By: Tankasala Ashok
ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తెలంగాణ ప్రజలలో ఒక ఆసక్తికరమైన స్థితి కనిపిస్తున్నది. సాధారణంగానైతే యాభయ్యేళ్లకుపైగా మూడు తరాలవారు ఉద్యమించి ఒక లక్ష్యాన్ని సాధించినపుడు ఎంతో ఘనమైన ఉత్సవాలు జరగాలి. యావత్ప్రాంతం జయజయ ధ్వానాలతో, ఆటా పాటలతో హోరెత్తాలి. కాని అటువంటి వాతావరణం మంద్రస్థాయిలో ఉండటమే గాక, పలువురి నోటినుంచి “తెలంగాణ వచ్చినట్టే లేదు” అనే మాట వినిపిస్తున్నది! నలుగురు కలిసినపుడు వారిమాటలోనే గాక, సమావేశాలు, చర్చాగోష్టులతో కూడా. అందుకు కారణమేమిటి? ప్రత్యేక రాష్ట్రమన్నది “సంపూర్ణంగా” కాకుండా “పాక్షికంగా” ఏర్పడుతున్నదని, బిల్లులో అనేక “ఆంక్షల” వంటివి విధించారని, పదేళ్లపాటు అవశేష ఆంధ్రప్రదేశ్‌కు ఇక్కడ అనేక ఇబ్బందులు ఉండబోతున్నాయని, పోలవరం కారణంగా లక్షలాది మంది గిరిజనులు నిర్వాసితులు కావటమేగాక వందలాది గ్రామాలను తెలంగాణ కోల్పోతున్నదని, అటువంటి స్థితిలో నిజమైన సంతోషం ఎట్లా సాధ్యమని వారు ప్రశ్నిస్తున్నారు. జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి ఈ విధమైన రాష్ట్రాన్ని “వికలాంగ శిశు’వని అభివర్ణించారు.
ఇదంతా సహేతుకమైన తర్కమని అంగీకరిస్తూనే మరొక ముఖ్యమైన విషయాన్ని కూడా గుర్తించవలసి ఉంది. ఆ విషయాన్ని ఎవరూ గుర్తిస్తున్నట్లు లేరు. అదేమిటో చూద్దాం.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత భవిష్యత్ తెలంగాణ ఎట్లా ఉండబోతున్నదనే చర్చ ఈ ప్రాంతంలో చాలా కాలంగా సాగుతున్నది.
కేవలం భౌగోళిక ప్రత్యేకత వల్ల ఒనగూరేది ఎక్కువ ఉండదని, కొత్తరాష్ట్రం పేదలకు, బడుగు వర్గాలకు ఉపయోగకరం కావాలని, వారికి అధికారంలో ఇతోధిక అవకాశాలు కల్పించాలి, వారు కోల్పోయిన భూమి వంటి వివిధ వనరులపై వారికి తిరిగి హక్కులు ఇవ్వాలని, పౌర హక్కులను పరిరక్షించాలని, ఆధిపత్య వర్గాల ప్రాబల్యం – దోపిడీ పోవాలని, సర్వతోముఖాభివృద్ధి జరడటమేగాక ఆ ఫలితాలు అందరికి లభించాలన్న ఆలోచనలు, ఆకాంక్ష విస్తృతంగా ఉన్నాయి. తెలంగాణ “పునర్నిర్మాణం”, “సామాజిక తెలంగాణ” అన్న మాటలు ఈ ఆలోచనల నుంచి పుట్టుకొచ్చినవే.
అయితే, ఈ తరహా హామీలను అన్ని పార్టీల నాయకులు ఎంతగా ఇస్తున్నప్పటికీ, అట్లా నిజంగా జరుగుతుందా అనే ఒక పెద్దప్రశ్న, బలమైన సందేహం తెలంగాణ ప్రజలను, ఆలోచనాపరులను, వివిధ ప్రజాసంస్థలను వేధిస్తున్నాయి. అందుకు మూలం రాజకీయ నాయకుల పట్ల సాధారణ ప్రజలకు విశ్వాసం లేకపోవటం, ఈ ప్రశ్నలు, సందేహాలు అవిశ్వాసాల కారణంగానే ఈ వర్గాలకు భవిష్యత్ తెలంగాణ ఒక అస్పష్ట చిత్రంగా కనిపిస్తున్నది. కష్టించి పంటతీసిన రైతులకు ఆ ధాన్యపు రాశి తన ఇంటికి చేరగలదనే నమ్మకం ఉన్నప్పుడు కలిగే ఆనందానికి, అందులో మూడువంతులు రకరకాల ఆసాములకు పోయి తనకు మిగిలేది గిద్దెడు గింజలే అనిపించినపుడు ఏర్పడే చింతకు ఉండే తేడావంటిదే ఇది కూడా. అందువల్లనే కేవలం భౌగోళిక తెలంగాణ అవతరణ అన్నది. “తెలంగాణ వచ్చినట్లే లేదు” అనే మాటకు కారణమవుతున్నది. వస్తున్న రాష్ట్రం తాము కోరుకున్న రాష్ట్రం కాగలదనే విశ్వాసం ఏర్పడివుంటే ఈ ప్రాంతం యావత్తూ ఉత్సవాలలో దద్దరిల్లి ఉండేది.
ఇక్కడ గమనించవలసిన విశేషాలు కొన్నున్నాయి. వాటిని చూసినపుడు సంతోషం కలుగుతుంది. ఇటీవలి చరిత్రలో దేశంలో మూడు కొత్త రాష్ట్రాలు.. ఛత్తీస్‌ఘడ్, ఉత్తరాఖండ్ ఏర్పడ్డాయి. అవి ఏర్పడినపుడు అక్కడి ప్రజలు పూర్తి స్థాయిలో సంబరాలు చేసుకున్నారు. ప్రస్తుతం ఇక్కడ తెలంగాణలో లేని సంతోషానందాలు అక్కడ కన్పించాయి. అందుకు కారణం అక్కడ అంతకు ముందటి ఉద్యమాల సమయంలో, తమ కొత్త రాష్ట్రాల భవిష్యత్ నిర్మాణాలు ఏవిధంగా ఉండాలన్న ప్రశ్నలు తెలంగాణ అంత బలంగా చర్చకురాలేదు. తెలంగాణలో సాధారణ ప్రజలు సరేసరికాగా, అక్షరాల వందలాది వివిధ సంస్థలు, వేలాది మంది ఆలోచనాపరులు ఈ చర్చలో పాల్గొంటూ వచ్చారు. అందువల్లనే కేవలం పునర్నిర్మాణమని గాక, కేవలం భౌగోళిక తెలంగాణ అని గాక, సామాజిక తెలంగాణ అనే నినాదం ముందుకొచ్చింది. ఇపుడీ రెండు మాటలూ ఏ పార్టీ వారు కూడా విస్మరించలేనివిగా మారాయి. వాటిని ప్రాతిపదిక చేసుకునే అందరూ హామీలు ఇవ్వవలసిన పరిస్థితి ఏర్పడింది.
ఇటువంటి స్థితి పైన పేర్కొన్న మూడు రాష్ట్రాల సందర్భంలో జరగలేదు. కనుకనే, వారు రాష్ట్రావతరణలతో సంతృప్తి చెందారు. ఉద్యమ సంస్థలకు భవిష్యత్తుపై కొన్ని ఆలోచనలు, అజెండాలు ఉండినా వాటితో వారు బలంగా నిలవక పోవటంతో, రాష్ట్రాలు ఏర్పడిన తరువాత రంగం నుంచి ఉపసంహరించుకున్నారు. తమ తమ ప్రయోజనాలు చూసుకున్నారు. దానితో, యథావిధిగా స్వార్థ పరశక్తులు అన్నింటినీ చేజిక్కించుకుని ప్రజలకు దు:ఖాన్ని మిగిల్చాయి.
అక్కడి వలే ఇక్కడ పండగలు జరకపోయినా, అక్కడ లేని విధంగా ఇక్కడ ప్రజలు, సంస్థలు, ఆలోచనాపరులు తమ ప్రశ్నల జండాలను ఎగరవేసి పట్టుకోవటమన్నది సంతృప్తిని కలిగించే విశేషం. అందువల్ల, పండగలు జరగకపోవటం, ‘‘తెలంగాణ వచ్చినట్టే లేదు’’ అన్న భావన సంతోషించవలసిన పరిస్థితే తప్ప అందులో విచారించవలసిందేమి లేదు. తెలంగాణ ప్రజల చైతన్యానికి, పరిణతికి, వారి సమాజం లాజికలైజ్ కావటానికి అది నిదర్శనం. అటువంటి లక్షణాలు చేకూరిన వారే భవిష్యత్తును సరైన విధంగా నిర్మించుకోగలరు.
తెలంగాణలో ఈ విధమైన చైతన్యానికి, పరిణతికి వెనుక సుదీర్ఘమైన పోరాటాలు చరిత్ర, దాని వారసత్వం ఉన్నాయి. కాకతీయుల కాలపు సమ్మక్క-సారలక్కల నుంచి, తదనంతర కాలపు సర్వాయి పాపన్న, కొమురం భీం, రైతాంగ సాయుధ పోరాటం, నక్సలైట్ ఉద్యమం, ప్రత్యేక రాష్ట్ర ఆందోళనల వరకు, అణగారిన ప్రజల అణచివేతకు వ్యతిరేకంగా ప్రతిఘటించని తరం ఈ ప్రాంతంలో ఒక్కటి కూడా లేదంటే అతిశయోక్తి కాదు. అందుకే ఈ రోజున వారు కేవలం సంబరాలతో మైమరచి పోకుండా, తెలంగాణ రాష్ట్రపు భవిష్య నిర్మాణం గురించి ఆలోచనలు చేస్తున్నారు. కనుక, తెలంగాణ ప్రజల ఉత్సాహం పరిమితం కావటంలో కన్పించేది చైతన్యం, జాగరూకత, ముందు చూపు మాత్రమే.
ఈ భావనలను, అంశాలను వారు పట్టుదలతో, జాగ్రత్తగా మలచుకోగలిగినట్లయితే తెలంగాణ భవిష్యత్తు గొప్పగా రూపొందుట ఒక్కటే కాదు. ఈ రాష్ట్రం అందరికీ ఆదర్శప్రాయం కాగలదు. భవిష్యత్తు గొప్పగా ఉండటమన్న మాటను ఆర్థికాభివృద్ధి, జిడిపి/జిఎస్‌డిపి కొలమానాల దృష్టితో అనటం లేదు. అవెంత ముఖ్యమో మానవాభివృద్ధి సూచికలు (హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్), వివిధ వర్గాల సాధికారీకరణ (ఎంపవర్‌మెంట్) లను కూడా గమనికలోకి తీసుకుని అంటున్న మాట ఇది.
‘తెలంగాణ వచ్చినట్లే లేదు’ అని బిల్లులోని ఆంక్షలను బట్టిగాని, కొత్త రాష్ట్రం భవిష్యత్తు ఎట్లుండగలదోనన్న చింతతో గాని విచారించనక్కరలేదని కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈ సమస్యలకు సంబంధించిన స్సృహ ఉండాలి, ఈ స్పృహతో సమస్యలకు పరిష్కారం అన్వేషించాలి తప్ప నిస్సృహ అక్కరలేదు. భారతదేశ చరిత్రలో 1947 నాటి స్వాతంత్ర్య సాధన వలే, తెలంగాణ చరిత్రలో 2014నాటి ప్రత్యేక రాష్ట్ర సాధనకు విశిష్టత ఉంటుంది. ఇటువంటి సంవత్సరాలు మైలురాళ్లవుతాయి. కొత్త భవిష్యత్తులకు అవకాశం ఏర్పడుతుంది. ఆ భవిష్యత్తును ఏ విధంగా నిర్మించుకోగలరన్నది పూర్తిగా ప్రజలపై ఆధారపడుతుంది. ఇది వారు తమ చరిత్ర, పౌరుషాలు, సాధనలు, వారసత్వంతో కొత్త సంకల్పాలు, కార్యచరణలకు పూనుకోవలసిన దశ.
2014ను చేరుకున్నందుకు, సాధించుకున్నందుకు ఆత్మవిశ్వాసం కలిగించుకోవాలి. ‘తెలంగాణ వచ్చినట్లే లేదు’ అన్న మనోభావనల నుంచి ‘మేము కోరుకునే తెలంగాణను కూడా తెచ్చుకుంటున్నాము’ అనే దిశగా కదలాలి.
ఇటువంటి ఆసక్తికర స్థితి, ఉద్యమాల చరిత్రలో అరుదైన విధంగా కనిపిస్తుంది. దాని గమనం విజయవంతమైతే ఒక్క భారతదేశంలోనే కాదు, మొత్తం ప్రపంచ దేశాల ఉద్యమాలకు తెలంగాణ కొన్ని పాఠాలు నేర్పగలదు.
Courtesy: Andhraprabha