mt_logo

లేని ఉద్యమాన్ని చూపెట్టడానికి పచ్చజ్యోతి పిచ్చి ప్రయత్నాలు

తెలంగాణ సమీపిస్తున్న కొద్దీ సీమాంధ్ర మీడియాకు గంగవెర్రులెత్తుతున్నాయి. సీమాంధ్ర రాజకీయ నాయకుల ప్రోద్బలంతో అక్కడక్కడా జరుగుతున్న చిన్నచిన్న కార్యక్రమాలను బ్యానర్ స్టోరీలు చేసి హడావిడి చేసేయడం ఇప్పుడీ సీమాంధ్ర మీడియాకు నిత్యకృత్యం అయ్యింది.

అదే పనిలో ఉన్న పచ్చజ్యోతి ఇవ్వాళ ఒక పిచ్చి వార్తను అచ్చేసింది.

“తెలంగాణ ఇస్తే…భగ్గే” అంటూ తొమ్మిదో పేజీలో అచ్చయిన వార్త చూస్తే అసలు ఈ పత్రిక ఎంత దిగజారిందో అర్థం అవుతుంది.

పైన శీర్షిక చూసి సీమాంధ్రలో ఏదో జరిగిపోతుందనుకునేరు, కింద వార్త చదివితే “సమైక్యాంధ్ర ఉద్యమం” అనే డ్రామా బండారం మొత్తం తనే బయటపెట్టింది పచ్చజ్యోతి.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై సీమాంధ్ర ప్రజల మనోగతం తెలుసుకోవడానికి కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీశాయట. సదరు అధికారులు “ఆంధ్రజ్యోతి” ప్రతినిధికి తమ నివేదికలోని అంశాలను వెల్లడించారట.

సదరు నివేదికలో  ఉన్నదిదీ:

* సమైక్యాంధ్ర కోసం పోరాటం ముఖ్యంగా రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేల సూచనల మేరకే జరుగుతోంది. టీడీపీ కంటే కాంగ్రెస్ నేతలే ఎక్కువగా సమైక్యాంధ్ర ఉద్యమానికి ఉత్సాహం చూపుతున్నారు.

అక్కడక్కడా టీడీపీ నాయకులు ఉద్యమం చేయాలని భావిస్తున్నా చంద్రబాబు సీమాంధ్ర ప్రాంతంలోనే పాదయాత్ర చేస్తుండడంతో దానిని విజయవంతం చేయడంపైనే దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఇదీగాక తమ నాయకుడు తెలంగాణకు అనుకూలంగా కేంద్రానికి లేఖ రాసిన దరిమిలా తాము ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెబుతున్నారు.

* సీపీఎం సమైక్యాంధ్రకు మద్దతు ఇచ్చినా ఉద్యమాల్లో ఎవరూ పాల్గొన వద్దని పార్టీ కార్యకర్తలకు ఆదేశాలు జారీ చేసింది.

* ఇప్పటి వరకూ కళాశాలల విద్యార్థులు చెప్పుకునే స్థాయిలో ఉద్యమంలో పాల్గొనడం లేదు. వారంతా ఏదో ఒక రాజకీయ పక్షం తరపున ఉద్యమంలో పాల్గొనడం కంటే స్వతంత్రంగా ఉద్యమాన్ని చేపట్టాలని భావిస్తున్నారు. సుమారు 22 కళాశాలల విద్యార్థులు ఈ రకమైన ఆలోచనతో ఉన్నారు. విద్యార్థి సంఘాల నాయకులు ఒకరితో మరొకరు నిత్యం ఫోన్లలో మాట్లాడుకుంటున్నారు. ఉద్యమాన్ని ఎలా చేపట్టాలి? చేపడితే అంతా ఒకేసారి ప్రారంభించాలనే నిర్ణయానికి మాత్రం వచ్చారు. కళాశాలలు మూతపడేంతగా ఈ ఉద్యమం జరిగే అవకాశాలున్నాయి. కొంతమంది విద్యార్థి సంఘాల నాయకులతో ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు సంప్రదింపులు జరుపుతున్నారు.

* ప్రజల్లో ఇప్పటి వరకూ సమైక్యాంధ్ర ఉద్యమం పట్ల అంత సానుకూలత కనిపించడం లేదు. వారిని ప్రత్యేకంగా మాట్లాడిస్తే మాత్రం తామంతా రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నామని చెబుతున్నారు.

* కొంతమంది మేధావులు, కళాశాలల ప్రిన్సిపాల్స్ ఈ విషయంలో చాలా ముభావంగా ఉన్నారు. వారిని కదిపితే సమగ్రంగా చర్చించడానికి చాలామంది సుముఖంగా కనిపించడం లేదు.


ఇదీ ఆ నివేదికలో ఉన్నది. ఇందులో చిన్నపిల్లవాడికైనా అర్థం అయ్యే విషయాలు

– అక్కడ “ఉద్యమం” కాంగ్రెస్ నాయకులు ఆడిస్తున్న డ్రామా
– అక్కడి ప్రజల్లో సమైక్యాంధ్ర భావన లేదు
– అక్కడ విద్యార్ధులు తరచూ ఫోన్లల్లో మాట్లాడుకోవడం మినహా పెద్దగా ఉద్యమాలేమీ చేయడం లేదు

అయినా పచ్చజ్యోతి దీనికి తనదైన భాష్యం చెప్పడానికి ప్రయత్నిస్తోంది. లోపల వార్తకు పైన శీర్షికకు పొంతనలేని కథనాలు. ఇప్పుడు ఉద్యమం లేదట, కానీ తెలంగాణ ఇస్తే మాత్రం భగ్గున మండుద్దట.

ఓ వైపు సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులే ఉద్యమం నడుపుతున్నారని నిస్సిగ్గుగా ఒప్పుకుంటూనే మరోవైపు ఇట్లాంటి పిచ్చిరాతలు రాయడం, తెలంగాణ ఏర్పాటుపట్ల సీమాంధ్ర మీడియాకు ఉన్న అసహనాన్ని సూచిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *