్కిరిసిపోయింది. దాంతో రోజువారీ కార్యకలాపాల నిమిత్తం భవన్ చేరుకునే రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడ్డారు.
‘సైకిల్ గుర్తుకే ఓటెయ్యండీ.. ‘ కదలిరండి తెలుగుదేశ కార్యకర్తలారా..’ అనే పాటలను పదే పదే వినిపించడంతో దీక్షా వేదిక టీడీపీ ప్రచార వేదికను తలపించింది.