ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై సీమాంధ్ర పాలకులే కాకుండా అక్కడి రచయితలు, పుస్తకాల ముద్రణ కంపెనీలు సైతం తమ అక్కసును వెళ్లగక్కుతున్నాయి. ఆరో తరగతి సాంఘికశాస్త్రం వీజీఎస్ గైడ్ 173వ పేజీలో “మైనార్టీ అభిప్రాయానికి విలువలు ఇస్తూ నిర్ణయాలు తీసుకోవడం సాధ్యమా? కొన్ని ఉదాహరణలతో వివరించండి” అంటూ ఓ ప్రశ్నను వేయడంతోపాటు సమాధానాన్ని కూడా గైడ్‌లో పొందుపర్చారు. ముద్రణ కంపెనీ వీజీఎస్ యాజమాన్యం తెలంగాణను కించపరిచే విధంగా ఆ ప్రశ్నకు సమాధానం పేర్కొంది. మైనార్టీల అభిప్రాయానికి విలువలను ఇస్తూ నిర్ణయాలు తీసుకోవడం చట్టపరంగా సాధ్యం కాదని సమాధానమిచ్చారు.
అందుకు ఉదాహరణగా తెలంగాణ అంశాన్ని ప్రస్తావించారు. కాగా, తెలంగాణను కించపరుస్తూ సమాధానాలు ఇచ్చిన వీజీఎస్ గైడ్‌లను తెలంగాణవాదులందరూ బహిష్కరించాలని తెలంగాణ పీఆర్‌టీయూ జిల్లా నాయకులు చెన్నప్ప ఒక ప్రకటనలో కోరారు. చిన్న వయస్సులోనే విద్యార్థుల మనస్సుల్లో ఇలాంటి భావాలను చొప్పించే గ్రంథాలను తెలంగాణవాదులందరూ బహిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.
[నమస్తే తెలంగాణ సౌజన్యంతో]