అడవిదేవులపల్లి.. దామరచర్ల మండలంలోని మారుమూల గ్రామం. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు పరిధిలో ఉన్నా.. ఈ గ్రామంలోని సగం భూములకు కూడా సాగు నీరు అందదు. ముదిమాణిక్యం మేజర్ కాల్వ చివరి ప్రాంతమైన ఇక్కడికి అప్పుడప్పుడు మాత్రమే సాగర జలాలు చేరుతుంటాయి. సుమారు 1500నివాసాలతో 6, 7వేల జనాభాను కలిగి ఉన్న అడవిదేవులపల్లికి వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. సాగునీరందే కొద్ది భూముల్లో వరి పండిస్తుంటే.. మిగతా ప్రాంతమంతా వాణిజ్య పంటలయిన మిర్చి, పత్తి విరివిగా పండిస్తారు ఇక్కడి అన్నదాతలు. నాపరాతి బండల పరిశ్రమలు, వాటిని పాలిషింగ్ చేసే ఇండస్ట్రీలూ కొన్ని అక్కడక్కడా ఉన్నాయి. వాటిల్లో సైతం కొంత ఉపాధి లభిస్తున్నా.. ఎక్కువ మందికి వ్యవసాయం, కూలీ పనులే బతుకుదెరువును కల్పిస్తున్నాయి.
కృష్ణానదికి కాసింత దూరంలోనే ఉన్న ఈ పచ్చని పల్లె.. ఒకప్పుడు నాటు బాంబుల మోతలకు కేరాఫ్ అడ్రస్‌గా వెలుగొందింది. గతంలో ఫ్యాక్షన్ గొడవల కారణంగా హత్యలు చేసుకున్న చరిత్ర కూడా ఇక్కడి జ్ఞాపకాల్లో నిక్షిప్తమై ఉంది. నదికి అవతలి వైపున పల్నాడు ప్రాంతం ఉండడమే ఫ్యాక్షన్ ఆనవాళ్లు ఇక్కడికి చేరుకోవడానికి ప్రధాన కారణం. నాటు పడవలు, పుట్టిల ద్వారా సాగించిన నదీ ప్రయాణమే నాటు బాంబులను సైతం ఇక్కడి ఊళ్లకు తీసుకొచ్చేది. కాలక్రమంలో ఆ జాడలు అదృశ్యమై అడవిదేవులపల్లి ఊరు ఊరంతా ఇప్పుడిప్పుడే అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. ఊరికి సమీపంలోని కృష్ణా నది చెంత శివ-చెన్నకేశవ సహిత బౌద్ధమ ఆలయాలు, సూర్య దేవాలయం, అవతలి ఒడ్డున గుంటూరు జిల్లా వైపు సత్రశాల, వీటికి రెండు కిలోమీటర్ల ఎగువన ఉన్న నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్.. ఈ ప్రాంతపు ప్రత్యేకతలు.
దారంతా అందాల నిలయమే..
మిర్యాలగూడ నుంచి వెంకటాద్రిపాలెం, బొర్రాయిపాలెం, అప్పలమ్మగూడెం, రాగడప గ్రామాల మీదుగా 30కిలోమీటర్లు ప్రయాణించినా.. దామరచర్ల మండలకేంద్రం నుంచి తాళ్ల వీరప్పగూడెం, వీర్లపాలెం మీదుగా 20కిలోమీటర్లు జర్నీ చేసినా అనేకానేక ప్రత్యేకతలు కలిగిన ఈ గ్రామం సమీపిస్తుంది. బొర్రాయిపాలెం, రాగడప మీదుగా అడవిదేవులపల్లికి వెళ్తుంటే కనిపించే పచ్చని పొలాలు, పక్కనే పరుచుకున్న ఎత్తైన నల్లమల కొండలు.. సరికొత్త అనుభూతిని సొంతం చేస్తాయి. కొన్ని చోట్ల కోనసీమలో తిరుగుతున్నట్లుగా మనస్సుకు ప్రశాంతత సైతం చేకూరుతుంది. రాగడప దాటిన తర్వాత ఎత్తయిన గుట్టను దాటుకుని మరీ అందాలదేవుళ్లపల్లికి వెళ్లాల్సి ఉంటుంది. ఆ కొండను ఎక్కగానే వెనుదిరిగి చూస్తే కనిపించే పంట పొలాల అందం అహో..! అనిపిస్తుంది. ముందుకు కదలకుండా కాళ్లను కాసేపు కట్టి పడేస్తుంది. చేతిలో ఉన్న సెల్‌ఫోన్‌తో ఫోటోలు తీయకుండా మనసును ఆగబట్టుకోవడం అక్కడి దృశ్యాన్ని చూస్తుంటే అస్సలు వీలుకాదు. తుంగపహాడ్ బంధం నీళ్లు వెడల్పుగా పరుచుకుని పచ్చని పొలాల గుండా సాగే ఆ సుందర సన్నివేశం అల్లంత ఎత్తు నుంచి చూస్తుంటే అన్నీ మరిచిపోతామేమో అనిపిస్తుంది. అక్కడి నుంచి మరో 5కిలోమీటర్ల ప్రయాణం తర్వాత నదీ తీరానికి కాస్త దూరంలో ఉన్న దేవులపల్లి వస్తుంది.
ఊరు ఊరంతా ప్రత్యేక కోణమే..
అడవిదేవులపల్లి ఊర్లోకి ప్రవేశిస్తుంటేనే ఆశ్చర్యం కలుగుతుంది. రాతి గోడలు, ఇటుక గోడలతో కట్టుకునే ఇళ్లు కామన్‌గా చూసే వాళ్లకు.. ఇక్కడ కొలువైన నాపబండల గోడలు ఆశ్చర్యాన్నే కలిగిస్తాయి మరి. పాలిష్ పరిశ్రమకు, నాపరాళ్లకు పేరెన్నికగన్న ఈ ప్రాంతంలో పలు రకాల సైజుల బండలు ఇబ్బడి ముబ్బడిగా దొరుకుతాయి. అందుకే అలాంటి వాటిని వృథాగా పడేయకుండా.. వాటితోనే గోడలు నిర్మించుకుని, పైన కప్పు ఏర్పాటు చేసుకున్న గృహాలు ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉంటాయి. రేకులు, గుడిసెలు మాత్రమే కాదు ఇలాంటి గోడలపైనే స్లాబులు వేసుకున్న ఇళ్లు కూడా ఉండడం పెద్ద విశేషమే. ఇటుక గోడల కంటే ఈ నాప గోడలే అత్యంత బలంగా ఉంటాయి కూడా. ఇళ్ల సంగతి పక్కన పెట్టి ముందుకు సాగితే.. ఊరి సెంటర్ సైతం ప్రత్యేకంగానే కనిపిస్తుంది. సాధారణంగా జిల్లా నలుమూలల్లో ఎక్కడా కనిపించని ప్రత్యేకమైన భిన్న వాతావరణం ఇక్కడ నెలకొని ఉంటుంది. అంతటా ఏనాడో కనుమరుగైన గోలీ సోడా బండ్లు ఇక్కడ పుష్కలంగా ఉంటాయి. తెల్లటి అడ్డ పంచెల కట్టుకుని తమ తమ పనుల్లో నిమగ్నమైన గ్రామస్తులు సందు సందుల్లో కనిపిస్తుంటారు. మాట తీరు, యాస తీరు సైతం పల్నాటి ప్రాంతాన్నే గుర్తుకు తెస్తుంది. ఇళ్ల నిర్మాణాలు, వస్త్ర ధారణే కాదు.. సంప్రదాయాలు సైతం కాస్త భిన్నంగానే ఉంటాయి. ఊరి సందులను పలకరిస్తూ 3కిలోమీటర్ల దూరాన ఉన్న కృష్ణమ్మ చెంతకు వెళ్తుంటే కూడా.. రోడ్డు పక్కన పరుచుకున్న నాపరాళ్లు దృష్టిని అటువైపే ఆకర్షిస్తాయి.
ఒకనాటి జంట గ్రామాలు నేడు ఒంటరిగా..
అడవిదేవులపల్లికి కాస్త దూరంలో కృష్ణానదీ తీరాన బౌద్ధ ఆలయాలు కొలువై ఉన్నాయి. ఒకప్పుడు ఈ ప్రాంతంలో బౌద్ధంపాడు అనే గ్రామం ఉండేదని చారిత్రక ఆనవాళ్లు చెప్తున్నాయి. ఆ కథనాల ప్రకారం నాడు బౌద్ధంపాడు-అడవిదేవులపల్లి పక్క పక్కనే ఉండి జంట గ్రామాలుగా వెలుగొందేవి. అయితే కాల క్రమంలో అడవిలో ఉన్న దేవులపల్లి కొంచెం ముందుకు జరిగింది. బౌద్ధంపాడు పూర్తిగా కాలగర్భంలో కలిసిపోయింది. బుద్ధుడి శిష్యుడైన ఆచార్య నాగార్జునుడు ఈ ప్రాంతంలో సంచరించినట్లు.. ఆనాడు ఇక్కడ బౌద్ధ భిక్షువులు నివసించినట్లు పలు కథనాలున్నాయి. ప్రస్తుతం బౌద్ధమ గుళ్లుగా పిలుచుకునే శివ-చెన్నకేశవాలయం మాత్రమే ఇక్కడ మిగిలి ఉంది. ఒకే ఆలయ ప్రాంగణంలో శివుడు, వైష్ణవ ఆరాధకుడైన చెన్నకేశవుడూ ఉండడం ఇక్కడ మరో ప్రత్యేకత. శివుడు, చెన్నకేశవుడు, పార్వతి, సూర్యుడు, హనుమంతుడు కొలువైన ఈ ప్రాంగణాన్ని శివపంచాయతనంగా పిలుస్తుంటారు. క్రీస్తు శకం 1135 నుంచి 1237 వరకు ఈ ప్రాంతాన్ని చాళుక్య త్రిభువన మల్లికార్జునుడి కాలంలో ఈ ఆలయాల నిర్మాణం జరిగిందని ఇక్కడున్న శాసనం చెప్తోంది. ఇంకా ఇక్కడికి చెందిన అనేక శాసనాలు సైతం హైదరాబాద్, మైసూర్‌లోని పురావస్తు శాఖల పరిధిలో ఉన్నట్లు తెలుస్తోంది.
