mt_logo

సమ్మక్క-సారలమ్మ జాతరకు సర్వం సిద్ధం

తెలంగాణ కుంభమేళా, ఆసియాలోనే అతిపెద్ద జాతరగా ప్రసిద్ధి చెందిన సమ్మక్కసారలమ్మ జాతరకు సర్వం సిద్ధం అవుతోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను వేగంగా పూర్తి చేస్తుండగా… ఫిబ్రవరి 16 నుండి 19వ తేదీ వరకు ఈ మహా జాతర జరగనున్నట్టు సమ్మక్క సారలమ్మ పూజారుల సంఘం ప్రకటించింది. రెండేళ్లకు ఒకసారి వచ్చే ఈ మహా జాతరకు వివిధ రాష్రాల ముఖ్యమంత్రులు, రాష్ట్ర, కేంద్ర మంత్రులు హాజరవనున్నారు. రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు సైతం అమ్మవార్లను దర్శించకునేందుకు దాదాపు కోతికి పైగా రానున్నారు. జాతర చివరి రెండు రోజులు ఈ సంఖ్య మరింత పెరగనుంది. ప్రస్తుతం ప్రభుత్వం జాతరకు సంబంధించిన అభివృద్ధి పనులు చివరిదశలో ఉండగా జాతర పనుల కోసం ప్రభుత్వం ఇప్పటికే 75 కోట్లను విడుదల చేసింది. జాతరలో భాగంగా 16న సారలమ్మ కన్నెపల్లి నుంచి గద్దెపైకి రానుండగా, 17న చిలకల గుట్ట నుంచి సమ్మక్క గద్దెపైకి రానుంది. 18న భక్తులకు అమ్మవార్ల దర్శన కార్యక్రమాలు జరగగా, 19న అమ్మవార్లు తిరిగి వనప్రవేశం చేస్తారు. ఈ జాతరకు సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లా వివిధ శాఖల అధికారులతో జాతర పనులను ప్రభుత్వం చేపడుతోంది. జాతరకు సమయం దగ్గర పడుతుండటంతో పనుల్లో వేగం పెంచాలని అధికారులు కాంట్రాక్టర్లను ఆదేశించారు. జాతర సమయంలో రద్దీ ఎక్కువగా ఉంటుండటంతో కొందరు భక్తులు ఇప్పటి నుంచే అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకోవడానికి ఆ ప్రదేశానికి వస్తుండటంతో రోజురోజుకి మేడారంలో రద్దీ పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రజలు ఈ జాతరను అత్యంత ఘనంగా జరుపుకుంటారు. సమక్క సారక్క గద్దెల వద్ద మొక్కులు చెల్లించుకోవడానికి ముందు వేములవాడ, ధర్మపురి, కొండగట్టు దేవాలయాలను సందర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆయా దేవాలయాల్లో అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ప్రస్తుతం కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో జాతర ఎలా జరుగుతుందో అన్న ఆందోళనను సమీప నియోజకవర్గాల ప్రజలు వ్య క్తం చేస్తున్నారు. అయితే జాతరకు సంబంధించి కేంద్ర పర్యాటక శాఖ నుంచి ఎలాంటి నిధులు రాకపోగా, ఈ జాతరకు సంబంధించిన ఏర్పాట్లపై కనీసం కేంద్రమంత్రి సమీక్ష కూడా జరపలేదని భక్తులు ఆరోపిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *