తెలంగాణకు మరో భారీ పెట్టుబడి వచ్చింది. పైపులు, ఫిట్టింగ్స్ వంటి ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీలో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఆశీర్వాద్ పైప్స్ అలియాక్సిస్ గ్రూపు సంస్థ రాష్ట్రంలో రూ.500 కోట్ల పెట్టుబడితో తయారీ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. మంగళవారం దావోస్‌లో పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో సంస్థ ప్రతినిధులు తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకొన్నారు. తెలంగాణ నుంచే తమ ఉత్పత్తులను ఇతరదేశాలకు ఎగుమతి చేయాలని సంస్థ నిర్ణయించింది. ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాలు రెండోరోజున తెలంగాణ పెవిలియన్‌లో అలియాక్సిస్ కంపెనీ సీఎఫ్‌వో కోయెన్ స్టికర్.. మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు. అనంతరం స్టికర్ మాట్లాడుతూ.. తాము ఏర్పాటు చేయనున్న ప్లాంట్ ద్వారా స్టోరేజీ, డిస్ట్రిబ్యూషన్ పైప్స్, ఫిట్టింగ్స్ వంటి ప్లాస్టిక్ ఉత్పత్తులను తయారుచేస్తామని, దేశీయ మార్కెట్ల కోసం మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయి ఉత్పత్తులను కూడా ఇతర దేశాల కోసం తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకొన్నామని పేర్కొన్నారు. ఆశీర్వాద్ పైప్స్ సంస్థకు కేటీఆర్ ఆహ్వానం పలికారు. ఈ సంస్థ ద్వారా 500 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు లభిస్తాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్లాస్టిక్ ఉత్పత్తి రంగానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తుందని, ఆశీర్వాద్ పైప్స్ వల్ల ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులు తెలంగాణకు వస్తాయని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ సంస్థకు అన్ని విధాల సహాయ సహకారాన్ని అందిస్తామని చెప్పారు.