సూర్య దేవాలయమూ ప్రత్యేకతే..
బౌద్ధమ గుళ్ల ప్రాంగణంలో ఇక్కడ ప్రత్యేకంగా సూర్య దేవాలయం సైతం ఉంది. తెలంగాణ రాష్ట్రంలోనే ఏకైక సూర్య దేవాలయంగా దీన్ని చెప్పుకుంటారు. శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలో సూర్యుడికి గుడి ఉన్నా రాష్ట్ర విభజన తర్వాత మన రాష్ట్రంలో ఈ ఆలయం మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. సూర్య దేవాలయానికి సైతం భక్తులు ప్రత్యేకంగా హాజరవుతుండడం విశేషం. బౌద్ధమ ఆలయాలకు కూడా కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి భక్తులు విచ్చేస్తుంటారు. ఇదే కృష్ణా నదీ తీరంలో కాకాసురుడు అనే రాక్షసుడిని సంహరించినట్లుగా.. అందుకే ఈ ప్రాంతంలో కాకులు సంచరించవనే పురాణ కథనం కూడా ఇక్కడ ప్రాచుర్యంలో ఉంది.
అవతలివైపు ఆధ్యాత్మిక నిలయం సత్రశాల…
త్రేతాయుగంలో ఇక్కడ విశ్వామిత్రుడు సత్రయాగం చేసినట్లుగా చెప్పుకునే ప్రాంతం సత్రశాల. బౌద్ధంపాడు వద్ద కృష్ణా నది అవతలి ఒడ్డున ఉన్న ఈ క్షేత్రం గుంటూరు జిల్లా పరిధిలోకి వస్తుంది. ఇక్కడ కూడా శివ-చెన్నకేశవుల ఆలయాలకు తోడు వేంకటేశ్వరుడు, రాముడి ఆలయాలూ ఉన్నాయి. మన వైపున్న బౌద్ధమ ఆలయాల కంటే సత్రశాల దేవస్థానం ఇంకా పురాతనమైనదని చరిత్ర చెప్తోంది. మన వైపు అంతగా అభివృద్ధి ఛాయలు కానరాకున్నా.. సత్రశాల పలు సత్రాలతో, నిత్యం భక్తులతో విరాజిల్లుతోంది. సమైక్య పాలనలో పుష్కరాల సమయంలో అధిక నిధులు కేటాయించుకోవడమే అక్కడ అభివృద్ధికి అసలు కారణమని సమాచారం. బౌద్ధమగుళ్లలోని శివాలయానికి సాగు భూములున్నా వచ్చే ఆదాయం మాత్రం గుడిదరికి చేరడం లేదు.
బౌద్ధంపాడు ఎగువన టెయిల్‌పాండ్..
నాగార్జునసాగర్ జలాశయం దిగువన సరిగ్గా 20కిలోమీటర్ల వద్ద నిర్మించుకున్న ప్రాజెక్టు ఈ సాగర్ టెయిల్‌పాండ్. కృష్ణానదిపై రెండు జిల్లాల సరిహద్దుల్లో నిర్మించిన ఈ ప్రాజెక్టు సాయంతో నీటిని రివర్సబుల్ టర్బైన్ల ద్వారా సాగర్‌కు పంపించాలనే ఆలోచన ఉన్నా ఇంకా అమలుకు నోచుకోలేదు. ఇప్పుడిప్పుడే నిర్మాణం పూర్తి చేసుకుంటున్న ఈ నిర్మాణం అందాలు సైతం అడవిదేవులపల్లి పర్యాటకులకు ప్రత్యేకమైనవే. ఇక్కడ నీటి నిల్వ, ఆ పైన కనిపించే కృష్ణమ్మ హొయలు.. చూస్తుంటే మనస్సుకు హాయి కలుగుతుంది.
నమస్తే తెలంగాణ సౌజన్యంతో..